
- ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ
- 700 మంది మహిళల ర్యాలీడప్పు, డోలు, కొమ్ము, కోయ కళాకారుల ప్రదర్శనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మంగళవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. వేలాది మంది మహిళలు ఆడిపాడారు. రంగురంగుల పూలతో పేర్చిన వందలాది బతుకమ్మలు కనువిందు చేశాయి. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్నివాల్ ముగింపు వేడుకలు నిర్వహించారు. సద్దుల బతుకమ్మ సంబురంలో భాగంగా ముందు అమరవీరుల స్తూపం వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గౌరమ్మ బతుకమ్మలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ర్యాలీ ప్రారంభించారు. 700 మంది మహిళలు బతుకమ్మలతో ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ కు చేరుకున్నారు. డప్పు, డోలు, కొమ్మ కోయ కళాకారులు ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. బోనాలు ఎత్తుకుని కొందరు, కోలాటం ఆడుతూ మరికొందరు, చిరుతలు వాయిస్తూ , డ్యాన్సులు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన లేజర్ షో ఎంతో ఆకట్టుకున్నది.
ఆడి పాడిన మంత్రి కొండా సురేఖ
ర్యాలీ అనంతరం ట్యాంక్‌బండ్‌పై వందలాది మంది మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. మంత్రి సురేఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్, గద్దర్బిడ్డ వెన్నెల, పలువురు విదేశీ మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడారు. ‘‘చిన్నప్పటి నుంచి నేను బతుకమ్మ ఆడుతున్నాను. కానీ, ఇది చరిత్రలో నిలిచిపోయే బతుకమ్మ. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజా ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న బతుకమ్మ ఇది. గతంలో కొంత మంది డిస్కో డ్యాన్సులు చేసేటోళ్లు. ఆ కల్చర్ ఇప్పుడు లేదు. మన పెద్దలు అందించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నం’’అని మంత్రి సురేఖ అన్నారు. ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు అనీల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.