SA20 2024: సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

SA20 2024: సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఈస్టర్న్ కేప్ బోణీ కొట్టింది.  మంగళవారం(జనవరి 16) ముంబై కేప్ టౌన్‌‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ మొహంలో ఎక్కడలేని సంతోషం కనిపించింది. 

జోర్డాన్ హెర్మాన్ శతకం

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులుభారీ స్కోర్ చేసింది. జోర్డాన్ హెర్మాన్(106; 62 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం బాదగా.. డేవిడ్ మలాన్(53; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు.

గెలిపించిన బార్ట్‌మన్

అనంతరం 203 భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై కేప్ టౌన్.. నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసి.. విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. బార్ట్‌మన్ చాకచక్యంతో జట్టును గట్టెక్కించాడు. మొదటి బంతి సిక్స్ వెళ్ళగానే మ్యాచ్ చేజారినట్లు అనిపించినా.. ఆ తరువాత మిగిలిన ఐదు బంతులను కట్టడి చేసి సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(58; 33 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు.

గంతేసిన కావ్య పాప

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనతో డీలా పడిపోయిన కావ్య మారన్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఈస్టర్న్ కేప్ తొలి విజయాన్ని అందుకోగానే.. సంతోషం పట్టలేకపోయింది. మ్యాచ్ ముగియగానే ఆనందంతో ఎగిరి గంతేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా.. వాటిని చూసి అభిమానులు కావ్య పాప నవ్విందోచ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తొలి మ్యాచ్ వర్షంతో రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.