Samantha: ప్రతి దానికి సారీ చెప్పడం మానుకోండి.. సినీ ఇండస్ట్రీలో మహిళల కష్టాలపై సమంత ఆవేదన!

Samantha: ప్రతి దానికి సారీ చెప్పడం మానుకోండి.. సినీ ఇండస్ట్రీలో మహిళల కష్టాలపై సమంత ఆవేదన!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.  అయితే లేటెస్ట్ గా ఓ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఒక నటిగానే కాకుండా, తన గంభీరమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సినీ రంగంలో మహిళా సాధికారతకు ప్రతినిధిగా నిలిచారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి త్యాగాలు, ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆమె తన గళాన్ని విప్పారు.  

మౌనంగా త్యాగం..

సినిమా రంగంలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడానికి పురుషుల కంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని సమంత పేర్కొన్నారు. మహిళలు తమ చుట్టూ ఉన్నవారు సౌకర్యంగా ఉండటం కోసం తమ షెడ్యూళ్లను, అభిప్రాయాలను, చివరికి తమ ఆశయాలను కూడా మార్చుకుంటారు. ఇది ఎంత అలవాటైపోయిందంటే, తాము త్యాగం చేస్తున్నామనే విషయాన్ని కూడా మహిళలు గుర్తించలేకపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ అలవాటు మానుకోండి..

ముఖ్యంగా మహిళలు ప్రతి చిన్న విషయానికి క్షమాపణలుచెప్పే ధోరణిని ఆమె తప్పుబట్టారు. పురుషుల కంటే మహిళలు పది రెట్లు ఎక్కువగా 'సారీ' చెబుతుంటారని, ఆ అలవాటును ఇకనైనా మానుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మీరు కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును గర్వంగా స్వీకరించండి. ఎవరో పొగిడినప్పుడు వినమ్రతతో థాంక్స్ చెప్పడం అహంకారం అనిపించుకోదు  అని ఆమె స్పష్టం చేశారు.

ఆ రోజే అసలైన విజయం

ఏదైనా సినిమాను 'ఫీమేల్ సెంట్రిక్' , 'మహిళా ప్రధాన చిత్రం' అని పిలవాల్సిన అవసరం లేని రోజు రావాలని సమంత ఆకాంక్షించారు. సినిమాలను కేవలం 'కథలు'గానే చూడాలి తప్ప, అందులో మహిళ ముఖ్య పాత్ర పోషిస్తే దాన్ని ఒక ప్రత్యేక కేటగిరీగా చూడకూడదు. వెండితెరపై మహిళలు కేవలం హీరోకు స్ఫూర్తినిచ్చే వారిగానో, భార్యలుగానో కాకుండా.. నిజ జీవితంలో ఉండే సంక్లిష్టమైన మనస్తత్వంతో కనిపించాలి అని అన్నారు. షూటింగ్ సెట్స్‌లో మహిళల భద్రత అనేది కేవలం చర్చాంశంగా మిగిలిపోకూడదని, అది ప్రతి నిర్మాణ సంస్థ పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత కావాలని సమంత కోరారు.

'మా ఇంటి బంగారం'తో సరికొత్త ప్రయాణం

సమంత తన తదుపరి చిత్రం 'మా ఇంటి బంగారం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా నందినీ రెడ్డి, సుమ కనకాలతో కలిసి సమంత ఉగాది పచ్చడి తయారు చేస్తూ సందడి చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో సమంత గృహిణిగా కనిపిస్తూనే, అన్యాయంపై పోరాడే పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో అలరించనున్నారు. మే 15, 2026న ఈ చిత్రం విడుదల కానుంది.