‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్.. ‘కాంతార: ఛాప్టర్ 1’తో బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది. తన సహజ సిద్ధమైన నటనతో పాటు కళ్ళతోనే భావాలను పలికించే తీరు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ క్రమంలో ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌కు జంటగా ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాలో ఆమె నటిస్తోంది.
తాజాగా శర్వానంద్‌కు జంటగా శ్రీను వైట్ల సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కార్తీక్ ఆర్యన్ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని బీటౌన్ టాక్. ‘కిల్’ సినిమాతో యాక్షన్ సినిమాల శైలిని మార్చేసిన దర్శకుడు నిఖిల్ నగేష్ భట్.. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇందులో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్ దాదాపు ఖాయమైనట్టు సమాచారం. ఈ ముగ్గురి కలయికపై అంచనాలు నెలకొన్నాయి. ఇక యశ్‌కు జంటగా ఆమె నటించిన ‘టాక్సిక్’ మార్చిలో రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇటు సౌత్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ తనకు మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
