27న వెల్ఫేర్ బోర్డులతో ఆర్టీసీయాజమాన్యం మీటింగ్

27న వెల్ఫేర్ బోర్డులతో ఆర్టీసీయాజమాన్యం మీటింగ్
  • ఇది హామీల ఉల్లంఘన అంటూ ఆర్టీసీ జేఏసీ నేతల ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు ఈ నెల 27న హైదరాబాద్ లోని ఆర్టీసీ కళా భవన్ లో రాష్ట్ర స్థాయి ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డుల సమావేశాన్ని యాజమాన్యం ఏర్పాటు చేసింది. గురువారం ఆర్టీసీ యాజమాన్యం పేరుతో లేఖను విడుదల చేశారు. ఆర్టీసీలో యూనియన్ల గుర్తింపును రద్దు చేసిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి స్థానంలో డిపోలు, వర్క్ షాపుల వారీగా వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశం ఏర్పాటు చేయడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు మండిపడుతున్నారు.

 జేఏసీ చైర్మన్, టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి ఈ మీటింగ్ ఏర్పాటుపై తీవ్రంగా స్పందిస్తూ.. గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మీటింగ్​ను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం కార్మికులను, ఉద్యోగులను రెచ్చగొట్టడమేనని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కో చైర్మన్ హన్మంతు ముదిరాజ్, ఇతర నేతలు ఆరోపించారు. మీటింగ్ ను నిర్వహించకుండా మంత్రి పొన్నం చర్యలు తీసుకోవాలని, లేదంటే  జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు.