పోస్టాఫీసు ఖాతాదారులకు ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ సేవలు

పోస్టాఫీసు ఖాతాదారులకు ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ సేవలు

న్యూఢిల్లీ: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్​న్యూస్! బ్యాంకు అకౌంట్​హోల్డర్ల మాదిరే ఇక నుంచి వీళ్లకూ నెఫ్ట్​, ఆర్టీజీఎస్​ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని డిపార్ట్​మెంట్​ ఆఫ్ పోస్ట్స్ (డీఓపీ) ప్రకటించింది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాదారులకు (పీఓఎస్​బీలు) డిజిటల్ పేమెంట్స్​ సర్వీసులను అందిస్తామని  తెలిపింది.  ప్రస్తుతం ఈ రెండు సేవలు ప్రయోగదశలో ఉన్నాయని, ఖాతాదారులు ఈ నెల 31 నుంచి నెఫ్ట్/ఆర్టీజీఎస్ సేవను ఉపయోగించుకోవచ్చని డీఓపీ తెలిపింది. ఇందుకు సంబంధించిన స్టాండర్డ్​ ఆపరేటింగ్​ ప్రొసీజర్లను కూడా ఖరారు చేశామని డీఓపీ వెల్లడించింది.
 

నెఫ్ట్ & ఆర్టీజీఎస్ అంటే ఏమిటి?
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్​ఫర్​ (నెఫ్ట్) అనేది ఇంటర్​బ్యాంక్​ పేమెంట్​ విధానం. దీనిని రోజులో 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు ఉపయోగించవచ్చు.  మన ఖాతా నుంచి వేరే వాళ్ల ఖాతాకు ఎప్పుడైనా డబ్బు పంపించడానికి వీలు కల్పిస్తుంది. ఆర్​బీఐ ద్వారా అరగంటకు ఒకసారి బ్యాచ్​ల వారీగా బ్యాంకులు పంపే లావాదేవీలు పూర్తి అవుతాయి.  నెఫ్ట్ ‘మెసేజ్​ ట్రాన్స్​మిషన్​’ కోసం  డీఓపీ సీబీఎస్​ ను ఐపీపీబీ ఎంక్యూ సర్వర్​తో లింక్ చేశారు. ఆర్టీజీఎస్ అంటే రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఇది రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్​ఫర్​ సెటిల్మెంట్ సిస్టమ్. దీనిద్వారా ‘ఇండివిడువల్​ ఫండ్​ ట్రాన్స్​ఫర్​ ఇన్​స్ట్రక్షన్​’ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఆర్టీజీఎస్ సేవలు సంవత్సరంలో 365 రోజులూ అందుబాటులో ఉంటాయి. పోస్టాఫీసుతోపాటు మొబైల్​/వెబ్​ ద్వారా ఈ రెండు ట్రాన్సాక్షన్లను పూర్తి చేయవచ్చు. రూ.రెండు లక్షల నుంచి రూ.10 లక్షల లోపు విలువైన లావాదేవీలకు ఈ విధానం ఉపయోగిస్తారని డీఓపీ తెలిపింది.
 

నెఫ్ట్ & ఆర్టీజీఎస్ ఛార్జీలు, పరిమితి
రూ.10 వేల వరకు డబ్బు పంపితే- రూ.2.50+ జీఎస్టీ చెల్లించాలి. రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిగే లావాదేవీలకు- రూ.5 + జీఎస్టీ అవుతుంది. రూ.లక్ష  నుంచి  రూ.2 లక్షల వరకు అయితే- రూ.15 + జీఎస్టీ చెల్లించాలి. రూ.రెండు లక్షల కంటే ఎక్కువ పంపితే రూ.25 + జీఎస్టీ కట్టాలి.ఈ–బ్యాంకింగ్, మొబైల్​ బ్యాంకింగ్​ ద్వారా చేసే నెఫ్ట్​ ట్రాన్సాక్షన్లకు చార్జీలు ఉండవు. నెఫ్ట్​ ద్వారా రూపాయి నుంచి రూ.15 లక్షల వరకు పంపవచ్చు. ఒక్కసారి రూ.రెండు లక్షల కంటే ఎక్కువ పంపడం సాధ్యం కాదు. రోజుకు ఐదు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. నెఫ్ట్​ద్వారా రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పంపుకోవచ్చు. అయితే ఈ–-బ్యాంకింగ్, మొబైల్​ బ్యాంకింగ్​ ద్వారా రాత్రి ఎనిమిదింటి నుంచి ఉదయం ఎనిమిదింటిలోపు రూ.రెండు లక్షలకు మించి పంపడానికి వీలు ఉండదు. నెఫ్ట్​, ఆర్టీజీఎస్​ సేవల్లో ఏవైనా ఇబ్బందులు వస్తే కస్టమర్లు ఇండియా పోస్ట్ కస్టమర్ కేర్ నంబర్ 1800 2666 868 ద్వారా కంప్లైంట్​ ఇవ్వవచ్చు. లేదా ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/VAS/Pages/ComplaintRegistration.aspxలోని ఫిర్యాదుల విభాగం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా పోస్టాఫీసు శాఖనూ సంప్రదించవచ్చని డీఓపీ తెలియజేసింది.