
- 3 రన్స్ తేడాతో బంగ్లాదేశ్‌పై గెలుపు
- బంగ్లా సెమీస్ ఆశలు గల్లంతు!
షార్జా: నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ సత్తా చాటింది. స్లాగ్ ఓవర్స్‌లో సూపర్ బౌలింగ్‌తో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తప్పించుకుంది. సూపర్12, గ్రూప్1లో భాగంగా శుక్రవారం ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో విండీస్ 3 పరుగుల తేడాతో గట్టెక్కింది. మరోవైపు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లా..సెమీస్ రేస్‌కు దాదాపుగా దూరమైంది. నికోలస్ పూరన్ (22 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 40) దంచికొట్టడంతో.. తొలుత విండీస్ 20 ఓవర్లలో 142/7 స్కోరు చేసింది. రోస్టన్ ఛేజ్ (39) అండగా నిలిచాడు. తర్వాత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 139/5 స్కోరుకే పరిమితమైంది. లిటన్ దాస్ (44) టాప్ స్కోరర్. కెప్టెన్ మహ్మదుల్లా (31 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉన్నా టీమ్‌ను గెలిపించలేకపోయాడు. లాస్ట్ ఓవర్లో 13 రన్స్ అవసరం అవగా.. రసెల్ 9 రన్సే ఇచ్చాడు. పూరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మరో మ్యాచ్ లో ..
పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో
- పాకిస్తాన్‌ను గెలిపించిన అలీ
- హ్యాట్రిక్ విక్టరీతో సెమీస్‌కు పాక్!
- పోరాడి ఓడిన అఫ్గాన్
దుబాయ్: పాకిస్తాన్ విజయానికి లాస్ట్ రెండు ఓవర్లలో 24 రన్స్ కావాలి. ఫిఫ్టీ కొట్టిన కెప్టెన్ బాబర్ ఆజమ్ (47 బాల్స్‌లో 4 ఫోర్లతో 51), నిలకడగా ఆడుతున్న సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (19) అప్పుడే ఔటయ్యారు. అఫ్గానిస్తాన్ బౌలర్లు జోరు మీదున్నారు. వాళ్ల జోష్ చూస్తుంటే పాక్‌కు షాకిచ్చి సంచలనం సృష్టించేలా కనిపించారు. కానీ, వాళ్ల ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. ధనాధన్ షాట్లతో 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు కొట్టిన ఆసిఫ్ అలీ (7 బాల్స్‌లో 25 నాటౌట్) పాక్‌ను గెలిపించాడు. దాంతో, గ్రూప్2లో వరుసగా మూడో విక్టరీతో హ్యాట్రిక్ కొట్టిన పాక్ సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంది. శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌ను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లో 147/6 స్కోరు చేసింది. కెప్టెన్ మహ్మద్ నబీ (32 బాల్స్‌లో 5 ఫోర్లతో 35 నాటౌట్), గుల్బదిన్ నైబ్ (25 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్) సత్తా చాటారు. అనంతరం పాక్ 19 ఓవర్లలో 148/5 స్కోరు చేసి గెలిచింది. బాబర్, ఆసిఫ్‌తో పాటు ఫఖర్ జమాన్ (30) కూడా రాణించాడు. ఆసిఫ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
బాబర్ నిలకడ.. ఆసిఫ్ ఫినిషింగ్
మోస్తరు టార్గెట్ ఛేజింగ్‌లో పాక్ తడబడింది. వరుసగా నాలుగు ఓవర్లు వేసి 14 రన్సే ఇచ్చిన స్పిన్నర్ ముజీబ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ రిజ్వాన్ (8)ను ఔట్ చేసి షాకిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఫకర్ జమాన్ దూకుడు చూపినా. స్పిన్నర్ల బౌలింగ్‌లో మరో ఓపెనర్ బాబర్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. దాంతో, సగం ఓవర్లకు పాక్ 72/1తో నిలిచింది. అయితే, 12వ ఓవర్లో జమాన్‌ను ఔట్ చేసిన నబీ.. రెండో వికెట్‌కు 63 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. డాట్ బాల్స్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన రషీద్.. 15వ ఓవర్లో హఫీజ్ (10)ను వెనక్కుపంపి టీ20ల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశలో బాబర్‌కు తోడైన షోయబ్ మాలిక్ (19) ఓ ఫోర్, సిక్స్‌తో పాక్‌పై ఒత్తిడి తగ్గించాడు. కానీ, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న బాబర్‌ను బౌల్డ్ చేసిన రషీద్ అఫ్గాన్‌ను రేసులోకి తెచ్చాడు. మూడు ఓవర్లలో పాక్‌కు 26 రన్స్ అవసరం అవగా.. 18వ ఓవర్లో షోయబ్ వికెట్ తీసిన నవీన్ రెండే రన్స్ ఇచ్చాడు. దాంతో, సమీకరణం 12 బాల్స్‌లో 24గా మారగా.. పాక్‌పై ప్రెజర్ అమాంతం పెరిగింది. అయితే, కివీస్‌తో గత మ్యాచ్‌లో ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ను ఆదుకున్న ఆసిఫ్ అలీ మరోసారి టీమ్‌ను సేవ్ చేశాడు. కరీం జనత్ వేసిన 19వ ఓవర్లో కూల్‌గా నాలుగు సిక్సర్లు కొట్టి పాక్‌ను గెలిపించాడు.
నబీ, గుల్బదిన్ ధనాధన్
టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయి డీలా పడినా.. కెప్టెన్ నబీ, గుల్బదిన్ నైబ్ మెరుపులతో మంచి స్కోరు చేసింది. స్టార్టింగ్‌లో మాత్రం టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ హజ్రతుల్లా (0) రెండో ఓవర్లోనే ఇమాద్ వసీం బౌలింగ్‌లో డకౌటవగా.. మరో ఓపెనర్ షజాద్ (8).. షాహీన్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఐదో ఓవర్లో అస్గర్ అఫ్గాన్ (10) హారిస్ రవూఫ్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. గర్జాబ్(10)ను హసన్ అలీ పెవిలియన్ చేర్చాడు. కాసేపు ప్రతిఘటించిన కరీం జనత్ (15), నజిబుదుల్లా (22) మూడు ఓవర్ల తేడాలో ఔటవ్వడంతో 13 ఓవర్లకు 76/6తో నిలిచిన అఫ్గాన్ తొందరగానే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిననబీ, నైబ్ వరుసగా బౌండ్రీలు రాబట్టారు. హసన్ అలీ వేసిన 18వ ఓవర్లో గుల్బదిన్ 6,4, 4 సహా 21 రన్స్ రాబట్టగా, రవూఫ్ బౌలింగ్‌లో నబీ రెండు ఫోర్లు, గుల్బదిన్ ఓ ఫోర్ కొట్టాడు. ఓవరాల్‌గా 7.1 ఓవర్లోనే 71 రన్స్ జోడించి అఫ్గాన్‌కు మంచి స్కోరే అందించారు.
సంక్షిప్త స్కోర్లు
అఫ్గానిస్తాన్: 20 ఓవర్లో 147/6 (నబీ 35 నాటౌట్, గుల్బదిన్ 35 నాటౌట్, ఇమాద్ వసీం 2/25)
పాకిస్తాన్: 19 ఓవర్లలో 148/5 (బాబర్ 51, జమాన్ 30, ఆసిఫ్ 25 నాటౌట్, రషీద్ 2/26).