ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దురాక్రమణ

ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దురాక్రమణ

ఉక్రెయిన్ లో భీకర దాడులకు తెగబడుతున్న రష్యా సైనికులు పలు సిటీల్లో దారుణాలకు పాల్పడ్డారు. ఇప్పటికే బుచాలో బయటపడిన దుశ్చర్యలు మరువక ముందే.. మరియుపోల్ లోనూ అటువంటి క్రూర చర్యలు జరిగాయని శాటిలైట్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. మరియుపోల్ కు సమీపంలో 200కు పైగా భారీ సామూహిక సమాధుల గుట్టలు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా తేలింది. సుమారు 9 వేల మంది ఉక్రెయిన్లను రష్యా సైనికులు హతమార్చారని.. మృతదేహాలను ట్రక్కుల్లో తీసుకొచ్చి.. మరియుపోల్ సమీపంలో పాతిపెట్టారని స్థానిక మేయర్ సహాయకుడు ఆండ్రియుష్ చెంకో తెలిపారు. శాటిలైట్ ఫొటోలపైన.. క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే మరియుపోల్ పైన విరుచుకుపడుతున్న రష్యా.. ఆ సిటీపైనా పట్టు సాధించినట్లు స్థానికులు తెలిపారు.

ఉక్రెయిన్ లోని పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పుతిన్ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి. బొగ్గు గనులు, ఖనిజఆధార పరిశ్రమలు, భారీ పరికరాల కర్మాగారాలు ఉన్న డాన్ బాస్ ప్రాంతంలోని సిటీలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడుతోంది. స్లొవ్యాన్స్క్ సిటీపైనా రాత్రి వేళ బాంబుల వర్షం కురిపించినట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఖర్కివ్ సిటీపైనా రష్యా దాడులు కొనసాగిస్తోంది. 

కీవ్ నుంచి రష్యా తన సేనలను ఉపసంహరించుకున్న తర్వాత డాన్ బాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా దాడుల చేస్తోంది. మరోవైపు పుతిన్ సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు దీటుగానే ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టి రెండు నెలలు కావస్తుండగా... ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఈ నెల 26వ తేదీన మాస్కో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆంటోనియో భేటీ కానున్నారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మాస్కోతో పాటు కీవ్ నగరాలకు వచ్చి మాట్లాడతానంటూ ఆంటోనియో ఇప్పటికే పుతిన్, జెలెన్ స్కీలకు వేర్వేరుగా లేఖలు రాశారు.

మరిన్ని వార్తల కోసం..

 

మలేరియా కట్టడిలో రాష్ట్రానికి జాతీయ గుర్తింపు

ఐకేపీ సెంటర్ల దగ్గర అరిగోస పడుతున్న రైతులు