
హెచ్1బీ, ఎల్1బీ వీసా రూల్స్‌ను సడలించిన ట్రంప్ సర్కార్
వీసా బ్యాన్‌కు ముందు జాబ్ చేసినోళ్లకు చాన్స్
ఫ్యామిలీ, డిపెండెంట్లతో పాటు రావొచ్చని వెల్లడి
దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయమని ప్రకటన
వాషింగ్టన్: హెచ్1బీ, ఎల్1 వీసాదారులకు ట్రంప్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వీసాల రూల్స్‌లో కాస్త సడలింపులిచ్చింది. వీసా బ్యాన్‌కు ముందు అక్కడ ఉద్యోగం చేసిన వాళ్లు అమెరికా తిరిగి వచ్చి జాబ్ చేసుకోవచ్చని చెప్పింది. వాళ్ల ఫ్యామిలీ మెంబర్లతో (భార్యా, పిల్లలు) కలసి యూఎస్ రావొచ్చంది. కొన్ని కేటగిరీల జే1 వీసాదారులకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రయోజనాల కోసం వారికి అవకాశం ఇచ్చామని చెప్పింది.
పాత జాబ్ చేసుకోవచ్చు
అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని తిరిగి కొనసాగించాలనుకుంటున్న హెచ్1బీ, ఎల్1 వీసాదారులు ఆ ఉద్యోగాన్ని అదే స్థానంలో చేసుకోవచ్చని, వీసా వర్గీకరణతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. హెల్త్ కేర్ రంగం, కరోనాకు సంబంధించిన జాబులు చేసేవాళ్లు, పబ్లిక్ హెల్త్‌కు సంబంధించి ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్న వాళ్లు హెచ్1బీ వీసా మీద ఉంటే వాళ్లూ రావొచ్చని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత వాళ్ల స్థానంలో కొత్త వాళ్లను తీసుకుంటే కంపెనీలకు ఆర్థికపరమైన ఇబ్బందులొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే తాము సూచించిన ఐదు ఇండికేటర్లలో ఏవైనా రెండు సరిపోతే ఆ హెచ్1బీ వీసాదారులను అనుమతించొచ్చంది.
ఎల్1బీ వీసాలకు ఇట్లనే
ఎల్1 వీసాలకు కూడా హెచ్1బీ వీసాల్లానే సడలింపులిచ్చినట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. అయితే అమెరికాలో కొత్త ఆఫీసు ఓపెన్ చేయాలనుకునే వాళ్లకు ఈ సడలింపులు వర్తించవంది. తాము సూచించిన మూడు కేటగిరీల్లో రెండు సరిపోవడంతో పాటు అమెరికాకు చెందిన వర్కర్లు ఐదుగురికన్నా ఎక్కువ మంది డైరెక్టుగా గానీ, ఇండైరెక్టుగా గానీ ఉపాధి పొందితే మాత్రం సడలింపులు వర్తిస్తాయంది. ఎల్1బీ వీసా హోల్డర్ల డిపెండెంట్లకూ సడలింపులు వర్తిస్తాయంది.
ఈ ఏడాది చివరి వరకు నిషేధం
కరోనా వైరస్ కారణంగా రికార్డుస్థాయిలో నిరుద్యోగం పెరగడంతో హెచ్1బీ సహాకొన్ని ముఖ్యమైన నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్లు ఈ ఏడాది చివరి వరకు అమెరికా రాకుండా ఈ జూన్‌లో ట్రంప్ సర్కా రు నిషేధం విధించిన విషయం తెలిసిందే. వర్క్ వీసాలపై నిషేధం జూన్ 24 నుంచి అమల్లోకి వస్తుందని, 2020 డిసెంబర్ 31 వరకు ఇది అమల్లో ఉంటుందని అమెరికా అధికారిక ప్రకటన చేసింది. నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయంది. అయితే అమెరికా పౌరసత్వం ఉన్నవారి భార్య, పిల్లలు, ఆహార సరఫరా రంగంలో ఉన్నవారికి ఈ నిషేధం వర్తించదంది. యూఎస్‌లో గ్రాడ్యుయేషన్ తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అర్హత పొందిన విదేశీ స్టూడెంట్లకూ ఈ రూల్స్ వర్తించవంది.
For More News..