
ప్రేమ నిర్వచనాన్ని డిక్షనరీలో వెతికితే.. ‘ఇదొక లోతైన భావన. ఒకరిపట్ల ఒకరు కేరింగ్‌గా ఉండటం. అదొక నామవాచకం’ అని ఉంది. మరో నిర్వచనం..‘ ప్రేమ అంటే ఒక వ్యక్తిపై ఉండే గాఢమైన శృంగార భావన. ఇది క్రియ’ అని ఉంది. డిక్షనరీ ప్రకారం ఇవే ప్రేమకు ప్రామాణిక నిర్వచనాలు. డిక్షనరీని పక్కన పెడితే ప్రేమకు ఎన్నో నిర్వచనాలు ఉంటయ్. అది మనుషుల మధ్య తిరాగాడుతది. కవితల్లో, కథల్లో వింత వింతగా కనిపిస్తది. ఒక్కోచోట ఒక్కోవిధంగా తన నిర్వచనాన్ని మార్చుకుంటది. ఒక్కో అనుభవం.. ఒక్కో విధంగా నిర్వచిస్తుంది ప్రేమని. వైభవ్, పరాగ్‌ల మధ్య పుట్టిన ప్రేమ కూడా ప్రేమకు కొత్త నిర్వచనం రాసింది.
రెండు నెలల కింద టెక్సాస్‌లో ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు పెండ్లి చేసుకున్నరు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా.. పెండ్లికి ముందురోజు సంగీత్.. పెండ్లి తర్వాత రెండు బరాత్‌లు. మూడు రోజుల పాటు రుచికరమైన దేశీయ వంటలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెండ్లికి మన దేశంతో పాటు, అమెరికా నుంచి మస్తు మంది అతిథులు పోయినరు. ఫేస్‌బుక్‌లో లైవ్ కూడా ఇచ్చిన్రు. ఇప్పుడు అన్ని పెండ్లిలు ఇట్లనే కదా జరిగేది! ఏంది స్పెషల్ అనుకుంటున్నరా? ఇక్కడ లగ్గం చేసుకున్నది ఇద్దరు పెండ్లి కొడుకులే! ఆ భార్యాభర్తలను చూసి పెండ్లికెళ్లినోళ్లు హ్యాపీ అయితే.. ఫేస్‌బుక్‌లో చూసిన కొంతమంది గుస్స చేసిన్రు!
వైభవ పరాగం…
ప్రేమకు ఆహ్వానం అక్కర్లేదు. అది ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో తెల్వదు. ఏదో ఒక దశలో మనిషిని ప్రేమ పలకరిస్తది. మొదటిసారి ఒకరి నవ్వు, మరొకరి గుండె వేగాన్ని పెంచొచ్చు. మొదటిసారి ఒకరి కళ్లలోకి చూస్తూ కాలాన్ని మర్చిపోవచ్చు. అదీ ప్రేమ భావన! ‘‘2012.. టెక్సాస్‌లో జరిగిన ‘గై ప్రైడ్ పరేడ్’లో నేను నా భర్త పరాగ్‌ను చూసిన. అప్పుడు పరాగ్ నన్ను చూస్తే బాగుండనే ఫీలింగ్ కలిగింది. అతనేమో చూడలె. కానీ, తర్వాత అతని గురించి తెలుసుకుని.. ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ మెసేజ్ పెట్టిన. అట్ల మొదలైంది మా ప్రేమ’ అని చెప్పిండు వైభవ్ జైన్. ‘నాకు మేసేజ్ పెట్టిండు ఎవరబ్బా? నా గురించి ఇతనికెందుకు? నన్నెందుకు పోక్ చేసిండు అనుకున్న. కానీ, తర్వాత అతనే నా సోల్‌మేట్ అని తెలిసింది’ అని చెప్పిండు పరాగ్ మెహతా జైన్. ఇద్దరూ యూఎస్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నరు.
మన దేశంలో వివక్ష..
ముప్పై రెండేళ్ల వైభవ్ ఢిల్లీలో పుట్టి పెరిగిండు. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిండు. అక్కడ బీడీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసిండు. భారతీయ సమాజం ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ పట్ల అసహనంతో ఉండేది. హీనంగా చూసేది. ఏడాది క్రితం సెక్షన్ 377 పై‘స్వలింగ సంపర్కం నేరం కాదు’ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా, పరిస్థితులు ఇంకా మారాల్సి ఉంది. ‘ ఇండియాలో ఉన్నప్పుడు నేనెప్పుడు నా రియల్ ఐడెంటిటీని మా ఫ్యామిలీకి చెప్పలేదు. అన్నీ దాచిపెట్టిన. పరాగ్ చిన్నప్పటి నుంచి టెక్సాస్‌లోనే పెరగడం వల్ల.. వివక్ష ఎదుర్కోలేదు. అతను నాకు చాలా సపోర్ట్‌గా నిలిచిండు’ అని వైభవ్ చెప్పుకొచ్చిండు.
పరిచయం.. ప్రేమ..
