
జన్ సంఘర్ష్ యాత్ర..మార్పుకోసమే!
రెండోరోజు యాత్రలో సచిన్ పైలట్
జైపూర్ : రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఆర్పీఎస్సీ) వ్యవస్థలో మార్పు రావాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ శుక్రవారం పిలుపునిచ్చారు. అవినీతి, టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వంటి ప్రధాన అంశాలపై అజ్మీర్ నుంచి జైపూర్ దాకా 125 కిలోమీటర్ల మేర సచిన్ పైలట్ గురువారం జన్ సంఘర్ష్ యాత్ర ప్రారంభించారు. శుక్రవారం రెండోరోజు యాత్ర కిషన్ గఢ్‌కు చేరుకోగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ఇటీవల్ టీచర్ రిక్రూట్మెంట్ కోసం ఆర్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ లీకైంది. ఈ కేసులో అరెస్టయిన కమిషన్ సభ్యుడు బాబూలాల్ కటారా రూ.60 లక్షలకు ప్రశ్న పత్రాన్ని అమ్ముకున్నాడని పోలీసులే చెప్పారు. ఆర్పీఎస్సీ సభ్యుడు అరెస్ట్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్పీఎస్సీని సమూలంగా మార్చాల్సిందే”అని సచిన్ పైలట్ అన్నారు. తన పోరాటం ప్రజల కోసమేనని చెప్పారు.
యాత్రపై కాంగ్రెస్ నజర్
పైలట్ జన్ సంఘర్ష్ యాత్ర ఆయన వ్యక్తిగతమని దానిపై పార్టీ నిఘా ఉంటుందని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుఖ్‌జిందర్‌సింగ్ రంధావా చెప్పారు. పైలట్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు రంధావా స్పందించారు. పైలట్ వ్యక్తిగతంగా యాత్ర చేస్తున్నారని, దానిపై ఓ కన్ను వేసి ఉంచుతామని రంధావా వివరించారు.