కిచెన్ తెలంగాణ..సమ్మర్​లో సలామ్​ షర్బత్

కిచెన్ తెలంగాణ..సమ్మర్​లో సలామ్​ షర్బత్

సమ్మర్​లో నిమ్మకాయ షర్బత్​ తాగకుండా సీజన్​ దాటలేం అంటే అతిశయోక్తి కాదు. చల్లగా, నీళ్ల నీళ్లుగా కడుపులోకి వెళ్తే ‘ఈ షర్బత్​ సల్లగుండ’ అనుకోని వాళ్లు ఉండరు. ఇప్పటికే సూర్యప్రతాపం ఓ రేంజ్​లో చూపిస్తున్నాడు. కాబట్టి అందరికీ తెలిసిన నిమ్మకాయ షర్బత్​తో మరికొన్ని రకాల షర్బత్​లు చేసుకుని ‘షర్బత్​ ఏ ఇష్క్​..’ అని పాడుకోవచ్చు.  

నోట్​ :  జెల్లీ తయారు చేసేటప్పుడు అదనంగా నీళ్లు వాడొద్దు. అలా వాడితే జెల్లీ సెట్​ కాదు. సగ్గుబియ్యం ట్రాన్స్​పరెంట్​గా అయ్యేవరకు ఉడికించాలి. లేదంటే పళ్లకు అతుక్కుపోతుంది. పంచదారను రుచికి తగినంత వేసుకోవచ్చు.

పుదీన

కావలసినవి :

పుదీనా - ఒక కట్ట

నీళ్లు - ఐదు కప్పులు

పంచదార - అర కప్పు

నిమ్మరసం - ఒక టీస్పూన్​

తయారీ : మూడు కప్పుల నీళ్లను ఐదు నిమిషాలు మరిగించాక అందులో పుదీనా ఆకులు వేయాలి. తరువాత స్టవ్​ ఆపేసి చల్లారబెట్టాలి. మిగిలిన రెండు కప్పుల నీళ్లలో పంచదార వేసి కరిగేవరకు ఉడికించాలి. దీన్ని కూడా చల్లారబెట్టాలి. ఆ తరువాత పుదీనా నీళ్లు వడకట్టి వాటిలో పంచదార నీళ్లను  పోసి, నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్​లో పెట్టి పుదీనా షర్బత్​ తాగాలన్నప్పుడు కలుపుకుని తాగడమే.

బాదం

కావలసినవి :

బాదం - ఒక కప్పు

 పంచదార - నాలుగు కప్పులు

నీళ్లు - రెండు కప్పులు

యాలకుల పొడి - ఒక టీస్పూన్​

కుంకుమపువ్వు తీగలు - రెండు

తయారీ : బాదం గింజలను నానబెట్టి పొట్టు తీసి మెత్తటి పేస్ట్​లా గ్రైండ్​ చేయాలి. సాస్​పాన్​లో పంచదార, నీళ్లు, యాలకలపొడి, కుంకుమపువ్వు తీగలు వేసి ఉడికించాలి. అవి చల్లారాక వడకడితే సాఫ్ట్​ లిక్విడ్​ తయారవుతుంది. వడకడితే మిగిలిన పేస్ట్​ను మళ్లీ ఒకసారి గ్రైండ్​ చేయాలి. దాన్ని కూడా బాదం నీళ్ల మిశ్రమంలో కలపాలి. బాగా చల్లారాక గాజు సీసాలో నింపి నిల్వ చేయాలి. ఈ బాదం సిరప్​ను చల్లటి నీళ్లలో లేదా పాలలో కలిపితే టేస్టీ బాదం షర్బత్ తాగేందుకు సిద్ధం​.

సగ్గుబియ్యం

కావలసినవి :

జెల్లీ - ఒక ప్యాకెట్​

నీళ్లు - ప్యాకెట్​ మీద చెప్పినన్ని

సబ్జా గింజలు - ఒక టేబుల్​ స్పూన్​

నీళ్లు - ఒక కప్పు (సబ్జా గింజలు నానపెట్టడానికి)

సగ్గుబియ్యం - అర కప్పు

నీళ్లు - ఐదు కప్పులు (సగ్గు బియ్యం ఉడికించేందుకు)

పాలు - ఒక లీటర్​

పంచదార - పావు కప్పు

రోజ్ సిరప్​ - అర కప్పు

పిస్తా - రెండు టేబుల్​ స్పూన్స్​

బాదం - రెండు టేబుల్​ స్పూన్స్​

తయారీ : నీళ్లు వేడిచేశాక అందులో జెల్లీ వేసి కలిపి మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించాలి. ఈ  లిక్విడ్​ను ఒక గిన్నెలో పోసి పావు గంట కదలకుండా ఉంచాలి. జెల్లీ ప్యాకెట్​ మీద ఇచ్చిన ఇన్​స్ట్రక్షన్స్​ ఫాలో అయితే సరిపోతుంది. పావుగంట తరువాత చల్లారిన జెల్లీని చిన్న క్యూబ్స్​గా చేసి పక్కన పెట్టాలి.
సబ్జాగింజలను నీళ్లలో వేసి పదినిమిషాలు నానబెట్టాలి. అవి బాగా ఉబ్బితే రెట్టింపు సైజ్​ అవుతాయి. గిన్నెలో నీళ్లు పోసి అవి ఒక ఉడుకు వచ్చాక సగ్గుబియ్యం వేసి పావుగంట ఉడికించాలి. లేదా సగ్గుబియ్యం ట్రాన్స్​పరెంట్​గా అయ్యేవరకు ఉడికించాలి. సగ్గుబియ్యం నీళ్లను వడకట్టాలి.

తరువాత మంచి నీళ్లను ఉడికిన సగ్గుబియ్యం మీద ఒకటికి రెండుసార్లు పోసి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం మీద ఉండే స్టార్చ్​ పోతుంది.
మిల్క్​ బేస్​ తయారు చేసేందుకు పెద్ద గిన్నెలో చల్లటి పాలు పోయాలి. అందులో పంచదార వేసి బాగా కలపాలి. తరువాత రోజ్​ సిరప్​ వేసి మళ్లీ ఒకసారి కలపాలి. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు, ఉడికించిన సగ్గుబియ్యం, జెల్లీ క్యూబ్స్​, పిస్తా, బాదం వేసి కలిపితే రిఫ్రెషింగ్​ సగ్గుబియ్యం షర్బత్​ రెడీ.