వరుస సినిమాలతో బిజీగా ఉంది సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యకు జంటగా ‘తండేల్’ చిత్రంలో నటిస్తున్న ఆమె, మరోవైపు తమిళంలో ‘శివకార్తికేయన్‌కు జంటగా ‘అమరన్’లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు హిందీలో ‘ఏక్ దిన్’ అనే సినిమా చేస్తోంది. ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సునీల్ పాండే డైరెక్ట్ చేస్తున్నాడు. ఆమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
గత కొద్దిరోజులుగా ఈ చిత్రం షూటింగ్ జపాన్‌లో జరుగుతోంది. తాజాగా ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా జపాన్‌లోని ఓ పబ్‌లో టీమ్ మెంబర్స్ అంతా చిన్న పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ హిందీ పాటకు ఫుల్ జోష్‌గా డ్యాన్స్ చేసి టీమ్ అందరినీ ఆశ్చర్యపరిచింది సాయిపల్లవి. టీమ్‌లో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది. డ్యాన్స్ చేయడంలో తన ఎనర్జీ సూపర్ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయిపల్లవి జోష్ చూస్తుంటే.. ఫస్ట్ మూవీతోనే బాలీవుడ్లో సక్సెస్ జెండా ఎగరేసేలా కనిపిస్తోంది!