పాకిస్తాన్‌లో అంతే : స్పాట్ ఫిక్సింగ్ క్రికెట్ ఆటగాడికి సెలక్షన్ కమిటీలో చోటు

పాకిస్తాన్‌లో అంతే : స్పాట్ ఫిక్సింగ్ క్రికెట్ ఆటగాడికి సెలక్షన్ కమిటీలో చోటు

భారత్ వేదికగా ఇటీవలే జరిగిన జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. నెంబర్ వన్ ర్యాంక్ తో వరల్డ్ కప్ కు ముందు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన పాక్ ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. దీంతో పాక్ క్రికెట్ బోర్డు జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా  కెప్టెన్ నుంచి కోచ్ వరకు అందరిని తొలగింది వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేసింది. ఈ  క్రమంలో పాక్ చీఫ్ సెలక్టర్ గా వహాబ్ రియాజ్ ను నియమించగా.. టీం డైరెక్టర్ గా మహమ్మద్ హఫీజ్ ను ఎంపిక చేశారు.

తాజాగా పాక్ మాజీ బ్యాటర్ సల్మాన్ బట్ ను సెలక్షన్ ప్యానల్ లోకి చేర్చి పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. సల్మాన్ బట్ గతంలో స్పాట్ ఫిక్సింగ్ చేసి శిక్ష అనుభవించాడు. 2010 లో ఇంగ్లాండ్ పై జరిగిన టెస్టులో ఈ మాజీ ఓపెనర్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా తేలాడు. ఇందుకుగాను సల్మాన్ బట్ 5 ఏళ్ళ శిక్షను అనుభవించి క్రికెట్ కు దూరమయ్యాడు. శిక్ష పూర్తి చేసుకున్న తర్వాత 2016 లో క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సల్మాన్ నిన్న(డిసెంబర్ 1) సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది.

సల్మాన్ తో పాటు కమ్రాన్ అక్మల్,ఇఫ్తికార్ ఈ సెలక్షన్ ప్యానల్ లో మరో ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. పాక్ క్రికెట్ లో ఇంతమంది ఉండగా  బట్ ను ఎందుకు నియమించారో వారికే తెలియాలి. ఎప్పుడు ఎవరి ఊహకు అందని నిర్ణయాలు తీసుకునే  పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయంపై  నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా పాకిస్థాన్  మూడు టెస్టుల సిరీస్ డిసెంబర్ 14 నుంచి మొదలుకానుంది.  షాన్ మసూద్ పాక్ టెస్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.