V6 News

సబ్సిడీ విషయంలో అమెరికాకు, మనకు ఎంత తేడా.. ఇందుకే మొక్కజొన్న రైతులకు ఇన్ని తిప్పలు

సబ్సిడీ విషయంలో అమెరికాకు, మనకు ఎంత తేడా.. ఇందుకే మొక్కజొన్న రైతులకు ఇన్ని తిప్పలు

మొక్కజొన్న రైతులు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరగడం, పండించిన పంటకు న్యాయమైన ధర లభించక, మద్దతు ధర అలంకార ప్రాయంగా మారడం, దళారుల దోపిడీకి గురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.  ప్రపంచంలో  మొక్కజొన్నను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, మెక్సికో,  బ్రెజిల్,  చైనా.   

అమెరికా 9 కోట్ల 60 లక్షల ఎకరాల సాగు ద్వారా 360 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది.  అమెరికా ఆర్థిక వ్యవస్థలో  మొక్కజొన్న ఉత్పత్తి ముఖ్యమైన పాత్ర  పోషిస్తోంది.  ప్రపంచ ఎగుమతుల్లో అమెరికా వాటానే 50%గా ఉంది.  అమెరికా పాలకులు 1930 నుంచి మొక్కజొన్న ఉత్పత్తికి మద్దతు ఇస్తున్నారు. 

గత 20 సంవత్సరాల్లో సబ్సిడీ సగటు వార్షిక వ్యయం 47 లక్షల డాలర్లు.  ప్రతి సంవత్సరం అమెరికా  రైతు 61 వేల డాలర్ల సబ్సిడీ  పొందుతున్నాడు. భారత రైతులకు కేవలం 282 డాలర్లు మాత్రమే సబ్సిడీ లభిస్తున్నది. 

అమెరికాలో  మొక్కజొన్న దిగుబడి హెక్టార్​కు 11 టన్నులు కాగా,  భారత్​లో 2 టన్నుల 540  కిలోలు  మాత్రమే.  నేడు  భారతదేశంలో 9.89 మిలియన్ల  హెక్టార్ల  మొక్కజొన్న సాగు ద్వారా  ప్రపంచ విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉంది.   సగటు దిగుబడి ఎకరాకు 20 క్వింటాళ్లు.  దిగుబడుల్లో  చాలా వెనుకబడి ఉంది.  అందుకు కారణం దేశ వాతావరణానికి అనుకూలమైన నాణ్యమైన విత్తనాలు దేశ రైతులకు అందకపోవడమే.  

ఆంధ్రప్రదేశ్​లో  2025---–26 సంవత్సరం రబీ సీజనులో 4.83 లక్షల ఎకరాల్లో,  తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో రైతులు  మొక్కజొన్న సాగు చేశారు.  దేశంలో మొక్కజొన్న సాగులో  తెలంగాణ 5వ, ఆంధ్రప్రదేశ్​ 7వ స్థానంలో ఉన్నాయి.  ఏపీ ఎకరా సేద్యపు ఖర్చు రూ.35 వేల నుంచి 40 వేలు.  కౌలు ఖర్చు మరో 15 వేలు.  సగటు  దిగుబడి ఎకరాకు  25 నుంచి 30 క్వింటాళ్లు.  తెలంగాణలో ఎకరా సేద్యపు ఖర్చు 35 నుంచి 38 వేలు.  కౌలు ఖర్చు మరో 12 వేలు. సగటు దిగుబడి 25 క్వింటాళ్లు.   కేంద్రం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు.  

కేంద్ర ప్రభుత్వ క్వింటా సాగు ఖర్చు 1,447 రూపాయలుగా నిర్ణయించి మద్దతు ధరను 2400గా  ప్రకటించింది.  వాస్తవ క్వింటాల్​ సేద్యపు ఖర్చు 2000  నుంచి 2,200 రూపాయలని  వ్యవసాయ  నిపుణులు చెబుతున్నారు.  దాని ప్రకారం 50% పెంచితే రూ. 3,100గా మద్దతు ధర  ప్రకటించాలి.  ఏపీ,  తెలంగాణ  రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు. 

