భయంతో బతుకు వెళ్లదీస్తున్న వ్లాదిమిర్ పుతిన్

భయంతో బతుకు వెళ్లదీస్తున్న వ్లాదిమిర్ పుతిన్

‘‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భయంతో బతుకు వెళ్లదీస్తున్నాడు. రష్యా సైన్యం వెనకడుగుతో ఆయనకు ప్రాణ భయం పట్టుకుంది. యుద్ధాల్లో ఓటమి పాలైన జార్ చక్రవర్తులకు క్షమాభిక్ష లభించదు” అని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్ స్కీకి సలహాదారైన ఓలిక్సి అవత్సోవిచ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను గందరగోళపరచడానికి, మానసికంగా బలహీనులను చేయడానికే ఆయన అలా అని ఉండవచ్చు. కానీ, ఆయన మాటలను పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. ఉక్రెయిన్​ఆక్రమణలో రష్యాకు మొదట్లో కొన్ని విజయాలు లభించినా అవి క్రమేపీ చేజారిపోతూ వచ్చాయి.  రష్యా 2022 ఫిబ్రవరి 24న దండయాత్ర మొదలెడితే దానికి అధీనమైన నగరాలు కొద్ది మాత్రమే. కానీ, ఖెర్సాన్ నగరం నుంచి కూడా దాని సేనలు తిరోగమించక తప్పలేదు. మరోపక్క దేశంలో వృద్ధులను మినహాయించి యువకులందరినీ యుద్ధానికి సమాయత్తపరచడానికి చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతున్నది. మరిన్ని బలగాలను సమీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే యువకులు పొట్టచేత పట్టుకుని పెద్ద సంఖ్యలో పొరుగు దేశాలకు వలసపోతున్నారు. ఇది మిగిలిన రష్యా సమాజ మానసిక స్థైర్యంపై ప్రభావం చూపుతున్నది. రణరంగం నుంచి సైనికులు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదోనని వారి కుటుంబాల్లో ఆందోళన రోజు రోజుకు పెరుగుతున్నది. 9 నెలల్లో కనీసం లక్ష మంది రష్యన్ యువ సైనికులు అంగవిహీనులయ్యారు. దాంతో సైనిక చర్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా పుతిన్ పై రష్యాలోని ప్రాంతీయ నాయకుల నుంచి ఒత్తిడి వస్తున్నది. యుగిని ప్రిగోదమ్ వంటి యువ నేతలు అప్పుడే పుతిన్ అనంతర పరిస్థితులను బేరీజు వేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం..

పాశ్చాత్య కంపెనీలు మూకుమ్మడిగా రష్యా నుంచి బిచాణా ఎత్తేయడంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పుతిన్ ప్రభుత్వంలో మొదటిసారిగా బీటలు పొడసూపుతున్నాయి. దేశంలోని కంపెనీలు, పరిశ్రమలన్నింటినీ పెద్దఎత్తున జాతీయీకరణ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సాగుతున్నది. కానీ, అవన్నీ పూర్తిగా పాశ్చాత్య టెక్నాలజీలపై ఆధారపడ్డవనే అంశం రష్యన్ల గొంతులో పచ్చి వెలక్కాయలా మారింది. ఈ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించింది కాబట్టి అది గెలిచి తీరాలి. రష్యా ఎటువంటి రాజీ ధోరణిని కనబరచినా, అవి దానికి వ్యతిరేకంగానే పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి రాజీకి వెళ్లకూడదన్నది ఇటీవలి కాలం వరకు ‘సిలోవికి’ (సెక్యూరిటీ సర్వీస్ అధికారులు), టెక్నోక్రాట్ల అభిప్రాయంగా ఉంటూ వచ్చింది. కానీ, ఆదరా బాదరాగా జనాన్ని సైన్యంలోకి తీసుకునే కార్యక్రమం పట్ల దేశంలో విస్తృతంగా అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఆ ఏకాభిప్రాయం చెదిరిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, రష్యా నుంచి శాంతిని కోరుతున్న గొంతుకలు ఏవీ వినిపించకపోవడం ఆశ్చర్యంగానే ఉన్నా, దానికీ ఒక వివరణ కనిపిస్తున్నది. యుద్ధం విషయంలో పుతిన్ తో విభేదించగల శక్తి ఉన్నవారు కూడా రష్యా ఏదో ఒక విధమైన చర్యకు దిగక తప్పని స్థితికి నెట్టింది పాశ్చాత్య దేశాలేనని ఆగ్రహంతో ఉన్నారు. యుద్ధం కొనసాగాలంటే సైన్యానికి పాక్షిక సమీకరణ కాకుండా, పూర్తి స్థాయిలోనే జనాన్ని సమీకరించాల్సి ఉంటుందని వివేచనాపరులు గ్రహిస్తున్నారు. 

