రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విమర్శలకు , ఆరోపణలకు చెక్ పెడుతూ రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ సురక్షితం అంటూ ఇటీవల నిర్వహించిన ట్రయల్స్ లో తేలింది. అదే విషయాన్ని లాన్సెట్ తన అధ్యయనంలో ప్రస్తావించింది.
లాన్సెట్ అధ్యయనం ప్రకారం..రష్యా సైంటిస్ట్ లు 18ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు గల 38 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లకు రెండు చిన్న ట్రయల్స్ నిర్వహించారు. వారికి రెండు రకాలుగా రోగనిరోధక వ్యాక్సిన్లు ఇచ్చారు.
ట్రయల్స్‌లో పాల్గొనేవారికి టీకా మొదటి భాగంలో ఒక మోతాదు ఇచ్చారు. ఆ తరువాత 21 రోజుల తరువాత రెండవ భాగంతో మరో మోతాదు ఇచ్చారు. అలా 42 రోజులలో వారిని పర్యవేక్షించారు. మొదటి మూడు వారాల్లోనే వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు గుర్తించారు. దీంతో వ్యాక్సిన్ సురక్షితమైందని తేల్చారు
పూర్తిస్థాయి ట్రయల్స్ ను 76 మందిపై ప్రయోగించనున్నారు. ఆ 76మందిపై స్పుత్నిక్ వీ టీకాను ప్రయోగిస్తారు. అనంతరం వారిని 180 రోజుల వరకు పర్యవేక్షించనున్నట్లు లాన్సెట్ నివేదిక పేర్కొంది.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ రష్యాను ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను పాటించాలని సురక్షితమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధికి అవసరమైన మార్గాల్లో ప్రయత్నించాలని సూచించింది
