జీతాల కోసం 13 జిల్లాల ఉద్యోగుల ఎదురు చూపులు

జీతాల కోసం 13 జిల్లాల ఉద్యోగుల ఎదురు చూపులు
  • అప్పు పుడితే తప్ప వచ్చే మూడు నెలలు కష్టమే
  • రూ. 13,562 కోట్ల కొత్త అప్పు కోసం ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇండెంట్
  • ఆదాయం పెరిగినా.. మిత్తీల భారంతో గడ్డు పరిస్థితి
  • అత్యవసర బిల్లులు తప్ప స్కీములన్నీ పెండింగ్​
  • 4 లక్షల కోట్లకు చేరిన అప్పు

హైదరాబాద్, వెలుగు: తొమ్మిదో  తారీఖు వచ్చినా.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉద్యోగులకు, టీచర్లకు ఇప్పటికీ జీతాలు అందలేదు. కొన్నిచోట్ల పెన్షనర్లకూ పైసలు ఆగిపోయాయి. ప్రతి నెల ఒకటో తారీఖునే చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం విడతల వారీగా ఇస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఖజానాలో సరిపడెటన్ని నిధుల్లేకనే  ఫైనాన్స్ డిపార్టుమెంట్  కొన్ని జిల్లాలకు జీతాలు చెల్లించి, కొన్ని జిల్లాలకు  ఆపుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన అప్పుల భారంతో రాష్ట్ర ఖజానా కొట్టుమిట్టాడుతున్నది. మార్చి నెలతో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అప్పటి వరకు కొత్త అప్పులు తెస్తే తప్ప ఉద్యోగులకు జీతాలివ్వలేని గడ్డు పరిస్థితి కనిపిస్తున్నది. జనవరి ఫస్ట్‌‌ తారీఖున అందాల్సిన జీతాలు శనివారం సాయంత్రం వరకు కూడా తమకు అందలేవని నిజామాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నాగర్​కర్నూల్, నల్గొండ, మెదక్, మహబూబ్​నగర్, యాదాద్రి, వనపర్తి, సూర్యాపేట, నారాయణపేట, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల ఉద్యోగులు, టీచర్లు అంటున్నారు. 

భారీ అప్పుకు ఇండెంట్ 

వడ్డీల భారంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి నిధుల కటకట  వెంటాడుతున్నది. ఇప్పుడున్న కష్టకాలంలో ఉద్యోగులకు నెలనెలా  జీతాలివ్వాలంటే ఆర్ బీఐ నుంచి భారీగా అప్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడయింది. అందుకే రూ. 13,562 కోట్ల అప్పు కావాలని ఆర్​బీఐకి ఇండెంట్ ఇచ్చింది. వచ్చే మూడు నెలలు బాండ్ల వేలం ద్వారా ఈ అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఎఫ్ఆర్​బీఎం పరిధిలో ఈ అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. జనవరిలో రూ. 5,187 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 3,500 కోట్లు, మార్చిలో రూ. 4,875 కోట్లు అప్పు కావాలని ఆర్బీఐకి ఇండెంట్లు ఇచ్చింది. ఈ నెల మొదటి వారంలోనే రూ. 1,187 కోట్లు అప్పు తీసుకుంది. తాజాగా రూ. 3,000 కోట్ల అప్పు కావాలని కోరుతూ శుక్రవారం ఆర్బీఐ దగ్గర బాండ్లను వేలానికి పెట్టింది. ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు దాదాపు రూ. 4 వేల కోట్లు అవసరం. ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటే నెలనెలా జీతాలకు సర్దుబాటు చేయొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కొత్త బడ్జెట్  వచ్చే వరకు ఇతర స్కీమ్​ల అమలును పెండింగ్​లో పెట్టినట్లు తెలుస్తున్నది. అత్యవసర బిల్లులు, బకాయిలు తప్ప మిగతావన్నీ ఆపేయాలని ట్రెజరీలకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