పెరుగుతున్న ఒత్తిడి

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై 9 నెలలవుతున్నది. కారణాలేమైతేనేమి రష్యాకు విజయం ఇంతవరకు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అణ్వాయుధాలను ప్రయోగిస్తామనే రష్యా బెదిరింపులకు కూడా ప్రపంచ దేశాలు ఇదివరకటిలా భయపడటం లేదు. రష్యాపై ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. ఆర్థికంగా దెబ్బతీశాయి. వాటికితోడు సైనికపరమైన విఘాతాలను కూడా రష్యా చవి చూడాల్సి వచ్చింది. ఖెర్సాన్ నుంచి వెనకడుగు వేయడం వ్యూహపరమైన ఎత్తుగడగా చిత్రించుకునేందుకు క్రెమ్లిన్ ప్రయత్నిస్తున్నా అది ఫలిస్తున్న సూచనలు కనిపిచడం లేదు. ఉక్రెయిన్​కు అమెరికా తదితర దేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయి.  

ఇది అందరి సమస్య

రష్యా – ఉక్రెయిన్​ యుద్ధాన్ని ఆ రెండు దేశాలకే పరిమితమైనదిగా చూడటానికి లేదు. ఇది పరస్పర ఆధారిత నవీన ప్రపంచం. ఎక్కడో కొన్నింటిని మినహాయిస్తే చాలా దేశాలు మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. చనిపోతున్నది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు, రష్యన్ సైనికులు మాత్రమే కాదు. పరోక్షంగా లక్షలాది మంది బతుకులు ధ్వంసమవుతున్నాయి. గ్యాస్, ఇతర ఇంధన సరఫరాలు నిలిచిపోవడంతో యూరప్ దేశాలు రక్తాన్ని గడ్డకట్టించే ఈ చలికాలాన్ని ఎలా గడపాలా అని చూస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో కోతలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఒక్క విద్యుత్ కొరత చాలదూ జన జీవితాన్ని స్తంభింపజేయాడానికి. యుద్ధం వారి దేశాల సరిహద్దులను తాకకుండానే ఇండ్లలోకి ప్రవేశించింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నది. వ్యాపారాలు అతలాకుతలం అవుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం, ఫలితంగా ద్రవ్యోల్బణం, దాంతో వడ్డీ రేట్లు పెరగడాన్ని చూస్తున్నాం. అమెరికా, రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి దేశాలు కంటికి కన్ను పంటికి పన్ను వైఖరిని అనుసరిస్తున్నాయి. తమకు అనువు కాని ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై భద్రతా మండలిలో ఏదో ఒక దేశం వీటో చేస్తోంది. సమస్య ఎక్కడిదక్కడే ఉంటోంది. పుతిన్ పెద్ద మనసుతో యుద్ధానికి స్వస్తి చెప్పాలి.  రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలు కూడా వాటిని సడలించి చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి.

రష్యా ఈ యుద్ధాన్ని గెలవగలదా?

రష్యా సైనిక పాటవంపై సందేహాలు పెరుగుతున్నాయి. రష్యా వద్దనున్న మరింత ఆధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల సంఖ్య తరిగిపోతోందని చెబుతున్నారు. ఇరాన్ లో తయారైన షహీద్ డ్రోన్ లను రష్యా ప్రయోగిస్తోంది. అవి ఎక్కువ నష్టం వాటిల్లజేస్తున్నాయి. మిగిలిన ఆయుధాలతో పోలిస్తే చౌక ధరకు కూడా లభిస్తున్నాయి. అటువంటి 200 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్​ చెప్పుకుంటోంది. రష్యా ఇప్పటికే 2000 డ్రోన్ లను కొనుగోలు చేసి పెట్టుకుందని ఉక్రెయిన్ నిఘా వర్గాల అంచనా. తక్కువ టెక్నాలజీతో పది వేల డాలర్ల ఖర్చుతో ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేసుకునే ఏర్పాట్లలో రష్యా ఉందని సమాచారం. రాజకీయ నేతల్లో అత్యంత జాతీయవాద మితవాదులు సైనిక, రాజకీయ వైఫల్యాల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. యుద్ధ తీవ్రతను పెంచాలని వారు కోరుతున్నారు. సీనియర్ సైనికాధికారులు మాత్రం యుద్ధ విరమణకు విముఖంగా ఉన్నారు. పుతిన్ కన్నా దుర్భరమైన వారితో కూడిన వర్గం అధికారానికి వస్తే అది తమ పదవులకు ఎసరు పెడుతుందని వారు భావిస్తున్నారు. నెపాన్ని తమపైకి నెట్టి పాతవారందరికీ అది స్వస్తి పలుకుతుందని వారిలో గుబులు ఉంది.     

- మల్లంపల్లి ధూర్జటి,సీనియర్​ జర్నలిస్ట్