ఉక్రెయిన్ రష్యా మధ్య ఇవాళ శాంతి చర్చలు

ఉక్రెయిన్ రష్యా మధ్య ఇవాళ శాంతి చర్చలు
  • బెలారస్​ బార్డర్​లో మాట్లాడ్తామన్న ఉక్రెయిన్​
  • కీవ్​లో రష్యన్ సోల్జర్లకు తీవ్ర ప్రతిఘటన   
  • ఖార్కివ్ నుంచి రష్యన్లను తరిమేశామన్న మేయర్    
  • సిటీల్లో కొనసాగుతున్న డైరెక్ట్ ఫైట్లు.. పోర్టులపై రష్యన్ సోల్జర్ల పట్టు!

కీవ్/మాస్కో:  ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి దిశగా తొలి అడుగు పడింది. రష్యన్ ప్రతినిధులతో బెలారస్ బార్డర్ లో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్–బెలారస్ బార్డర్​లో రష్యన్ ప్రతినిధులతో సోమవారం సమావేశం అవుతామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆఫీస్ వెల్లడించింది. ముందుగా బెలారస్ లోని గోమెల్ సిటీలో చర్చలకు రావాలని రష్యా ప్రతిపాదించగా జెలెన్ స్కీ తిరస్కరించారు. తమపైకి మిసైల్స్ ప్రయోగం జరుగుతున్న దేశంలో చర్చలు జరపబోమని తేల్చిచెప్పారు. పొరుగు దేశాల్లోని వార్సా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బకూ, బ్రటిస్లావా వంటి నగరాల్లో ఎక్కడైనా చర్చలకు సిద్ధమని చెప్పారు. అయితే, ఉక్రెయిన్ అధికారులు చర్చలకు దొరికిన అవకాశాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ఉదయం అన్నారు. రష్యన్ న్యూక్లియర్ ఫోర్సెస్​ను హైఅలర్ట్ గా ఉండాలని ఆదేశించినట్లు ఆయన సాయంత్రం ప్రకటించారు. బెలారస్ బార్డర్ వద్ద చర్చలకు ఉక్రెయిన్ ప్రకటన చేసింది.అయితే, బార్డర్​లో చర్చల విషయంపై రష్యా నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

నాలుగోరోజూ భీకర దాడులు 

ఉక్రెయిన్​లో నాలుగో రోజూ రష్యన్ బలగాలు మిసైల్స్, రాకెట్, బాంబు దాడులు కొనసాగించాయి. కీవ్ సిటీలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటంతో రష్యా అన్ని వైపుల నుంచీ దాడులను తీవ్రం చేసింది. దేశంలోని ఇతర కీలక సిటీలు, పట్టణాలపైనా దాడులు చేసింది. క్రీమియా, సెవస్టపోల్ సిటీలకు తాగునీటిని అందించే నీపర్ నదినీ రష్యన్ సోల్జర్లు పూర్తిగా కంట్రోల్​లోకి తీసుకున్నారు.  

సిటీల్లో రష్యన్ సోల్జర్లకు ఝలక్  

కీవ్​తో పాటు ఇతర కీలక సిటీల వద్దకు ఈజీగా చేరుకున్న రష్యన్ బలగాలకు అనేక సిటీల్లో ఉక్రెయిన్ బలగాలు, వాలంటీర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వరుసగా మూడో రోజూ కీవ్​లో రష్యన్ సోల్జర్లను అడ్డుకున్నామని, కీవ్ అంతా తమ కంట్రోల్ లోనే ఉందని ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే దేశంలో రెండో అతిపెద్దదైన ఖార్కీవ్ సిటీని మొదట రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్నా, సిటీని తిరిగి ఉక్రెయిన్ సోల్జర్లు కంట్రోల్​లోకి తీసుకున్నారు. రష్యన్ సోల్జర్లను తరిమేశామని ఖార్కీవ్ మేయర్ ఓలెగ్ సైన్ గుబోవ్ ప్రకటించారు. 

3.68 లక్షల రెఫ్యూజీలు 

ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 3.68 లక్షల మంది పొరుగు దేశాలకు వలస వెళ్లారని యునైటెడ్ నేష న్స్ శరణార్థుల సంస్థ వెల్లడించింది. పోలాండ్, హంగరీ, రొమేనియా బార్డర్లకు చేరుకుంటున్న రెఫ్యూజీల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. 

4,300 రష్యన్ సోల్జర్లు మృతి: ఉక్రెయిన్ 

యుద్ధంలో ఇప్పటివరకూ 4,300 మంది రష్యన్ సోల్జర్లను హతమార్చామని ఆదివారం ఉక్రెయిన్ డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని, 27 విమానాలను, 26 హెలికాప్టర్లను కూల్చివేశామని వెల్లడించారు.

దేశం కోసం రిటర్న్ వస్తున్రు 

యుద్ధం భయంతో లక్షలాది మంది ఉక్రెయినియన్లు దేశం విడిచి వెళ్లిపోతుంటే.. మరోవైపు వేలాది మంది ఉక్రెయిన్ మహిళలు, పురుషులు సొంత దేశాన్ని కాపాడుకోవటం కోసం రిటర్న్ వస్తున్నరు. ఒక్క పోలాండ్ బార్డర్ ద్వారానే గురువారం నుంచి 22 వేల మంది ఉక్రెయిన్ పౌరులు దేశంలోకి తిరిగి వచ్చారని అధికారులు వెల్లడించారు. దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలను కూడా జైళ్ల నుంచి విడిచిపెడుతోందని మీడియా వెల్లడించింది. సైన్యంతో కలిసి పోరాడేందుకు విదేశాల నుంచి వాలంటీర్లు రావాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. తాను కీవ్​లోనే ఉన్నానని, సిటీ పూర్తిగా ఉక్రెయిన్ కంట్రోల్​లోనే ఉందని ఆయన ప్రకటించారు. 

రష్యాను ఐసీజే బోనులో నిలబెడ్తం: జెలెన్ స్కీ 

ఉక్రెయిన్ పై దాడులకు తెగబడిన రష్యా నరమేధానికి పాల్పడుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మండిపడ్డారు. దేశంలోని సాధారణ ప్రజల ఇండ్లపైనా రష్యన్ దళాలు బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. రష్యాను ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్​జస్టిస్ (ఐసీజే)లో దోషిగా నిలబెడతామని చెప్పారు. ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అప్లికేషన్ అందజేసిందని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. రష్యా వెంటనే మిలటరీ దాడులు ఆపేలా ఆదేశించాలని కోరామని, త్వరలోనే విచారణ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. 

‘స్విఫ్ట్’ నుంచి రష్యా ఔట్ 

అమెరికా, బ్రిటన్, జర్మనీ తాజాగా మరిన్ని ఆంక్షలు ప్రకటించాయి. స్విఫ్ట్ గ్లోబల్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను దూరం పెట్టేందుకు అమెరికా, యూరోపియన్ కమిషన్, బ్రిటన్, కెనడా తదితర దేశాలు ఓకే చెప్పాయి. ప్రపంచ బ్యాంకింగ్ మెసేజింగ్ సర్వీస్ సంస్థ ‘స్విఫ్ట్’ నెట్ వర్క్ నుంచి రష్యన్ బ్యాంకులను బహిష్కరించాలని నిర్ణయించాయి. అలాగే రష్యా ఫారిన్ రిజర్వ్ లను వాడుకోకుండా చూసేందుకు రష్యన్ సెంట్రల్ బ్యాంకుపైనా ఆంక్షలు విధించేందుకు ఓకే చెప్పాయి. 200 దేశాల్లో 11 వేల బ్యాంకులు, సంస్థలు అనుసంధానమైన ఉన్న స్విఫ్ట్ నుంచి రష్యాను దూరం పెట్టడంతో ఆ దేశానికి ఆర్థికంగా గట్టి దెబ్బ తగులుతుందని నిపుణులు చెప్తున్నారు.