
న్యూఢిల్లీ:రష్యాలో గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నెల కిందట 10 వేలున్న సంఖ్య ఇప్పుడు 2.21 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, స్పెయిన్, యూకే తర్వాత నాలుగో స్థానంలో ఉంది. సోమవారం ఇటలీ దాటేసి ఫోర్త్ ప్లేస్‌కు చేరుకుంది. గత 10 రోజుల్లోనే ఇక్కడ లక్ష కేసులయ్యాయి. మరణాల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఇప్పటివరకు 2 వేల మంది చనిపోయారు. కేసులు పెరగడానికి కారణం టెస్టులు పెంచడమేనని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 56 లక్షల టెస్టులు చేశామన్నారు. మొత్తం కేసులు, మరణాల్లో రష్యా రాజధాని మాస్కోలోనే సగం ఉన్నాయి. ఇప్పటివరకు మాస్కోలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.
వ్యాక్సిన్ వచ్చే వరకు ఆంక్షలు: బ్రిటన్
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయలేమని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. జూన్ 1 వరకైతే లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా ఎత్తివేస్తామన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ఆంక్షలు తప్పవని చెప్పారు. వారం రోజుల్లో ప్రస్తుత లాక్‌డౌన్ గడువు ముగియనున్నా కేసులు ఎక్కువవుతుండటంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ ఫస్ట్ వీక్‌లో స్కూల్స్, హాస్పిటళ్లలో ఓపీ సర్వీసులను ఓపెన్ చేస్తామని బోరిస్ చెప్పారు. జులై నాటికి కేసుల సంఖ్య అదుపులోకి వస్తే బహిరంగ ప్రదేశాల్లోనూ సడలింపులు ఇస్తామన్నారు. బ్రిటన్‌లో కరోనా బారిన పడి చనిపోతున్న వాళ్లలో తక్కువ జీతానికి పని చేస్తున్న వాళ్లే ఎక్కువున్నారని బ్రిటన్ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులుగా పని చేసిన వాళ్లలో డెత్ రేటు ఎక్కువగా ఉందంది.
చైనాలో వాచ్‌లతో స్డూడెంట్ల టెంపరేచర్ చెకింగ్
చైనాలో షాంఘై డిస్నీలాండ్ మూడున్నర నెలల తర్వాత సోమవారం తెరుచుకుంది. అయితే రోజువారీ విజిటర్ల సంఖ్యను మూడో వంతుకు తగ్గించారు. పార్కు విజిటర్ల కెపాసిటీ 80 వేలు. 12 వేల క్యాస్టింగ్ మెంబర్లు ఉంటారు. కాస్టూమ్స్ వేసుకున్న వాళ్లు సహా ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని నిబంధన విధించారు. బీజింగ్‌లో స్టూడెంట్ల బాడీ టెంపరేచర్‌ను కొలిచేందుకు చైనా సర్కారు స్మార్ట్ వాచ్‌లను వాడుతోంది. పిల్లల టెంపరేచర్‌ను ఆ స్మార్ట్ వాచ్‌లోని సెన్సార్ ఎప్పటికప్పుడు లెక్కిస్తుంటుంది. ఈ రీడింగ్‌లను టీచర్లు మానిటర్ చేస్తుంటారు. పేరెంట్స్, మున్సిపల్ అధికారులు కూడా చెక్ చేసుకోవచ్చు. బీజింగ్‌లోని 5 జిల్లాల్లో ఈ పద్ధతి అమలులో ఉంది. చైనా తూర్పు ప్రాంతంలోని జిలిన్ సిటీలో రెండ్రోజుల్లో 14 కేసులు నమోదవడంతో కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.
ఇంకిన్ని దేశాల్లో ఇట్లిట్ల..
- ఎలాన్ మస్క్ టెస్లా ప్లాంట్లను ఓపెన్ చేసుకోవడానికి చైనా అనుమతిచ్చింది. కానీ కాలిఫోర్నియా మాత్రం నో చెప్పింది. దీంతో అమెరికా హెల్త్ అఫీషియల్స్‌పై మస్క్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిఫోర్నియా నుంచి మెయిన్ ప్లాంట్‌ను తరలించేస్తానని హెచ్చరించారు.
- లాక్‌డౌన్‌ను న్యూజిలాండ్ సడలిస్తోంది. మే 14న కేఫ్‌లు, థియేటర్లు, షాపులు, రెస్టారెంట్లు తెరుచుకోవచ్చని చెప్పింది. మే 18 నుంచి స్కూళ్లు, 21 నుంచి బార్లు ఓపెన్ చేసుకోవచ్చంది.
- సౌత్ కొరియాలో నైట్ క్లబ్‌లకు వెళ్లి 85 మంది కరోనా అంటించుకున్నారని తెలియడంతో వాటిని మూసేసే దిశగా సర్కారు అడుగులేస్తోంది. శనివారమే సియోల్‌లోని నైట్ క్లబ్‌లు, బార్లను మూసేయాలని ఆర్డర్ జారీ చేసింది. ఆదివారం నమోదైన 35 కేసుల్లో 29 క్లబ్‌ల ద్వారానే వ్యాపించిందని అధికారులు చెప్పారు.
- కేసుల సంఖ్య పెరుగుతుండటంతో డైలీ కర్ఫ్యూపై ఆంక్షలు సడలించిన లెబనాన్ సర్కారు మళ్లీ కర్ఫ్యూను విధించింది. రాత్రి 7 నుంచి పొద్దున 5 వరకు ఎవరూ ఇండ్లల్లోంచి బయటకు రావొద్దని ఆదేశాలిచ్చింది.
ఒక్కరి నుంచి 533 మందికి
ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలో ఓ ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉద్యోగి నుంచి 533 మందికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఘనా ప్రెసిడెంట్ అకుఫో అడ్డో తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన బయటపెట్టలేదు. వ్యాధి ఒకరి నుంచి ఇంత మందికి ఎలా సోకిందనేది ఇంకా తెలియరాలేదు. కరోనా వల్ల తమ దేశంలో 22 మంది చనిపోయారని, 494 మంది కోలుకున్నారని ప్రెసిడెంట్ చెప్పారు. ఘనాలో కరోనా కేసుల సంఖ్య 4,700 దాటింది. వెస్ట్ ఆఫ్రికన్ దేశాల్లో ఇదే హయ్యెస్ట్.
వైట్‌హౌస్‌లో కరోనా కేసులు.. ప్రెసిడెంట్ ట్రంప్ కలవరం
రాష్ట్రాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఓపెన్ చేయా లని చెబుతున్న టైమ్‌లో వైట్‌హౌస్ సిబ్బందికి కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తోందని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. సిబ్బందికి కరోనా సోకడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీకి శుక్రవారం కరోనా సోకినా పెన్స్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండబోరని, సోమవారం మీటింగ్‌కు వస్తారని అధికారులు చెప్పారు. పెన్స్‌కు రోజూ టెస్టులు చేస్తున్నామని, నెగెటివ్ వస్తోందని తెలిపారు.