
నకిరేకల్, వెలుగు: బస్సులో ఓ వ్యక్తి రూ.లక్ష ఉన్న బ్యాగును మర్చిపోగా.. తిరిగి బాధితుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు ఆర్టీసీ సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మహిళా ప్రయాణికులు సోమవారం మధ్యాహ్నం సూర్యాపేట కొత్త బస్ స్టేషన్ లో నల్గొండ వెళ్లే బస్సు ఎక్కారు. వెంటనే దిగారు. ఈ క్రమంలో రూ.లక్ష, తమ దుస్తులు ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయారు. బస్సు వెళ్లిపోయిన కాసేపటికి గుర్తించి, నకిరేకల్ లోని తమ బంధువులకు సమాచారం అందించారు. వారు వెంటనే నకిరేకల్ కంట్రోలర్ మన్నాన్ కు విషయం చెప్పడంతో ఆయన సూర్యాపేట కంట్రోలర్ కు సమాచారం అందించారు. అక్కడినుంచి బస్ కండక్టర్ సత్తయ్యకు కాల్ చేయగా.. సదరు బ్యాగును నకిరేకల్ లో బాధితుల బంధువులకు అప్పగించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు.