యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో రిఫామ్స్ ఇంకెన్నడు

యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో రిఫామ్స్ ఇంకెన్నడు

యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​లో రిఫామ్స్ ఇంకెన్నడు
లబ్ధి పొందుతున్నందుకే పర్మనెంట్ దేశాలు పట్టించుకోవట్లే
ఆస్ట్రియా జాతీయ మీడియాతో విదేశాంగ మంత్రి జైశంకర్   
పాకిస్తాన్ పై ఇంకా ఘాటుగా మాట్లాడాల్సిందే అని కామెంట్​

వియన్నా : ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో రిఫామ్స్ ను పర్మనెంట్ మెంబర్ దేశాలు పట్టించుకోవడంలేదని మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ లో వీటో అధికారంతో లబ్ధి పొందుతున్నందున ఆ దేశాలకు రిఫామ్స్ విషయంలో తొందరేమీ లేదన్నారు. కానీ ఇండియా వంటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న పెద్ద దేశానికి కూడా సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం లేకపోవడం సరైంది కాదన్నారు. యూరప్ లోని ఆస్ట్రియాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం ఆ దేశ జాతీయ మీడియా సంస్థ ఓఆర్ఎఫ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ఐక్యరాజ్యసమితి ఏర్పాటైన 1945 నాటి పరిస్థితి వేరు. ఇప్పుడు 2023 వచ్చింది. 75 ఏండ్లలో పరిస్థితి ఎంతో మారింది. ఇప్పటికీ రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా మాత్రమే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్స్ గా కొనసాగుతున్నాయి. ఇండియాతోపాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని దేశాలకూ పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎక్కువ కాలం పెండింగ్ లో పెట్టకుండా రిఫామ్స్ తేవాలి” అని ఆయన స్పష్టం చేశారు. 

యూరప్ దేశాలు టెర్రరిజాన్ని ఖండించాలె.. 

పాకిస్తాన్ ను టెర్రరిజానికి ఎపిసెంటర్ అని తాను గతంలో కామెంట్ చేయడం చాలా చిన్న విషయమని, వాస్తవానికి ఇంకా ఘాటుగా మాట్లాడాల్సిందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ‘‘మా పార్లమెంట్ పై పాక్ టెర్రరిస్టులు దాడి చేశారు. ముంబై సిటీపై అటాక్ చేశారు. మేం టెర్రరిజానికి కేంద్రంగా మారిన పాక్ కు పక్కనే ఉన్నందున మాపై తీవ్రమైన ఎఫెక్ట్ ఉంది. కానీ పాక్ తీరును యూరప్ దేశాలు మాత్రం కొన్ని దశాబ్దాలుగా పెద్దగా ఖండించడంలేదు. ఇది మన సమస్య కాదులే అన్నట్లుగా చూడటం సరికాదు” అని ఆయన విమర్శించారు.  

ఒప్పందాలను చైనా పట్టించుకోవట్లే.. 

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఏకపక్షంగా ఆక్రమణలకు తెగబడుతోందని, రెండు దేశాల మధ్య కుదిరిన బార్డర్ అగ్రిమెంట్లను పట్టించుకోవట్లేదని జైశంకర్ మండిపడ్డారు. శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ బాగా పెరిగిన ప్రస్తుత కాలంలో ఏ దేశం ముందుగా ఆక్రమణలకు దిగింది? బలగాలను తరలించిందన్నది కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని హెచ్చరించారు. అలాగే రష్యాపై అమెరికా, తదితర దేశాలు ఆంక్షలు విధించినా ఇండియా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్​ను కొంటోందన్న విమర్శలపైనా ఆయన స్పందించారు.