
వెలుగు బిజినెస్ డెస్క్: కరోనా దెబ్బ నుంచి పూర్తిగా కోలుకోని సప్లయ్ చెయిన్లపై ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో కొన్ని ముడి సరుకుల సరఫరాకు అంతరాయం కలిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్లు మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఎక్కువగా ఎగుమతులు చేయకున్నా, యూరప్‌లోని చాలా కంపెనీలకు ముడి సరుకులను సప్లయ్ చేస్తున్నాయి. అంతేకాదు, యూరప్‌కు ఈ దేశాలే ప్రధానంగా ఎనర్జీ (నేచురల్ గ్యాస్)ను అమ్ముతున్నాయి. ఈ యూరప్ దేశాలపై ప్రభావంతో మనదేశానికీ కొన్ని ఇబ్బందులు రానున్నాయి. తాజా పరిణామంతో ఏయే రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడనుందో చూద్దాం.
ఎనర్జీ..
యూరప్‌లోని చాలా దేశాలు తమ ఎనర్జీ అవసరాల కోసం రష్యాపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ అయిన స్విఫ్ట్‌నుంచి రష్యాను తొలగించాలనే కొన్ని దేశాల డిమాండ్‌కు యూరోపియన్ దేశాలు అంగీకరించకపోవడానికి ఒక ప్రధాన కారణం వాటి ఎనర్జీ అవసరాలే. బాల్టిక్ గ్యాస్ పైప్‌లైన్ నార్డ్ స్ట్రీమ్ 2ను సస్పెండ్ చేస్తున్నట్లు జర్మనీ ఇప్పటికే ప్రకటించింది. గ్యాస్పైప్లైన్లను రష్యా పూర్తిగా నిలిపివేయనప్పటికీ, సప్లయ్‌లో చిన్న చిన్న అంతరాయాలు కూడా పెద్ద ఎఫెక్ట్‌నే చూపించవచ్చు. గ్లోబల్‌గా చూస్తే గ్యాస్ రిజర్వులు (నిల్వలు) తక్కువగానే ఉన్నాయి. సప్లయ్ కొరత కారణంగా నేచురల్ గ్యాస్ వంటి ఇందనాల రేట్లు చుక్కలంటుతున్నాయి. చాలా ప్రొడక్టుల తయారీకి గ్యాస్ కీలకమైంది. 2021లో గ్యాస్ రేట్లు భారీగా పెరిగిన వెంటనే ఈ రేటుకు కొని మాన్యుఫాక్చరింగ్ చేయలేక యూకేలోని కొన్ని ఫెర్టిలైజర్ (ఎరువుల) ప్లాంట్లు మూసేశారు.
ఫుడ్..
ఫుడ్ ధరలు 2021లోనే ఎక్కువయ్యాయి. రా మెటీరియల్స్ రేట్లు ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. గోధుమల ఎగుమతులలో గ్లోబల్‌గా రష్యా, ఉక్రెయిన్– రెండు దేశాలకు కలిపి నాలుగో వంతు వాటా ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ఎగుమతులలో సగం ఉక్రెయిన్ దేశం నుంచే వస్తున్నాయి. మన దేశం సన్‌ఫ్లవర్ ఆయిల్ కోసం ఉక్రెయిన్‌పై ఆధారపడుతోంది. ఈ సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు గ్లోబల్‌గా పెరగడం అప్పుడే మొదలైంది. చాలా దేశాలకు గోధుమలు, మక్కలు ఉక్రెయిన్ నుంచే సప్లయ్ అవుతున్నాయి. ఫెర్టిలైజర్ల తయారీలో కీలకమైన కొన్ని ప్రొడక్టులకు కూడా రష్యానే ప్రధాన సరఫరాదారు. ఇప్పుడు ట్రేడ్ శాంక్షన్ల ఎఫెక్ట్ వీటిపై పడొచ్చు.
మెటల్స్ పైనా..
నికెల్, కాపర్, ఐరన్ గ్లోబల్ ప్రొడక్షన్లో రష్యా, ఉక్రెయిన్లకు పెద్ద వాటానే ఉంది. ఇవే కాకుండా, నియాన్, పలాడియం, ప్లాటినమ్ వంటి చాలా కీలకమైన రామెటీరియల్స్ సప్లయ్లోనూ ఈ రెండు దేశాలు చాలా ముఖ్యం. రష్యాపై ట్రేడ్ ఆంక్షల నేపథ్యంలో ఈ మెటల్స్ రేట్లు అకస్మాత్తుగా పెరిగిపోయాయి.
మైక్రోచిప్స్..
ఇది వరకే మైక్రోచిప్స్కు కొరత ఉంది. తాజా వార్తో పరిస్థితి విషమిచే అవకాశాలు కనిపిస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి. తనపై ఆంక్షలు పెడితే మైక్రోచిప్స్ సప్లయ్ నిలిపివేస్తానని రష్యా ఇప్పటికే తెలిపింది. చిప్ మాన్యుఫాక్చరర్ల దగ్గర నిల్వలు తక్కువగా ఉన్నాయి. చిప్ లిథోగ్రఫీలో వాడే నియోన్‌లో 90 శాతం సప్లయ్ రష్యా నుంచే వస్తోంది. దీంతో సప్లయ్ ఎక్కువ రోజులు నిలిచిపోతే ఆ ఎఫెక్ట్ మళ్లీ సెమీకండక్టర్ల తయారీ, అవి వాడే కార్ల తయారీ వంటి వాటిపై పడనుంది.
ట్రాన్స్పోర్ట్..
కరోనా మహమ్మారి దెబ్బ నుంచి ఇంకా కోలుకోని గ్లోబల్ ట్రాన్స్పోర్ట్ రంగంపైనా తాజా వార్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. సముద్ర రవాణా, రైలు రవాణాలపై ఈ ప్రభావం ఉండొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. చైనా, యూరప్‌ల మధ్య 2011 నుంచే రైలు రవాణా నడుస్తోంది. ఆసియా, యూరప్‌ల మధ్య సరకు రవాణాలో తక్కువ భాగమే రైలు రవాణా ద్వారా జరుగుతోంది. కానీ, ఈ రవాణా గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. రైళ్లను ఉక్రెయిన్‌కు దూరంగా ఇతర మార్గాలలో మళ్లించడం మొదలైంది. కానీ, రష్యాపై ఆంక్షలతో తమ దేశానికి రైల్ ట్రాఫిక్‌పై పడే అవకాశం ఉందని లిథుయేనియా వంటి దేశాలు అంటున్నాయి. బ్లాక్ సీ రూట్లో కంటెయినర్ షిప్పింగ్ వద్దని, ఇతర రూట్లకు కొంత మంది షిప్ ఓనర్లు మారుతున్నారు. ఈ రూట్‌ను రష్యా నిలిపివేస్తే ఉక్రెయిన్దేశపు ఎగుమతులు, దిగుమతులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.