ఆర్టీసీ బస్ టిక్కెట్ రేట్ పెంచాలి

ఆర్టీసీ బస్ టిక్కెట్ రేట్ పెంచాలి

హైదరాబాద్: బస్ టిక్కెట్ ధరలను పెంచాల్సిందిగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు. డీజిల్ ధరలు పెరిగినప్పుడు బస్సు టిక్కెట్ ధరలు పెంచడం సాధారణమే అని.. చివరిసారిగా రెండేళ్ల కింద ఇదే రోజున టిక్కెట్ రేట్లు పెంచామని గుర్తు చేశారు. అయితే సరిగ్గా అదే సమయానికి కొవిడ్ రావడంతో యాజమాన్య ఉద్యోగులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. కరోనా తొలి వేవ్ సమయంలో సంస్థ నష్టాల్లో పడిందని.. దాని నుంచి కోలుకునే లోపే సెకండ్ వేవ్ వచ్చిందన్నారు. ఇది ఆర్టీసీకి పెద్ద దెబ్బ అని చెప్పారు. కొవిడ్ టైమ్లో అవసరం ఉన్న చోట బస్సులు నడిపామని.. దీని వల్ల దాదాపు 251 మంది సంస్థ ఉద్యోగులు అమరులయ్యారని సజ్జనార్ పేర్కొన్నారు. 

డీజిల్ రేట్ల పెరుగుదలతో నష్టాలు

‘సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఆర్టీసీ పని చేస్తోంది. కొవిడ్, వరదలు ఏవొచ్చినా బస్సులు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం డీజిల్ ధరలు పెరిగాయి. వీటితోపాటు స్పేర్ పార్ట్స్ ధరలు, మెషినరీలు, ఎక్విప్ మెంట్స్ ఇలా అన్నింటి రేట్లూ పెరిగాయి. కేవలం డీజిల్ ధరలు పెరుగదల వల్లే సంస్థకు సుమారు రూ.468 కోట్ల నష్టం వాటిల్లింది. గతేడాది రూ.2,330 కోట్ల నష్టం కలిగింది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దాదాపు రూ.1,440 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాల నుంచి ఆర్టీసీని బయట పడేసేందుకు టిక్కెట్ ధరలను పెంచక తప్పదు. ఈ విషయాన్ని మేం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. టిక్కెట్ రేట్ల పెంపు అంశాన్ని పరిశీలించాలని యాజమాన్యం మరోసారి ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని సజ్జనార్ అన్నారు.  

‘టిక్కెట్ రేట్ల విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు పెంచాలని కోరుతున్నాం. డీలక్స్, మెట్రో, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడతోపాటు అన్ని సర్వీసులకు కిలో మీటర్ కు 30 పైసలు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీని వల్ల నష్టాలను కొంత మేర పూడ్చగలం. గత మూడు నెలలుగా ప్రజల ఆదరణ కూడా పెరిగింది. ఇది శుభపరిణామం. డీజిల్ ధరల పెరుగుదల వల్ల చాలా మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు’ అని సజ్జనార్ చెప్పారు.