రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్.. పేషెంట్లలో ట్యూమర్లు తగ్గిపోయాయ్..!

రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్.. పేషెంట్లలో ట్యూమర్లు తగ్గిపోయాయ్..!
  • క్యాన్సర్ చికిత్సలో కొత్త శకానికి నాంది: నిపుణులు

మాస్కో: క్యాన్సర్ చికిత్సలో మరో అడుగు ముందుకు పడింది. రష్యా అభివృద్ధి చేసిన ‘ఎంటరోమిక్స్’ వ్యాక్సిన్  ప్రయోగం విజయవంతమైంది. మనుషులపై చేసిన ప్రారంభ ప్రయోగాల్లో వ్యాక్సిన్  100% ఎఫికసీ (పనిచేసే సామర్థ్యం) చూపిందని ఆ దేశ పరిశోధకులు తెలిపారు. పేషెంట్లలో ట్యూమర్లు తగ్గిపోయాయని, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్  కూడా లేవని చెప్పారు. కొవిడ్ 19 వ్యాక్సిన్  కోసం వాడిన ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీనే ఎంటరోమిక్స్‌‌  వ్యాక్సిన్ తయారీలోనూ ఉపయోగించారు. క్యాన్సర్  కణాలను గుర్తించి ఆ కణాలను నాశనం చేసేలా మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ట్రెయిన్ చేస్తుంది. ఆవిధంగా వ్యాక్సిన్​ను డిజైన్ చేశారు.

కీమోథెరపీ లాంటి సంప్రదాయ చికిత్సలకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేశారు. ఇక 48 మంది వలంటీర్లపై ఎంటరోమిక్స్ వ్యాక్సిన్​ను ప్రయోగించారు. రష్యాకు చెందిన నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలాజికల్  సెంటర్.. ఎంగెల్ హార్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీతో సమన్వయమై ఆ వలంటీర్లపై ప్రయోగం నిర్వహించింది. రీసెర్చ్​కు సంబంధించిన ఫలితాలను సెయింట్  పీటర్స్ బర్గ్  ఇంటర్నేషనల్  ఎకనామిక్  ఫోరం 2025లో వెల్లడించారు. ఆంకాలజీలో ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ పొటెన్షియల్ గేమ్ చేంజర్​గా పనిచేస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. రష్యా  ఆరోగ్య శాఖ ఈ వ్యాక్సిన్​కు ఆమోదముద్ర వేయడమే మిగిలింది.

కొత్త శకానికి నాంది
ఎంటరోమిక్స్ వ్యాక్సిన్​కు గ్లోబల్ ఆంకాలజీ నిపుణులు ఆమోదం తెలపాల్సి ఉంది. తాజా ప్రయోగాల ఫలితాలను గ్లోబల్ ఆంకాలజీ వ్యాలిడేట్  చేస్తే, క్యాన్సర్  చికిత్సలో ఎంటరోమిక్స్ వ్యాక్సిన్ కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.