
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజలను నిలువున మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. సమత మూర్తి చిట్ ఫండ్ సంస్థ చిట్టీల పేరుతో మధ్యతరగతి ప్రజల వద్ద భారీగా నగదును జమ చేసుకుని వారికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఎల్.బీ నగర్, మాదాపూర్, కూకట్ పల్లిలో సమతా మూర్తి పేరుతో బ్రాంచీలు తెరిచి వందల సంఖ్యలో కస్టమర్లను తెచ్చుకుని మోసం చేశారు.
సమత మూర్తి చిట్ ఫండ్ పేరుతో నిర్వాహకులు తమ వద్ద చిట్టీ పేరుతో డబ్బులు వసూలు చేసి ఇవ్వాల్సింది ఇవ్వలేదని బాధితులు వాపోయారు. గత నెల 13వ తేదీన మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని కానీ పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో సైబరాబాద్ సీపీని కలిశామని చెప్పారు. సీపీ ఆదేశాలతో సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్,రాకేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంస్థ డైరెక్టర్ గణేష్, అకౌంటెంట్ జ్యోతి పరారీలో ఉన్నారు.
ALSO READ :- హైదరాబాద్ ను కోల్పోయాం... అందుకే విశాఖ అంటున్నా: సీఎం జగన్
సంస్థ నిర్వాహకులు చిన్న జీయర్ స్వామి పేరు, ఫోటోలు వాడి తమను మోసం చేశారని బాధితులు చెప్పారు. తాము నమ్మి రూ.1లక్ష రూపాయలు మొదలు రూ. 1 కోటి రూపాయల వరకు చిట్టి వేసామని చెప్పారు. కమిట్ మెంట్ ప్రకారం తమకు రావాల్సిన డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమతా మూర్తి చిట్ ఫండ్ వారు తమకు చెక్స్ కూడా ఇచ్చారని కానీ అవి డబ్బులు లేక బౌన్స్ అయ్యాయని చెప్పారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.