బంగారు పతకం గెలవాలి.. దేశం గర్వపడేలా చేయాలి: రుతురాజ్

బంగారు పతకం గెలవాలి.. దేశం గర్వపడేలా చేయాలి: రుతురాజ్

ఆసియా గేమ్స్‌లో తలపడే భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టుకు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వం వహించనుంది. ఈ అవకాశం రావడం పట్ల రుతురాజ్ స్పందించారు. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అతను.. దేశానికి బంగారు పతకం సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. 

"ప్రతిష్టాత్మక టోర్నీలో దేశానికి భాద్యత వహించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి, సెలెక్టర్లకు కృతజ్ఞతలు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు అయినప్పటికీ మంచి ప్రదర్శన ఇవ్వగలం.. దేశం తలెత్తుకునేలా చేయగలం. మా లక్ష్యం ఒక్కటే.. స్వర్ణం గెలవాలి.. పోడియం వద్ద నిల్చొని దేశ జాతీయ గేయాన్ని ఆలపించాలి.." అని రుతురాజ్ తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.

చైనాలోని హంగ్‍జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుండి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. మహిళా క్రికెట్ మ్యాచ్‍లు నాలుగు రోజులు ముందుగానే సెప్టెంబర్ 19 నుండి మొదలుకానుండగా.. పురుషుల  క్రికెట్ మ్యాచ్‍లు సెప్టెంబర్ 28 నుండి జరగనున్నాయి. టీ20 ఫార్మాట్‍లో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మహిళల క్రికెట్‌లో 14 జట్లు పోటీపడనుండగా.. పురుషుల క్రికెట్‌లో 18 జట్లు పోటీపడనున్నాయి.

ఆసియా గేమ్స్ భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం మావీ, శివం దూబే, ప్రభ్‍సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).

స్టాండ్‍బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

ఆసియా గేమ్స్ భారత మహిళల జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్‍జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టితాస్ సంధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్నూ మణి, కనిక అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనూష బారెడ్డి

స్టాండ్‍బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.