  • గిట్టుబాటు ధర లభించక అప్పులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.  ప్రభుత్వ కొనుగోళ్ల కేంద్రాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ మార్కెట్లో లభిస్తున్న ధర  రూ.1600 నుంచి 1750 రూపాయలు మాత్రమే. ఫలితంగా రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతున్నాడు.   రైతాంగం గిట్టుబాటు ధర లభించక నష్టపోయి అప్పుల పాలౌతుంటే,  కేంద్ర,  రాష్ట్ర  ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకునే చర్యలు  తీసుకోవాల్సి ఉండగా,  అందుకు విరుద్ధంగా  వ్యవహరిస్తున్నాయి.  

దేశ రైతుల వద్ద ఉన్న మొక్కజొన్నను కొనుగోళ్లు చేయకుండా 5 లక్షల టన్నుల మొక్కజొన్నను  మోదీ ప్రభుత్వం అమెరికా నుంచి  దిగుమతి  చేసుకుంటూ  భారత రైతాంగాన్ని మరింత  సంక్షోభంలోకి నెట్టింది. అమెరికా  మొక్కజొన్నను  భారత్  దిగుమతి చేసుకోవాలని  మోదీని  ట్రంప్ బెదిరించడం,  ఇటీవల  ఢిల్లీలో జరిగిన చర్చల్లో  మా  మొక్కజొన్న  కొనుగోలు చేయాలని అమెరికా వాణిజ్య మంత్రి హౌ వార్ట్ లుట్నిక్ భారత ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం,  అందుకు తలొగ్గిన మోదీ ప్రభుత్వం మొక్కజొన్న దిగుమతిపై 15%గా ఉన్న సుంకాన్ని పూర్తిగా తొలగిండం భారత ప్రభుత్వంపై  అమెరికా ఆధిపత్యానికి నిదర్శనం.  త్వరలోనే  భారత, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు  జరుగుతాయని, ఒప్పందం కుదురుతుందని వార్తలు వస్తున్నాయి. ఒప్పందం జరిగితే భారత రైతాంగం తీవ్రంగా 
నష్టపోతారు. 

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కొనుగోళ్ల బాధ్యత

కేంద్ర ప్రభుత్వంతోపాటు  రాష్ట్ర  ప్రభుత్వానికి  పంటల  కొనుగోళ్ల బాధ్యత ఉంది.  గిట్టుబాటు ధర  పంటలకు లభించనప్పుడు,  రాష్ట్ర ప్రభుత్వం కూడా  కొనుగోళ్లు  చేపట్టి  రైతులను  ఆదుకోవాలి.  అందుకు  ధరల స్థిరీకరణ నిధిని  ఏర్పాటు చేయాలి.  దాని ద్వారా  పంటలు కొనుగోళ్లు చేయాలి.  అలాంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టలేదు.  వైసీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి  రూ.3 వేల కోట్లు కేటాయిస్తే,  కూటమి ప్రభుత్వం  రూ.300 కోట్లు మాత్రమే  కేటాయించింది. 


ఈ మొత్తంతో  పంటల  కొనుగోళ్లు ఎలా సాధ్యం.  తాజాగా  ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెంనాయుడు  మొక్కజొన్నలను కొనలేమని చేతులు ఎత్తేశారు.  కూటమి ప్రభుత్వ మొక్కజొన్న రైతులనే కాదు, ఏ పంట  రైతులను ఆదుకోవటం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా మొక్కజొన్న కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు.  ఫలితంగా  రెండు రాష్ట్రాల రైతులకు  కనీసం గిట్టుబాటు ధర లభించక నష్టపోయి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.  

 మొక్కజొన్న కొనుగోళ్లలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల  వైఫల్యాలను నిరసిస్తూ,   మద్దతు ధర చెల్లించి ప్రభుత్వ సంస్థలే  రైతుల వద్ద ఉన్న  మొక్కజొన్నను  కొనుగోళ్లు చేయాలని,  దళారులు, ప్రైవేట్ వ్యాపారుల దోపిడీని అరికట్టాలని,  మొక్కజొన్న దిగుమతులను ఆపాలని ఉద్యమించడమే  మొక్కజొన్న రైతుల నేటి తక్షణ కర్తవ్యం. 

- బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం