గూఢచారి గుడ్లగూబ..

గూఢచారి గుడ్లగూబ..

అచ్చం గుడ్లగూబలాగే ఉంది కదా. ఇది ఓ డ్రోన్. రష్యా తయారు చేసింది. ఏటా నిర్వహించే మిలటరీ ఎగ్జిబిషన్లో దీనితో పాటు మరి కొన్ని అధునాతన ఆయుధాలనూ ప్రదర్శనకు పెట్టింది. రష్యా రాజధాని మాస్కోలోని పాట్రియాట్ పార్క్లో ‘ద ఇంటర్నేషనల్ మిలటరీ టెక్నికల్ ఫోరం’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 27 వేల ఆయుధాలు, వాహనాలను ప్రదర్శించారు.

ఆర్కిటిక్లో రష్యా కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో శత్రు దేశాలను తికమక పెట్టేందుకే ఈ గుడ్లగూబ డ్రోన్ను తయారు చేసినట్టు చెబుతున్నారు. రష్యా మిలటరీ సంస్థ ఇన్నోవేటివ్ టెక్నోపోలిస్ ఎరా తయారు చేసింది. ప్రత్యేకంగా చలి వాతావరణాల్లో శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకే ఈ రూపునిచ్చారు. అయితే, అసలైన ప్రొటోటైప్ డిజైన్ను జుకోవ్స్కీ అకాడమీ చేసింది.

దీని రెక్కల పొడవు ఐదు అడుగులు. 5 కిలోల బరువుండే ఇది 40 నిమిషాల పాటు ఏకధాటిగా ఎగరగలదు. మామూలు డ్రోన్లతో పోలిస్తే ఈ డ్రోన్ ఎవరికీ కనిపించదని రష్యా మిలటరీ చెబుతోంది. ప్రదర్శనలో రష్యా సహా వివిధ దేశాలకు చెందిన 1250 కంపెనీలు తమ ప్రొడక్ట్స్ను ప్రదర్శిస్తున్నాయి.