- ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం తక్కువే
- సత్తా చాటిన మారుతీ, హ్యుందాయ్, టాటా
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి, హ్యుందాయ్ టాటా మోటార్స్.. శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా హోల్‌సేల్స్ సాధించాయి. 2022 మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే ఈసారి మార్చినెల అమ్మకాలను ఇదే ఏడాది ఫిబ్రవరి నెల అమ్మకాలతో పోల్చి చూస్తే మాత్రం గ్రోత్ తక్కువగా ఉంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా అమ్మకాలు 2021–-22లో 16,52,653 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్లకు పెరిగాయి.
ఇదే కాలంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్‌సేల్స్ 6,10,760 యూనిట్ల నుండి 18 శాతం పెరిగి 7,20,565 యూనిట్లకు చేరాయి. ఒక ఏడాదిలో ఇంత భారీగా అమ్మకాలు సాధించడం ఇదే తొలిసారని హ్యుందాయ్ ప్రకటించింది. టాటా మోటార్స్ అమ్మకాలు 3,70,372 యూనిట్ల నుంచి 5,38,640 యూనిట్లకు పెరిగాయి. అంటే ఈ కంపెనీ ఏకంగా 45 శాతం వృద్ధి సాధించింది. చిప్ కొరత ప్రొడక్షన్‌పై ప్రభావం చూపుతున్నప్పటికీ, కిందటి ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ రికార్డులెవెల్ అమ్మకాలను సాధించిందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
మొత్తం ఇండస్ట్రీ అమ్మకాలు 30.69 లక్షల యూనిట్ల నుంచి 27 శాతం పెరిగి 38.89 లక్షల యూనిట్లకు ఎగిశాయని ప్రకటించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో హోల్‌సేల్‌తో పాటు రిటైల్ అమ్మకాలూ బాగున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 40.5-4 లక్షలుగా రికార్డయ్యే అవకాశం ఉందని వివరించారు. జిమ్నీ, ఫ్రాంక్స్ వంటి కొత్త మోడల్స్ ద్వారా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎస్‌యూవీ మార్కెట్‌లో 25 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు.
ఆల్టో 800 కు గుడ్‌బై
ఎంతో మంది ఫేవరెట్ కారు ఆల్టో 800 కనుమరుగవ్వనుంది. ఈ ఎంట్రీ- లెవల్ మోడల్ తయారీని నిలిపివేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. బీఎస్6 ఫేజ్– 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడానికి భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది తమకు ఆర్థికంగా లాభదాయకం కాదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఎంట్రీ -లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు గిరాకీ తగ్గుతోందని శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.
కొనుగోలు ఖర్చు విపరీతంగా పెరిగినందున అమ్మకాలూ తగ్గాయని వివరించారు. రోడ్డు పన్ను పెరుగుదల, మెటీరియల్ ధరలు, ఇతర రకాల పన్నులు ఆల్టో 800 ధర భారీగా పెరగడానికి కారణాలని వివరించారు. కస్టమర్ల ఆదాయం మాత్రం ఈస్థాయిలో పెరగడం లేదని ఆయన తెలిపారు. ఆల్టో కే10కు డిమాండ్ బాగుండటం కూడా ఆల్టో 800 మోడల్ తయారీని నిలిపివేయడానికి కారణమని పేర్కొన్నారు. ఎంట్రీ- లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఆల్టో కె10 తమ ప్రధాన మోడల్‌గా ఉంటుందని శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.94 లక్షల వరకు ఉంది. ఆల్టో 800 ధరలు రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల మధ్య ఉన్నాయి. ఆల్టో 800లో 796 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఆల్టో 800 కారును 2000లో తీసుకొచ్చారు 2010 వరకు 1,800,000 యూనిట్లను అమ్మారు. కే10 కార్లు ఇప్పటి వరకు 950,000 యూనిట్లు
అమ్ముడయ్యాయి.
