సర్కార్ తీరుపై రూలింగ్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్

సర్కార్ తీరుపై రూలింగ్ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్
  • ప్రత్యామ్నాయ పంటలకు సీడ్​ దొరకట్లే
  • చెరువుల్లో చేపలు వేస్తలేరు
  • అక్రమంగా మట్టి, ఇసుక రవాణా
  • స్కూళ్లకు టీచర్లు టైంకి వస్తలేరు
  • హనుమకొండ జడ్పీ మీటింగ్‍లో అధికార పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీల ఫైర్‍

వరంగల్‍, వెలుగు: జిల్లాలో మిల్లర్లంతా సిండికేట్‍ అయిన్రు. తరుగు పేరుతో వడ్ల కొనుగోలులో చీటింగ్‍ చేస్తున్రు. ఐకేపీ సెంటర్లలో చిరిగిపోయిన గన్నీ సంచులే ఉంటున్నయ్‍. ప్రత్యామ్నాయ పంటలకు సీడ్‍ దొరకట్లే. పంట దాచుకోడానికి ఎక్కడా గోడౌన్లు లేవు. రైతులు దుమ్మెత్తిపోస్తున్నరు. పేపర్లో వచ్చే న్యూస్‍ వాస్తవమే.
- జడ్పీటీసీల ఫైర్‍

చెరువుల్లో చేపల పంపిణీ ఉట్టి ముచ్చటే. బయటకు చెప్పేది వేరు. చెరువుల్లో పోసేది వేరు. అది తెలియకుండా ఉండేందుకే అధికారులు సీక్రెట్‍గా పని పూర్తి చేస్తున్నారు. కోట్ల రూపాయల స్కీం ఉట్టిదే అవుతోంది.    
- ఎంపీపీల మండిపాటు

మట్టి మాఫియా వందలాది ట్రాక్టర్లతో రోజూ వేలాది ట్రిప్పుల మట్టి, ఇసుక కళ్ల ముందే అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్‍ ఆఫీసర్లకు కనపడదు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోరు. 
- లీడర్ల ఆగ్రహం

సర్కారు బడుల్లోని టీచర్లు ఉదయం 11 దాటాక వచ్చినా.. స్కూల్‍ కు రాకుండా ఒకరి బదులు ఇంకొకరు సిగ్నేచర్‍ చేసినా డీఈఓకు కనపడదు. తను తనిఖీలకు వెళ్లరు. సాక్ష్యాలతో ఫిర్యాదిచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. 
- మెజార్టీ ప్రజాప్రతినిధుల కంప్లైంట్‍

హనుమకొండ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు, అస్తవ్యస్తంగా మారిన పాలనపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం ఇది. జడ్పీ ఆఫీస్‍లో బుధవారం చైర్‍పర్సన్‍ గండ్ర జ్యోతి అధ్యక్షతన వరంగల్‍ జడ్పీ మీటింగ్‍ హాట్‍హాట్‍గా జరిగింది. వడ్ల కొనుగోలు సెంటర్లలో మిల్లర్లు సిండికేట్‍గా మారి రైతులను ఇష్టారీతిన దోచుకుంటున్నారని శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మండిపడ్డారు. 40.7 కిలోలు తూయాల్సినచోట 43 నుంచి 44 కిలోలు తీసుకుంటున్నారని.. రైతులు దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. పేపర్లలో వస్తున్న న్యూస్‍ వాస్తవమే అన్నారు. సెంటర్లలో గన్నీ సంచులు అందుబాటులో లేవని వర్థన్నపేట, సంగెం జడ్పీటీసీలు మార్గం భిక్షపతి, గూడ సుదర్శన్‍రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. గన్నీ బ్యాగుల సమస్య చాలా తీవ్రంగా ఉందని.. ఐకేపీ సెంటర్లలో చిరిగిపోయిన సంచులే ఉన్నాయని వర్థన్నపేట ఎంపీపీ అన్నమనేని అప్పారావు మండిపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే క్రమంలో రైతులకు విత్తనాల సమస్య ఉందని.. సమస్య ఇలానే ఉంటే ఇబ్బందులు తప్పవని కలెక్టర్‍ గోపికి విన్నవించారు. రైతులకు పంపిణీ చేసిన పశువులు చనిపోతున్నాయని చెప్పుకొచ్చారు. పంట మార్పిడి నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పూర్తిస్థాయిలో స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు. 

