శమంతక..మణోపాఖ్యానము

శమంతక..మణోపాఖ్యానము

ద్వాపర యుగమున ద్వారకా వాసియగు శ్రీ కృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుచు, “స్వామీ! సాయం సమయంబయ్యె. ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతి శాపంబుచే చంద్రుని జూడరాదు. కనుక నిజగృహంబున కేగెద సెలవిండు” అని పూర్వ వృత్తాంతం అంతయు శ్రీ కృష్ణునకు తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగె. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణంబున చాటించెను. శ్రీ కృష్ణుడు క్షీరప్రియుడగుటచే నాటి రాత్రి మింటివంక చూడకయే గోశాలకు బోయి పాలుపిదుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ‘‘ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో’’ అని సంశయమున ఉండెను.

కొన్నాళ్ళకు యదువంశరాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమనే పేరుగల మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ, శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజున కిమ్మని అడిగెను. కానీ, “ఎనిమిది బారువుల బంగారమును దినంబున కొసంగు ఈ మణిని ఏ ఆప్తునికైనను ఏ మందమతి సైతం ఇవ్వండ”ని పొమ్మని యూరకుండెను. అంత నొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా శమంతకమును కంఠమున ధరించి వేటాడ అడవికి బోవ ఒక సింహమా శమంతకమణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపి ఆ మణింగొని పోవుచుండ ఒక భల్లూకం ఆ సింహమును దునిమి యా మణింగొని తన కొండ బిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తువుగా ఒసంగెను.

మరునాడు సత్రాజిత్తు, తమ్ముని మృతి సంగతి విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదన్న కారణమ్ముగా నా సోదరుని జంపి రత్న మపహరించెనని పట్టణమున జాటె. అది కృష్ణుడు విని ‘‘నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబ’’ని యెంచి దానిని బాపుకొన బంధుసమేతుడై అరణ్యమునకు బోయి వెదకగా ఒక్కచోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణవిన్యాసంబు కాన్పించెను. ఆ దారిని బట్టి పోవచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారమును అచట విడిచి కృష్ణుడు గుహలోపలికేగి, అచట బాలిక ఊయలపై కట్టబడియున్న మణినిజూసి, దానియొద్దకు పోయి ఆ మణిని చేత బుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడ్వ దొడంగెను.

అంతట అదియును వింతమానిసి వచ్చెననుచు - కేకలు వేసెను. అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబులతో గ్రుచ్చుచు, కోరలతో కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుండును వానిని బడద్రోసి వృక్షముల చేతను రాళ్ళ చేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యిరువది ఎనిమిది దినంబులు యుద్దమొనర్ప జాంబవంతుడు క్షీణబలుడై, దేహంబెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింప జేసిన పురుషుడు రావణసంహారి యగు శ్రీరామచంద్రునిగా దలచి అంజలి ఘటించి, “దేవా! భక్తజన రక్షకా! త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నిన్ను నేను  నెఱంగితి.

ఆ కాలంబున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞ యొసంగ, నా బుద్దిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధము జేయవలెనని కోరుకొంటిని. కాలాంతరమున అది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణచేయుచు అనేక సంవత్సరములు గడుపుచు ఉండ ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నాశరీర మంతయు శిధిలమయ్యె. ప్రాణములు కడబట్టె, జీవితేచ్చ నశించె. నన్ను క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేరు’’ అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప  శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి “భల్లూకేశ్వరా! శమంతకమణి నొసంగుము నేనేగెద”

అని తెలుప అతడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగె. మణితో శ్రీకృష్ణుడు పురంబు జేరి సత్రాజిత్తును రావించి, యా వృత్తాంతమును జెప్పి శమంతకమణి యొసంగ ఆ సత్రాజిత్తు “అయ్యో లేనిపోని నింద మోపి దోషంబునకు బాల్పడితిని” అని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను గైకొమ్మనిన, మణి వలదని మరల నొసంగెను. అంత కృష్ణుడు దయాళుడై, “భాద్రపద శుద్ధ చతుర్ది దినమున గణపతిని యధావిధి పూజించి, ఈ శమంతకమణి కథను విని, అక్షింతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనమగుటచే వచ్చు నీలాపనిందలు పొందకుండుగాక!

యని ఆనతీయ దేవతలు సంతసించి తమ నివాసంబుల కేగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్ధియందు గణపతిని పూజించి అభీష్టసిద్దిగాంచుచు సుఖంబుగా నుండిరని శౌనకాది మునులకు, ధర్మరాజునకు సూతుడు వినిపించి, “ఓ ధర్మరాజా! కాబట్టి నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసి, దమయంతి నలుని, శ్రీ కృష్ణుడు జాంబవతిని, శమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగకోసం, దేవాసురులు అమృతాన్ని పుట్టించడానికి వ్రతాన్ని ఆచరించారు.

గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్థి, గణాధిపతి అయినది కూడా అదేరోజు, అందుకే భాద్రపద శుద్ధ చతుర్థినాడు నాలుగు వర్ణాలవారు, స్త్రీలు పిల్లలూ అందరూ ఈ వ్రతాన్ని యధావిధిగా చేసుకొని తమ తమ కోరికలను నెరవేర్చుకొనగలరు” అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు విధిప్రకారంగా గణపతిని పూజించి సకలైశ్వర్యాలనూ, రాజ్యాన్నీ పొంది చాలాకాలం సుఖంగా జీవించాడు.

సర్వేజనా స్సుఖినోభవంతు! 
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః