పాక్ కు ఏకే రైఫిల్స్ ఇవ్వం… తేల్చిచెప్పిన రష్యా

పాక్ కు ఏకే రైఫిల్స్ ఇవ్వం… తేల్చిచెప్పిన రష్యా

తమకు 50 వేల ఏకే రైఫిల్స్ కావాలంటూ పాకిస్థాన్ పెట్టిన ప్రపోజల్ ను రష్యా తిరస్కరించింది. ఆ వెంటనే పాకిస్థాన్ తో తాము ఎలాంటి మిలటరీ డీల్స్ కుదుర్చుకోమని ఇండియాకు సమాచారమిచ్చింది. అయితే, ఏకే రైఫిల్స్ లో ఏ మోడల్ కొనుగోలుకు పాకిస్థాన్ ప్రయత్నించిందో మాత్రం వెల్లడించలేదు.

ఇండియా సర్ ప్రైజ్

పాకిస్థాన్ ఆర్మీ ఎప్పటినుంచో చైనా తయారు చేసిన ఏకే 56 రైఫిల్స్ ను వాడుతోంది. కానీ రష్యన్ మేడ్ రైఫిల్స్ కోసం ఆ దేశం ప్రపోజల్ పంపడం ఇండియాను ఆశ్చర్యానికి గురి చేసింది. మన ఆర్మీ ఎప్పటినుంచో రష్యా రూపొందించిన ఏకే రైఫిల్స్ ను వాడుతోంది. చైనా ఏకే 56, ఏకే 47 రైఫిల్ వెర్షనే. అయితే కొంచెం బరువు తక్కువగా ఉంటుంది. జమ్మూకాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో టెర్రరిస్టు దాడులు జరిగిన ప్రతి సారీ పాకిస్థాన్ ఇచ్చి పంపిన ఏకే 56 రైఫిల్స్ ను మన సైన్యం సీజ్ చేస్తూనే ఉంది.

రష్యాతో పాకిస్థాన్ మిలటరీ సంబంధాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. దీనిపై ఇండియా, రష్యా వద్ద అభ్యంతరం వ్యక్తం చేసింది. టీ 90 యుద్ధ ట్యాంకుల నుంచి నూతన ఎయిర్ డిఫెన్స్ సిస్టం వరకూ చాలా రకాల పరికరాల కొనుగోలు కోసం పాకిస్థాన్, రష్యాను ఆశ్రయించింది. కానీ ఇండియాతో ఉన్న డీల్స్ వల్ల రష్యా వాటికి అంగీకరించలేదు. 2015లో మాత్రం నాలుగు ఎంఐ–35 అటాక్ చాపర్లను పాకిస్థాన్ కు అమ్మింది.