సలామ్ వెబ్.. ముస్లింల కోసం ప్రత్యేక బ్రౌజర్

సలామ్ వెబ్.. ముస్లింల కోసం ప్రత్యేక బ్రౌజర్
  • ప్రత్యేక బ్రౌజర్ రూపొందించిన మలేసియన్ స్టార్టప్
  • ఇస్లాం మత సమాచారం అందుబాటులో..
  • ఫిల్టర్ చేసిన కంటెంట్ మాత్రమే కనిపించేలా
  • మొబైల్, డెస్క్ టాప్ లో పని చేసే బ్రౌజర్
  • ఇతరులు కూడా బ్రౌజ్ చేయొచ్చన్న కంపెనీ

Salam web specially for Muslimsగూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఒపేరా, యూసీ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, సఫారీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్.. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న వెబ్ బ్రౌజర్లలో ఇవి కొన్ని. మతం, ప్రాంతం, దేశం.. వంటి పరిమితులేవీ వీటికి ఉండవు. ఎవరైనా బ్రౌజ్ చేయొచ్చు. ఎలాంటి సమాచారమైనా వాటిలో దొరుకుతుంది. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లే.. ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత జరుగుతున్నదో చెడు కూడా అంతే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో మొత్తం ఫిల్టర్ చేసిన కంటెంట్ ను అందించేందుకు మలేసియన్ స్టార్టప్ కంపెనీ ఒకటి ప్రయత్నిస్తోంది. అది కూడా ప్రత్యేకంగా ముస్లింల కోసం బ్రౌజర్ ప్రారంభించింది. ముస్లింలను మాత్రమే టార్గెట్ చేసి బ్రౌజర్ ‘సలాం వెబ్’ను ప్రారంభించామని, అయితే ఎవరైనా బ్రౌజ్ చేయవచ్చని చెబుతోంది.

మెసేజ్ లు, వార్తలు
ఇస్లాం విలువలు, ముస్లిం కార్యక్రమాలు, ప్రార్థనా సమయాలు తదితర అంశాలతోపాటు మొత్తం కమ్యూనిటీకి చెందిన, ఫిల్టర్ చేసిన సమాచారం అందుబాటులో ఉంచేందుకు కొత్త బ్రౌజర్ ప్రారంభమైంది. ముస్లిం ఫ్రెండ్లీ వెబ్ ఎక్స్ పీరియన్స్ ను తమ కమ్యూనిటీలోకి తీసుకెళ్లేందుకు ‘సలామ్ వెబ్’ను ప్రారంభించినట్లు సలామ్ వెబ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ హస్నీ జరీనా మొహమ్మద్ ఖాన్ వెల్లడించారు. మొబైల్ తో పాటు డెస్క్ టాప్ లోనూ పని చేసే ఈ బ్రౌజర్ ద్వారా మెసేజ్ లు చేసుకోవచ్చని, వార్తలు చదవొచ్చని చెప్పారు. ఈ యాప్ కు ప్రధానంగా మలేసియా, ఇండోనేసియాలో ఇప్పటికే యూజర్లు ఉన్నట్లు తెలిపారు.

కనీసం 10 శాతం చాలు
‘‘ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ల (180 కోట్లు) మంది ముస్లింలు ఉన్నారు. వారిలో 10 శాతం
మందికి మా బ్రౌజర్ ను చేరువ చేయాలన్నదే ప్రస్తుతం మా లక్ష్యం” అని జరీనా చెప్పారు. అయితే
ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు గూగుల్, ఫేస్ బుక్ వంటి వాటితో గట్టి పోటీ ఉంటుందని చెప్పారు.
ఇటీవల హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తే విమర్శలు
ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని, ఈ పరిస్థితి మహిళల
విషయంలో ఇంకా ఎక్కువ ఉందని అన్నారు. ‘మహిళలకు చాలా ప్రమాదకరమైన ప్రదేశం’ అని ట్విట్టర్ ను ఉద్దేశిస్తూ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.