మా ప్లాట్లను కబ్జా నుంచి కాపాడండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన యాజమానులు

మా ప్లాట్లను కబ్జా నుంచి కాపాడండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన యాజమానులు

సిద్దిపేట, వెలుగు:  కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారి నుంచి తమను కాపాడాలని సాయికృష్ణ రియల్ ఎస్టేట్ ప్లాట్ల యజమానులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు.  మంగళవారం సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్లాట్ల యజమానులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట పట్టణం సర్వే నెంబర్ 2000 లో సాయి కృష్ణ రియల్ ఎస్టేట్  1998 లో 21 ఎకరాల్లో ప్లాట్లు చేసి 318 మందికి విక్రయించారని తెలిపారు.  2023లో అలకుంట మహేందర్ రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమంగా సర్వే నెంబర్ 2000లో ఎకరం భూమిని ధరణిలో తన పేరిట పాస్ బుక్ చేసుకుని వెంచర్ లోని 11 మందికి చెందిన 20 ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించాడు.   

ప్లాట్ల వద్దకు వెళితే భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకట స్వామి న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో  ప్లాట్ల యజమానులు కొండ రమేశ్, మద్దెల నారాయణ, మహ్మద్ జాకీర్ బాషా, మేడిశెట్టి నర్సింలు, చింతల శంభయ్య, బీ మాణిక్యరావు, బేతి యాదగిరి, కొండ అనిత, మేడిశెట్టి లక్ష్మీ, గంభీరావుపేట రాజేందర్ లు ఉన్నారు.