సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ఆస్తులు ఈడీ అటాచ్

సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ఆస్తులు ఈడీ అటాచ్
  •     రూ.161.50 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు జప్తు  
  •     ప్రీ లాంచింగ్ పేరుతో కస్టమర్ల నుంచి రూ.కోట్లు వసూలు
  •     మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసిన ఈడీ

హైదరాబాద్,వెలుగు: సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌{ఎస్‌ఐవీఐపీఎల్‌) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. సంస్థ ఎండీ బి. లక్ష్మినారాయణ్‌, మాజీ డైరెక్టర్‌ ఎస్‌. పూర్ణచంద్రరావు, కుటుంబ సభ్యులకు చెందిన రూ.161.50కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈడీ అధికారులు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. సాహితీ ఇన్ ఫ్రా ప్రీ లాంచింగ్ పేరుతో మోసాలకు పాల్పడిందనే ఫిర్యాదులతో సైబరాబాద్,హైదరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో  నమోదైనది తెలిసిందే. 

ప్రీ లాంచింగ్ పేరుతో అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట 655 మంది కొనుగోలుదారుల నుంచి రూ.248.27కోట్ల మేర వసూలు చేసి, నిర్మాణాలు చేపట్టకుండా మోసానికి పాల్పడింది. దీంతో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. 

ఎస్‌ఐవీఐపీఎల్‌ మాజీ డైరెక్టర్‌  పూర్ణచంద్రరావు 2018 ఆగస్టు నుంచి 2020 మధ్య కాలంలో రూ.126కోట్లు కొనుగోలు దారుల నుంచి వసూలు చేసినట్టు ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. రూ.వందల కోట్ల విలువైన స్థిరాస్తులను తన పేరిట,తన కుటుంబ సభ్యుల పేరిట పూర్ణచంద్రరావు కొనుగోలు చేసినట్టు ఆధారాలు సేకరించారు. పోలీసులు సీజ్ చేసిన ప్రాపర్టీస్ తో పాటు ఈడీ తన దర్యాప్తులో గుర్తించిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.