తెలంగాణ లో మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

తెలంగాణ లో మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  •     ఇప్పటివరకు 6 కోట్లకు పైగా మహిళలు జర్నీ
  •     ఈ ఏడాది ఆర్టీసీని ఆదరించండి
  •      త్వరలో కార్మికులకు బకాయిలు చెల్లిస్తం
  •     ఎంజీబీఎస్​లో ప్యాసింజర్లతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ న్యూ ఇయర్ వేడుకలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 6 కోట్ల 60 లక్షల మంది మహిళలు జర్నీ చేశారని తెలిపారు. ఇందులో అధికారులు, కార్మికుల కృషి ఎంతో ఉందని అభినందించారు. సోమవారం ఎంజీబీఎస్​లో ప్యాసింజర్లతో కలిసి న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. అనంతరం బెంగళూరు, కోదాడ బస్సుల్లోకి వెళ్లి ప్యాసింజర్లతో మాట్లాడారు. ఆర్టీసీని ప్యాసింజర్లు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆదరించాలని కోరారు.

స్కీమ్ అమలుపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహాకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారని ఎండీ తెలిపారు. కార్మికుల పెండింగ్ పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లిస్తామని, ఎలాంటి ఆందోళన వద్దని సూచించారు. దశల వారీగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ఆదరిస్తున్న ప్రయాణికులను సన్మానించారు.  సీవోవో రవీందర్, ఈడీలు, ఆర్ ఎంతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.

అనంతరం సికింద్రాబాద్ లోని కార్ఖానా జనక్ పురి కాలనీలోని ఆర్కే మదర్ థెరిస్సా ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి వెళ్లి 45 మంది వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు, ఫుడ్ అందించారు.  తల్లిదండ్రులు కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలని, వారిని పిల్లలు నిర్లక్ష్యం చేయొద్దని హితవు పలికారు. నిరాశ్రయులైన వృద్ధులను చేరదీసి.. వారికి ఉచిత వసతి, వైద్యం అందిస్తున్న ఆర్కే మదర్ థెరిస్సా ఫౌండేషన్ ఫౌండర్ రామకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.