
స్టార్ హీరోయిన్‌గా సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న సమంత, మరోవైపు ఓటీటీలోనూ అంతే క్రేజ్‌ని అందుకుంటోంది. ‘సామ్ జామ్’ టాక్ షోతో తెలుగు ఆడియెన్స్‌ను, ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులనూ ఆకట్టుకున్న సమంత, మరో వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆమెతో ‘సామ్ జామ్’ టాక్ షో చేసిన ‘ఆహా’ సంస్థ, ఈసారి వెబ్ సిరీస్ తీసేందుకు ప్లాన్ చేస్తోందట. మునుపెన్నడూ కనిపించనంత కొత్త క్యారెక్టర్‌లో ఇందులో కనిపించబోతుందని టాక్. దీనికి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు, ఎలాంటి కథతో రాబోతోంది లాంటి ఇతర వివరాలు త్వరలో రివీల్ చేయనున్నారు. మరోవైపు ‘ద ఫ్యామిలీ మ్యాన్’ తర్వాత ఇతర ఓటీటీ సంస్థల నుంచి కూడా ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయి. కానీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్‌తో పాటు సరైన కంటెంట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత, మరోవైపు తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైన్ చేసింది. ఇవి రెండూ తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోతున్నాయి. హిందీలోనూ ఓ కొత్త సినిమా కమిటైనట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇటు సినిమాలు, అటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో కెరీర్లో సూపర్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది సమంత.