ఫండ్స్ ఇయ్యక అప్పులతో ఆర్టీసీ సతమతం

ఫండ్స్ ఇయ్యక అప్పులతో ఆర్టీసీ సతమతం

ఇంకో మూడు నెలల్లో కొత్త బడ్జెట్

హైదరాబాద్, వెలుగు: ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. లక్షల మందిని నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీని నిధుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అప్పులతోనే ఆర్టీసీ నడుస్తోంది. ప్రతి ఏటా అప్పులు , వాటి మీద చెల్లిస్తున్న వడ్డీ అంతకంతకు పెరుగుతోంది. బడ్జెట్ లో ఆర్టీసీకి నిధుల కేటాయింపులో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. నిధుల కేటాయింపు చాలా తక్కువ ఉండగా, వాటిని కూడా సకాలంలో విడుదల చేయకుండా ఆలస్యం చేస్తోంది. బడ్జెట్​లో కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవటం గమనార్హం.

రూ.1,500 కోట్లు కేటాయించిండ్రు

2022-23 ఫైనాన్షియల్​ ఇయర్​కు సర్కారు ఆర్టీసీకి రూ.1,500 కోట్లు  కేటాయించింది. వీటిలో రూ.850 కోట్లు, బస్ పాస్ రాయితీల కింద ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.650 కోట్లు రుణాల రూపంలో సమకూర్చుతామని ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్​రావు ప్రకటించారు.  వీటిలో గ్రేటర్ ఆర్టీసీకే రూ.500 కోట్లు దక్కే అవకాశముంది. అయితే, కొవిడ్ తో రెండేండ్లు నష్టాలు వచ్చిన ఆర్టీసీకి బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవని అప్పట్లో రవాణా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు ఎక్కువ తీసుకోకుండా మారటోరియం విధించి, బడ్జెట్​లో రూ.6 వేల కోట్లు కేటాయించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇచ్చింది రూ.216 కోట్లే

కొత్త బడ్జెట్ అమల్లోకి వచ్చి 7 నెలలు పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.216 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇటీవల మునుగోడు బైపోల్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఓట్ల కోసం హడావుడిగా 3 డీఏలకు రూ.90 కోట్లు విడుదల చేసింది.  మరో మూడు నెలల్లో కొత్త బడ్జెట్ రానుంది. మిగిలిన నిధులు సకాలంలో విడుదల చేయాలని ఆర్టీసీ అధికారులు ఫైనాన్స్ అధికారులను కోరుతున్నా స్పందన లేదు.

సీసీఎస్ కు రూ.900 కోట్ల బకాయిలు

ఆర్టీసీ కార్మికులకు లోన్లు ఇచ్చే క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ( సీసీఎస్ ) కి మేనేజ్ మెంట్ అసలు, వడ్డీ కలిపి రూ.900 కోట్ల బకాయి ఉంది. మేనేజ్ మెంట్ ఇవ్వకపోవడంతో కార్మికులకు గత రెండేండ్ల నుంచి సీసీఎస్ లోన్లు ఇవ్వడం లేదు. లోన్ కోసం కార్మికులు పెట్టుకున్న 6 వేల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఈ బకాయిలు విడుదల చేయడం లేదని సీసీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆర్టీసీ మేనేజ్ మెంట్​కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న విచారణ జరగనుంది. రెండేండ్ల కింద కూడా బకాయిలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు సీరియస్ కావడంతో సీసీఎస్ బకాయిలను ఆర్టీసీ విడుదల చేసింది.

కేటాయింపులకు, విడుదలకు పొంతన ఉంటలె

సర్కారు బడ్జెట్​లో కేటాయించే నిధులు ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే వరకు కూడా విడుదల చేయడం లేదు. గత ఏడాది రూ.3 వేల కోట్లు కేటాయిస్తున్నం అని ప్రకటించి.. రూ.650 కోట్లు క్యాష్ ఇచ్చి మిగతావి అప్పుల రూపంలో ఇస్తామని చెప్పింది. దీని వల్ల ఆర్టీసీకి అప్పులు, వడ్డీ పెరుగుతున్నయ్. సర్కార్​ నుంచి వచ్చేది తక్కువే ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్​లో రూ.1,500 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 650 కోట్లు లోన్ కు షూరిటీ ఇస్తామని ప్రకటించింది. ఇలా కేటాయింపులకు నిధుల విడుదలకు పొంతన ఉండట్లేదు. బస్ పాస్​ల రాయితీ నిధులు కూడా సకాలంలో  విడుదల చేయడం లేదు. సీసీఎస్ నిధులు ఆర్టీసీ ఉపయోగించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది. వాటిని వెంటనే విడుదల చేయాలి. బ్యాంకుల నుంచి తెస్తున్న అప్పులు, వడ్డీ కడుతున్న ఆర్టీసీ మేనేజ్ మెంట్ సీసీఎస్ కు ఎందుకు కట్టడం లేదు. 
- వీఎస్ రావు, ఎస్ డబ్ల్యూ ఎఫ్ జనరల్ సెక్రటరీ