మొన్న పడ్డాయ్.. నిన్న లేచాయ్!

మొన్న పడ్డాయ్.. నిన్న లేచాయ్!
  • కోలుకున్న మార్కెట్లు 
  • 1,329 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 2.53 శాతం లాభపడ్డ నిఫ్టీ

న్యూఢిల్లీ: రష్యా యుద్ధంతో గత ఏడు సెషన్లలో ఘోరంగా నష్టపోయిన  మార్కెట్లు శుక్రవారం కోలుకున్నాయి. అన్ని రంగాల్లో  లాభాల కారణంగా మళ్లీ పుంజుకున్నాయి. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ 1,329 పాయింట్లు (2.44 శాతం) పెరిగి 55,859 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 410 పాయింట్లు (2.53 శాతం) పెరిగి 16,658 వద్ద స్థిరపడింది. రెండు ఇండెక్స్‌‌‌‌లు మునుపటి సెషన్‌‌‌‌లో బాగా పడ్డాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఘోర పతనం ఇదే. అమెరికా  ప్రెసిడెంట్ జో బిడెన్ ఉక్రెయిన్‌‌‌‌పై దాడి తర్వాత రష్యాపై కఠినమైన ఆంక్షలతో ఎదురుదెబ్బ కొట్టడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.  బీఎస్ఈ -లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) గురువారం రూ. 242.24 లక్షల కోట్ల మార్క్ నుండి రూ. 250 లక్షల కోట్లకు పెరగడంతో, ఇన్వెస్టర్లు సంపద శుక్రవారం దలాల్ స్ట్రీట్‌‌‌‌లో రూ.7.76 లక్షల కోట్లకు పెరిగింది. నిఫ్టీ మిడ్‌‌‌‌క్యాప్–100 ఇండెక్స్ 4.18 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 4.84 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని15 సెక్టార్ గేజ్‌‌‌‌లు ర్యాలీ చేశాయి. నిఫ్టీ మెటల్,  నిఫ్టీ పిఎస్‌‌‌‌యు బ్యాంక్ వరుసగా 5.74 శాతం  4.69 శాతం పెరిగాయి.  కోల్ ఇండియా టాప్ నిఫ్టీ గెయినర్‌‌‌‌గా ఉంది. ఇది  8.87 శాతం పెరిగి రూ. 163.30కి చేరుకుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్ కూడా లాభపడ్డాయి.  30 షేర్ల బిఎస్‌‌‌‌ఇ ఇండెక్స్‌‌‌‌లో టాటా స్టీల్, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌‌‌‌టిపిసి, టెక్ మహీంద్రా,  కోటక్ మహీంద్రా బ్యాంక్  లాభపడ్డాయి.  నెస్లే ఇండియా షేరు నష్టపోయింది.

బంగారం, వెండి ధరలు తగ్గాయ్​..

రష్యా దాడులు కారణంగా గురువారం భారీగా పెరిగిన బంగారం ధరలు శాంతించాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర  రూ.1,274 తగ్గి రూ.50,913కి చేరుకుంది.  క్రితం ట్రేడింగ్‌‌‌‌లో 10 గ్రాముల ధర రూ.52,187 వద్ద ముగిసింది. వెండి కూడా కిలోకు రూ.2,219 తగ్గి రూ.64,809కి చేరుకుంది. దీని క్రితం ముగింపు ధర కిలోకు రూ.67,028.