ఆదాయం పెరిగినా.. అప్పే దిక్కు

ఈ ఏడాది ఆశించిన మేరకు రాబడి పెరిగినప్పటికీ జీతాలకైనా, ఇతర ఏ అవసరాలకైనా అప్పులే దిక్కవుతున్నాయి. లిక్కర్​తో పాటు రిజిస్ట్రేషన్లు, భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం ముందే డిసైడయింది. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపుల సంఖ్యను పెంచింది. రిజిస్ట్రేషన్లపై పన్నులు, భూముల వాల్యూను డబుల్ చేసింది. హైదరాబాద్​లో భారీ ఎత్తున భూములను వేలం వేసింది. ప్రభుత్వంపై అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. విద్యుత్ చార్జీల వడ్డనకు రెడీ అయింది. పెట్రోల్​పై ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా.. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించేదే లేదని భారీగానే సంపాదించుకుంది. ఇంత ఆదాయం వచ్చినా గతంలో తెచ్చిన అప్పుల చెల్లింపులు, వడ్డీలే రాష్ట్ర ఖజానాకు మోయలేనంత భారంగా మారాయి.

కొత్త బడ్జెట్ దాకా స్కీములకు బ్రేక్​

ఇప్పుడు కొనసాగుతున్న రైతు బంధు,  ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు ఇంకా పూర్తి కాలేదు. ఆరోగ్య శ్రీ, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి స్కీమ్​లకు ఇచ్చే నిధులు కూడా బకాయిల జాబితాలో పడ్డాయి.  డబుల్ బెడ్రూం ఇండ్లు,  గొర్రెల పంపిణీ, ఫీజు రీయింబర్స్​మెంట్​, కొత్తగా ప్రకటించిన దళిత బంధు స్కీమ్ లకు చెల్లింపులు దాదాపుగా నిలిచిపోయాయి. కొత్తగా 57 ఏండ్లలోపు వాళ్లకు ఇస్తామన్న ఆసరా పెన్షన్లను ఇవ్వకుండా సర్కారు దాటవేసింది. రుణమాఫీకి బడ్జెట్​లో ఈసారి రూ. 6 వేల కోట్లు ప్రతిపాదిస్తే.. కేవలం రూ. 400 కోట్లు ఖర్చు చేసింది. ఎంబీసీ, బీసీలకు ఇస్తామన్న సబ్సిడీ లోన్లు ఆగిపోయాయి. ఇప్పుడు తెచ్చే కొత్త అప్పులు జీతాలకే సరిపోతాయని, అందుకే వచ్చే బడ్జెట్ వరకు కొన్ని స్కీమ్​లను  పక్కనపెట్టేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.

తొమ్మిది నెలల్లోనే మిత్తీలకు రూ.14 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ఏడేండ్లలో చేసిన అప్పు దాదాపు రూ. 4 లక్షల కోట్లకు చేరువైంది. తీసుకున్న అప్పులకు తిరిగి చెల్లింపులు, వాటి మిత్తీలు నెలనెలా భారంగా మారాయి. యావరేజ్​గా రూ. 1,400 కోట్ల చొప్పున మిత్తీలను ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి.. అంటే తొమ్మిది నెలల్లో మిత్తీలకు రూ. 14 వేల కోట్లు చెల్లించింది. అక్టోబర్ నాటికి రూ. 10 వేల కోట్ల మిత్తీలు కట్టినట్లు అకౌంటెంట్ జనరల్​కు ఫైనాన్స్ డిపార్టుమెంట్​ మంత్లీ రిపోర్టును అందజేసింది.

ప్రతినెలా లేట్​ అయితున్నది

‘ప్రభుత్వ ఉద్యోగులకేంది.. ఒకటో తారీఖు జీతాలు’ అనేమాట రాష్ట్రంలో పోయింది. నెల మొదలైన తర్వాత వారం, పది రోజులకు గానీ జీతాలు వస్తలేవు. కొన్ని జిల్లాల్లోనైతే ఇంకా లేటవుతున్నది. జిల్లాల వారీగా ఒక్కో తేదీలో ఒక్కోరకంగా జీతాలు వేస్తున్నరు. ఎందుకు లేట్​ అయితున్నయ్​ అని తెలుసుకుంటే ఖజానాలో పైసలు లేక అడ్జస్ట్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెలలో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోని ఉద్యోగులకు శాలరీలు పడలేదు.

‑ ఓ ఉద్యోగ సంఘం నేత