ఎమ్మెల్సీ పదవులతో ఎర వేస్తున్నరు

ఎమ్మెల్సీ పదవులతో ఎర వేస్తున్నరు

ఏ పొలిటీషియన్​కు అయినా పదవే ముఖ్యం. పదవి పోయిందంటే వారికి ప్రాణం పోయినట్టే. అందుకే పదవి కోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పార్టీలు మారుతుంటారు. పొలిటికల్​ ఈక్వేషన్ల కోసం పార్టీల అధినేతలకు ఎక్కువగా ఉపయోగపడేది ఎమ్మెల్సీ పదవే. వేరే పార్టీల వారికి ఎర వేయాలన్నా.. ఉన్న వారిని నిలుపుకోవాలన్నా.. అసెంబ్లీ ఎన్నికల టైంలో అసంతృప్తులను చల్లార్చాలన్నా అన్నింటికీ మండలి సీటే కావాలి.రాజకీయాల్లో యాక్టివ్​గా ఉండాలనుకునేవారు ఎప్పుడైనా పలుకుబడి గల స్థానంలోనే కొనసాగాలనుకుంటారు. ఈ లెక్కన చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దొరికినప్పుడు శాసన మండలి కన్నా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటారు. ఎందుకంటే ఒక్క జీతభత్యాల దగ్గర సారూప్యత తప్ప శాసనసభ, మండలి సభ్యుల మధ్య ఏ కోణంలో చూసినా చెప్పుకోదగ్గ వ్యత్యాసాలు కనబడతాయి. ఏ మీటింగ్​లోనైనా ఎమ్మెల్యే పక్కన హుందాగా ఎమ్మెల్సీ కూడా కనబడుతుంటారు. కాబట్టి మామూలు జనాలకు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీకి మధ్య ఉన్న తేడా పెద్దగా తెలియకపోవచ్చు.  కానీ ఎవరి బలం వారికి స్పష్టంగా  తెలుసు. మన దేశంలో మొత్తం 28 రాష్ట్రాలుంటే ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండలి ఉంది. మండలిని రద్దు చేసుకునే లేదా కొనసాగించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో  ఉంటుంది. కాబట్టి దాని నిర్వహణ అనవసరపు ఖర్చు అనుకున్న రాష్ట్రం కౌన్సిల్​ను తొలగించి వేస్తే, ఖాళీగా ఉన్న పార్టీ నేతలకు పదవి కట్టబెట్టాలనే తలంపు ఉన్న రాష్ట్రాలు వాటిని కొనసాగిస్తుంటాయి. 

ప్రతిపక్షాలు గెలవడం గొప్పే

ఎన్నికల ఖర్చును తట్టుకోలేనివారు, పార్టీకి దీర్ఘకాలం విధేయులై ఉండి ప్రజల్లో అంతగా పేరు సాధించనివారు ఎమ్మెల్యే కాలేకపోయినా ఎమ్మెల్సీ అయితే చాలనుకుంటారు. సంఖ్యా బలం ఉన్న పాలక పక్షానికి ఇది తేలికైన పనే. ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు మాత్రం ఎమ్మెల్సీగా గెలవడం గొప్ప విషయమే. తెలంగాణలోని 40 ఎమ్మెల్సీ సీట్లలో చెరి 3 చొప్పున గ్రాడ్యుయేట్లకు, టీచర్లకు ఉన్నాయి. వీటిని మాత్రమే బయటి పార్టీలు, ఇండిపెండెంట్​ అభ్యర్థులు అప్పుడప్పుడు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఉపాధ్యాయ నేతలు ఎక్కువగా ఆ సీట్లను సాధించుకోవడం చూస్తుంటాం. గ్రాడ్యుయేట్​ సీట్లు రాజకీయ పార్టీల వాళ్లే ఎగరేసుకుపోతారు. ప్రస్తుతం తెలంగాణ మండలిలో టీచర్​ ఎమ్మెల్సీలుగా ఇండిపెండెంట్లు ఉండగా గ్రాడ్యుయేట్​ కోటాలో కాంగ్రెస్ నేత టి.జీవన్ రెడ్డి, మరో స్థానానికి మజ్లిస్ సభ్యుడు పోగా మిగిలిన వారంతా టీఆర్ఎస్​ వారే.