చేప పిల్లల పంపిణీ, మైనింగ్‍పై.. 
చెరువుల్లో చేప పిల్లల పంపిణీ వ్యవస్థ సరిగా లేదని, అధికారులు చెప్పే లెక్కకు, పోసే చేపలకు చాలా తేడా ఉంటోందని.. అందుకే ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా సీక్రెట్‍గా పోసి వెళ్తున్నారని ఎంపీపీ తిరుపతిరెడ్డి మండిపడ్డారు. ఈ స్కీం మీద కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే వేరేదానిపై పెట్టడం బెటర్‍ అన్నారు. తమ ప్రాంత చెరువుల్లో చేపల పంపిణీ ఎందుకు చేయట్లేదని గీసుగొండ, పర్వతగిరి జడ్పీటీసీలు పోలీస్‍ ధర్మారావు, సింగ్‍లాల్‍ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 కోట్ల చేపలు రావాల్సినచోట కేవలం 58 లక్షలు మాత్రమే వచ్చినట్లు ఏడీ నరేష్‍ బదులిచ్చారు. లంబాడా తండాలను కేసీఆర్‍ జీపీలు చేసినప్పుడు.. అక్కడి చెరువులపై లంబాడాలకు హక్కు ఎందుకివ్వరని సింగ్‍లాల్‍ ప్రశ్నించారు. సమావేశంలో మైనింగ్‍ శాఖ తీరుపై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళారులు తీసుకున్న పర్మిషన్‍ కంటే ఎక్కువగా తరలిస్తున్నా వారితో చేతులు కలపడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్వతగిరిలో 150 ట్రాక్టర్లతో రోజూ మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తున్న విషయం మీకు తెలియదా అంటూ ఏడీ రవీందర్‍పై సింగ్‍లాల్‍, అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పరపల్లి జంక్షన దగ్గర చెకింగ్‍ పెడితే.. 500 ట్రాక్టర్లు దొరుకుతాయని చెప్పారు.

టీచర్ల డుమ్మాపై డిస్కషన్‍ 
గవర్నమెంట్‍ స్కూళ్లలో పనిచేసే టీచర్లు డ్యూటీకి డుమ్మా కొట్టడంపై సమావేశంలో డిస్కషన్‍ నడిచింది. డీఈఓ వాసంతి పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. టీచర్లు ఉదయం 11 గంటలు దాటాక వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోతున్నారని అన్నారు. క్లాసులతో సంబంధం లేకుండా రైళ్ల టైమింగ్‍ పాటిస్తున్నారని చెప్పారు. ఒక్క టీచరే వచ్చి మిగతావారు వచ్చినట్లు సంతకం చేస్తున్నా పట్టించుకోవట్లేదని అన్నారు. డీఈఓ ఎలాగూ తనిఖీలు చేయరని, తాము పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని కలెక్టర్‍కు చెప్పారు. పూర్తిస్థాయిలో టీచర్లు లేనందువల్లే సస్పెండ్‍ చేయడం లేదని డీఈఓ చెప్పడంపై సభ మండిపడింది. నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి బాలికల ఆశ్రమ స్కూల్​లో సమస్యలను జడ్పీటీసీ ఫోటోలు, వీడియోల రూపంలో కలెక్టర్‍ ముందుపెట్టారు. అధికారులు స్పందించట్లేదని.. కలెక్టర్‍ ఒకసారి స్కూల్‍ విజిట్‍ చేయాలని కోరారు.

ఎమ్మెల్యే పెద్ది గరం గరం
జడ్పీ మీటింగ్‍కు ఎమ్మెల్యేల నుంచి కేవలం పెద్ది సుదర్శన్‍రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట దాచుకోడానికి గోడౌన్లు అందుబాటులో ఉంచకుంటే రైతుల బతుకులు ఆగమవుతాయని చెప్పారు. 25 వేల టన్నుల గోడౌన్‍ ప్రతిపాదనలు ఉన్నా..అధికారులు ల్యాండ్‍ ఇవ్వకపోవడంతో సమస్య అలానే ఉందన్నారు. మైనింగ్‍ శాఖ వారు మట్టి, ఇసుక, గ్రానైట్‍ పర్మిషన్‍ ఇచ్చే క్రమంలో లోకల్‍ బాడీస్‍ అనుమతి తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని మత్స్య కార్మిక సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. సీజన్‍ పూర్తవుతున్నా జిల్లాలోని చెరువుల్లోకి చేపల పంపిణీ ఎందుకు చేయట్లేదో చెప్పాలన్నారు. సమస్య చెబితే మంత్రి తలసాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో స్కూళ్లు, హాస్పిటల్స్ పని చేస్తున్నా.. దాని పీఓ ఏనాడు జిల్లాలో పర్యటించకపోవడాన్ని తప్పుపట్టారు. జిల్లా అభివృద్ధి కోసం ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లాలని జడ్పీ చైర్‍పర్సన్‍ గండ్ర జ్యోతి, కలెక్టర్‍ గోపి సూచించారు. వరంగల్‍ జిల్లా పరిషత్‍కు రూ.250 కోట్ల ఫండ్స్​రిలీజ్‍ అయినట్లు తెలిపారు.