
- లాక్డౌన్ నుంచి బయటపడేందుకు రష్యా బిజినెస్ మ్యాన్ ప్రయత్నాలు
- సొంత బిజినెస్‌తో ఏడాదికి 2 మిలియన్ డాలర్ల సంపాదన
- ఇప్పుడు డెలివరీలు చేస్తే వచ్చేది రోజుకు 13 నుంచి 20 డాలర్లే
మాస్కో: కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్ మరింత విస్తరించకుండా మెజారిటీ దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇండ్లకే పరిమితమైపోయారు. ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టడానికి లేకపోవడంతో ఇంటర్నెట్ సెర్చింగ్, ఆన్లైన్ మూవీస్ చూడటానికే ఎక్కువ మంది పరిమితమైపోయారు. రష్యాకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. మాస్కోలో లాక్డౌన్ విధించడంతో ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసింది. ఎలాగైనా బయటకు రావాలని డిసైడ్ అయిన అతను చివరికి డెలివరీ బాయ్‌గా మారి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. వచ్చే జీతం తక్కువే అయినా ఫిజికల్లీ యాక్టివ్ జాబ్ కావడంతో మీల్స్ డెలివరీ చేస్తూ గడిపేస్తున్నాడు.
రోజుకు వచ్చేది 10 నుంచి 20 డాలర్లే
లాక్డౌన్ కారణంగా మాస్కోలో జనం బయటకు రావడంపై నిషేధం విధించారు. కీలకమైన ఇండస్ట్రీల్లో పని చేసే వారిని కూడా వర్క్ ఫ్రం హోం చేయమని చెబుతున్నారు. నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ కోసమే దగ్గరలోని షాపులు, ఫార్మసీలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం ఫుడ్ డెలివరీలకు డిమాండ్ పెరిగింది. లాక్డౌన్ కారణంగా తన బిజినెస్ మొత్తం కోల్పోయిన 38 ఏండ్ల సెర్జే నొచోవ్నీ.. తన లైఫ్‌ను ఇంకో యాంగిల్లో చూడాలనుకున్నాడు. లాడ్‌డౌన్‌లో మాస్కో ఎలా ఉంది. జనం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఫుడ్ డెలివరీపై ఎటువంటి బ్యాన్ లేనందున ఒక మేజర్ ఫుడ్ డెలివరీ కంపెనీలో డెలివరీ బాయ్‌గా చేరాడు. బైక్‌పైనో.. సైకిల్‌పైనో ఫుడ్ డెలివరీ చేయడం కాదు. కాలి నడకనే ఫుడ్ డెలివరీ చేయాలి. దీంతో రోజూ యావరేజ్‌గా 20 కిలోమీటర్లు నడుస్తున్నానని నొచోవ్నీ చెప్పాడు. 12 ఏండ్లు చైనాలో ఉన్న అతడు గతేడాది రష్యాకు తిరిగి వచ్చేశాడు. సొంతంగా కన్సల్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాని ద్వారా ఏడాదికి 2 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఫుడ్ డెలివరీల ద్వారా అతడికి వచ్చేది రోజుకు 13 నుంచి 20 డాలర్లే. గతంతో పోలిస్తే ఫిజికల్ యాక్టివిటీ బాగా పెరిగిందని, లాక్ డౌన్ వల్ల తాను ఇన్నాళ్లూ దానిని మిస్ అయ్యానని నొచోవ్నీ చెప్పాడు. ఎల్లో కలర్ యూనిఫాం వేసుకోవడం వల్ల డెలివరీ బాయ్ ఎవరనేది ఎక్కువ మంది జనం పట్టించుకోవడం లేదన్నాడు.