పదవి దక్కకుంటే తెరమరుగే

తెలుగుదేశంలోని బలమైన నేతలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ సీట్లు ఆఫర్ చేశారు. ఆ క్షణం వారికి పదవీ వ్యామోహం తీరినా తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డవారున్నారు. దీనికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంచి ఉదాహరణ. 2018లో టీఆర్ఎస్​ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆయనకు మంత్రి పదవి ఈయకపోవడంతో ఆయన హోదా సాధారణ ఎమ్మెల్సీ స్థాయికి పడిపోయింది. తన జిల్లాలో మంత్రి పదవులు దక్కిన ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ ముందు తాను జీరో అయిపోయారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ దక్కినా పాత వైభవం తిరిగి వచ్చే అవకాశం కనబడటంలేదు. ఎమ్మెల్సీ పదవి దక్కకుంటే ఇక రాజకీయంగా తెరమరుగే.  ఇది గ్రహించిన కడియం అసెంబ్లీ ఎన్నికల్లో తన కూతురుకు సీటు ఇప్పించేందకు ఎన్ని పాట్లు పడ్డా ఫలితం లభించలేదు. ఇప్పుడాయన తన ప్రతిభ కన్నా పార్టీ అధినేత దయపై ఆధారపడవలసి వస్తోంది. మాజీ హోం మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేకుండేది. ఆయనకు 2018లో అసెంబ్లీ టికెట్ ఇవ్వక, కొత్త మంత్రివర్గంలో చోటు ఇవ్వక చివరి రోజుల్లో పార్టీ చాలా ఇబ్బంది పెట్టిందనవచ్చు. ఆయన తన ఆక్రోశాన్ని వెలిబుచ్చిన వీడియోలు యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. గత కేబినెట్ లో ఒక వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ ఆయన్ని పూర్తిగా దూరం పట్టింది. ఎమ్మెల్సీ అయినా మహాభాగ్యమని భావిస్తూ ఆయన మంచి ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.

ఎల్.రమణను లాక్కునే వ్యూహం

ఈటల రాజేందర్ టీఆర్ఎస్​కు దూరమవడంతో కరీంనగర్ కు చెందిన మరో బీసీ నేత, టీటీడీపీ అధ్యక్షుడు అయిన ఎల్.రమణ పేరు తెరపైకి వచ్చింది. రమణకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల్లోంచి ఒకటి ఆఫర్ చేసి పార్టీలోకి లాక్కోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవిని డబుల్ ఎడ్జిడ్ నైఫ్ అనవచ్చు. క్రియాశీల నేతలకు ఎమ్మెల్సీ పొసగని ఉద్యోగమే. ఎమ్మెల్సీ కన్నా పార్టీలో ఏదో హోదాలో ఉంటూ లేదా ఏదైనా రాజ్యాంగ పదవి తీసుకుని ఎన్నికల సమయం దాకా ఓపికపట్టి అసెంబ్లీలో అడుగు పెట్టడం రాజకీయ జీవితానికి తగిన సోపానం అనవచ్చు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దేని విలువ దానికున్నా రేపటి సుదీర్ఘ  రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.

సీఎం ఇష్టానుసారమే సీట్ల భర్తీ

ఈ మధ్యన మండలిలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. అవన్నీ ఎమ్మెల్యే కోటా లోనివే. కాబట్టి ఈ సీట్లు పూర్తిగా సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా భర్తీ అవుతాయి. అయితే ఎవరు మరోసారి కొనసాగుతారు, ఎవరు ఔట్  అవుతారు అనేది పూర్తిగా అధినేత దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మండలి సభ్యుడు ఇరకాటంలో పడేది. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే టికెట్ కోసం పోటీపడవచ్చు. ఎదిరించి స్వతంత్రంగా బరిలోకి దిగవచ్చు. మండలిలో ఆ అవకాశం లేదు. పదవి పొతే కరివేపాకు బతుకే. మండలి సభ్యుడికి ఎదురయ్యే మరో చిక్కేమిటంటే అసెంబ్లీ ఎన్నికల సమయాన టికెట్ అడగరాదు, తన టర్మ్ పూర్తయే నాటికీ ఎన్నికలు దాటిపోతాయి. ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉండటం వల్ల తన సత్తా చాటుకునే, అధికారం వెలగబెట్టే ఛాన్సే దొరకదు. 

- బి.నర్సన్,పొలిటికల్​ ఎనలిస్ట్