శబరిమలకు తొలి రోజు 10 మంది మహిళలు

శబరిమలకు తొలి రోజు 10 మంది మహిళలు
  • అయ్యప్ప మండల పూజలు ప్రారంభం
  • ఏపీ నుంచి వచ్చిన 10-50 మధ్య వయసు మహిళలు
  • పంబ దగ్గర ఆపేసి వెనక్కి పంపిన పోలీసులు

శబరిమల అయ్యప్ప సన్నిధానంలో మండల పూజలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి భక్తులకు ధర్మశాస్త దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అన్న శరణు ఘోషతో శబరిగిరి మారుమోగిపోయింది. నేటి నుంచి మకర సంక్రాంతి వరకు పూజలు జరుగుతాయి.

సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి

శబరిమల వచ్చే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వబోమని కేరళ దేవస్వం మంత్రి సురేంద్రన్ నిన్న ప్రకటించారు. శబరిమలలో శాంతియుత వాతావరణం కోరుకుంటున్నామని చెప్పారు. అయ్యప్ప దర్శనానికి రావొద్దని మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్‌కు నేరుగా చెప్పారు. శబరిమల వంటి పవిత్ర క్షేత్రం బల ప్రదర్శనలకు వేదిక కాదంటూ ఆమెను సున్నితంగా హెచ్చరించారు. ఒక వేళ తప్పనిసరిగా రావాలనుకుంటే రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు నుంచి ఆర్డరు తెచ్చుకోవాలని సూచించారు సురేంద్రన్.

తొలి రోజే పది మంది మహిళలు

అయ్యప్ప దర్శనం ప్రారంభమైన తొలి రోజునే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న పది మంది మహిళలు ఏపీ నుంచి శబరిమలకు వచ్చారు. అయితే వారు సన్నిధానం వద్దకు వెళ్తే భక్తులు నిరసనలకు దిగుతారని, ఉద్రిక్త వాతావరణానికి ఆస్కారం ఉందని వారిని పోలీసులు అడ్డుకున్నారు. పంబ దగ్గర ఆపేసి.. అక్కడి నుంచి వెనక్కి పంపించారు.
తీర్పుపై అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్న సీఎం

శబరిమల ఆలయ సంప్రదాయం ప్రకారం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశం నిషేధం. ఆ నియమాన్ని అమలు చేయొద్దని, మహిళలకు దర్శనం కల్పించాలని 2018 సెప్టెంబరు 28న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇటీవల ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం ఎటూ తేల్చకుండా ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి రెఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అనుమానాలు నివృత్తి చేసుకోవాలని, ఇందుకు న్యాయ సలహా తీసుకుంటామని కేరళ సీఎం విజయన్ ప్రకటించారు. దీంతో ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం పాత తీర్పు అమలు విషయంలో సందిగ్ధం నెలకొంది.