రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోండి : ఆర్‌‌‌‌వీ కర్ణన్‌‌

రేషన్ కార్డు లేకున్నా అప్లై చేసుకోండి : ఆర్‌‌‌‌వీ కర్ణన్‌‌

సూర్యాపేట, వెలుగు: రేషన్ కార్డులు లేకపోయినా ఆరుగ్యారంటీల కోసం అప్లై చేసుకోవచ్చని  వైద్య శాఖ డైరెక్టర్,  ఉమ్మడి నల్గొండ జిల్లా నోడల్ అధికారి ఆర్‌‌‌‌వీ కర్ణన్ సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్‌‌‌‌లో నిర్వహించిన ప్రజాపాలనలో కలెక్టర్ వెంకట్‌‌రావు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. 

కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డు లేదని అధైర్య పడొద్దని, అందరితో పాటు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు.  ప్రజాపాలనలో అధికారులు అందుబాటులో లేకుంటే మరుసటి రోజు పంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందికి అందచేసి,  రసీదులు తీసుకోవాలని కోరారు.  జిల్లాలోని 475 జీపీలు, 141 మున్సిపల్ వార్డులలో నియమించిన 58 టీమ్‌‌లు పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు. 

అనంతరం కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌రావు మాట్లాడుతూ..  ప్రజాపాలనకు విశేష స్పందన వస్తోందని, ఈ నెల 6 వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వమే ఉచితంగా అప్లికేషన్ ఫారాలు అందిస్తోందని,  ప్రజలు జీరాక్స్ సెంటర్ల అప్లికేషన్లు కొనుగోలు చేయవద్దన్నారు.  ఈ కార్యక్రమంలో  ఏఎస్పీ  నాగేశ్వర రావు,  నియోజకవర్గ ప్రత్యేక అధికారి జడ్పీ సీఈవో సురేష్ కుమార్ పాల్గొన్నారు.