కొన్ని రోజులు ఫేస్‌బుక్‌లో చాట్ చేసుకున్నరు. అట్ల ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం స్టార్ట్ చేసినరు. ‘ ఈ రోజు డిన్నర్‌కి థాయ్ రెస్టారెంట్‌కు పోదాం’ అన్నడు వైభవ్ పరాగ్‌తో. అతను ‘సరే’ అన్నడు. ‘ మేం మొదటిసారి కలుసుకున్నరోజు ఎప్పటికీ మర్చిపోలేం’ అంటరు వాళ్లిద్దరు. ‘ఇద్దరం కొన్ని గంటలపాటు మాట్లాడుకున్నం. లాస్ట్‌కి ఇంటికి పోదం అని రెడీ అయ్యే సరికి… వర్షం మొదలైంది. ఆ వర్షంలో నా ఫేవరేట్ సింగర్ మహమ్మద్ రఫీ పాడిన ‘తేరే మేరే సప్నా’ గుర్తొచ్చింది నాకు. అలా ఆ రోజు ఆరు గంటలు కలిసి గడిపినం’ అని గుర్తు చేసుకున్నడు వైభవ్. అప్పటికే చిగురులు వేసిన వాళ్ల ప్రేమ ఆ చినుకుల్లో మొగ్గలేసింది. తర్వాత కొంచెం దూరంగా ఉన్నా మస్తు బాధపడేటోళ్లు. వీలున్నప్పుడల్లా.. కలిసేటోళ్లు. అట్ల ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన్రు.
పరాగే ప్రపోజ్ చేసిండు
కొన్ని రోజులు గడిచిపోయినయ్. వాళ్లు గాఢమైన ప్రేమలో పడ్డారు. ఒకరి హృదయంలో మరొకరు నిండిపోయినరు. ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అని పరాగ్ ఒక రోజు వైభవ్‌కు ప్రపోజ్ చేసిండు. తన ఫీలింగ్స్ చెప్పిండు. ‘ఆ మూమెంట్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే సిగ్గేస్తుంది’ అన్నడు వైభవ్. అయితే, పరాగ్ ప్రపోజల్‌ని వైభవ్ వెంటనే ఒప్పుకోలేదు. ఎంత గుట్టుగా ఉన్నప్పటికీ వైభవ్ భారత్‌లో వివక్షను ఎదుర్కొన్నాడు. అది మానసికంగా అతనిపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే పరాగ్ చెప్పినంత ఓపెన్‌గా తన ఫీలింగ్స్‌ని చెప్పలేకపోయిండు. అమెరికాలో పెరగడం వల్ల పరాగ్ ఆలోచన ఫార్వర్డ్ గా ఉండేది. అతను వాళ్ల తల్లిదండ్రులకు దూరంగా ఉండబట్టి అప్పటికే పదిహేనేళ్లు. అందుకే ఆ విషయంలో వైభవ్‌కి అండగా నిలబడిండు. అన్నీ షేర్ చేసుకుండు. తమ బంధంపై నమ్మకం కలిగించిండు. ‘కలిసి ఉందాం’ అన్నడు. అది పెండ్లి వరకూ తీస్కపోయింది.
గ్రాండ్‌గా పెండ్లి..
కట్ చేస్తే.. మొన్న మార్చి 29న వాళ్ల ఏడేండ్ల బంధం పెండ్లితో మరింత బలపడింది. రెండు వైపుల ఫ్యామిలీలు, చుట్టాలు వచ్చి టెక్సాస్‌లో గ్రాండ్‌గా పెండ్లి జరిపించిన్రు.
“ మా ఇద్దరికీ మన సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకోవడం ఇష్టం. అందుకు తగ్గట్టే ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకున్నం’ అని చెప్పిండు వైభవ్. వైభవ్, పరాగ్ పెండ్లి వీడియోలు నెట్‌లో వైరల్ అయినయ్. ‘‘ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మీరు ‘గే కపుల్స్’ కదా.. పిల్లల్ని దత్తత తీసుకుంటే మంచిదని చాలా మంది చెప్తున్నరు. కానీ, మేం సరోగసీని ఎంచుకున్నం. అంటే మేం దత్తతను వ్యతిరేకిస్తున్నట్టు కాదు. మాకున్న అవకాశాల్లో దాన్ని ఎంచుకున్నం. మేం తల్లిదండ్రులం కావాలని నిర్ణయించుకున్నం’ అని చెప్పిండు వైభవ్.
ప్రతి మనిషి విలువైనవాడే
‘భూమి మీద పుట్టిన ప్రతి మనిషి విలువైనవాడే. ఎవ్వరైన సరే వివక్ష చూపొద్దు. ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే అర్హత ఉంది. హోమోసెక్సువల్స్ కూడా మనుషులే. దీన్ని సమాజం అర్థం చేసుకోవాలి. 85 ఏళ్ల మా నాన్నమ్మ మా ప్రేమను అర్థం చేసుకుని…ఆశీర్వదించినప్పుడు వేరేవాళ్లు ఎందుకు ఇట్లా చేయలేకపోతున్నరు? సమాజం మమ్మల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయినా సరే.. మా లాంటి వాళ్లు బయటికి రావాలి. తమ గుర్తింపుని కోల్పోకుండా.. స్వతంత్రంగా బతకాలి. అలా నేను చేయగలిగినప్పుడు మీరెందుకు చెయ్యలేరు?’ అని ప్రశ్నిస్తుండు వైభవ్.
అర్థం చేసుకున్నరు..
వైభవ్ కూడా పరాగ్ పెండ్లి నిర్ణయాన్ని ఒప్పుకున్నడు. ఈ విషయం తన పేరెంట్స్‌కి చెప్పాలని వాళ్లను ఇండియా నుంచి అమెరికాకు రప్పించిండు. “ నాకు అమ్మాయిలంటే ఇష్టముండదు. నేను పెళ్లి కూడా చేసుకోను. నేను ‘గే’ని. నాకు 14, 15 ఏళ్లు ఉన్నప్పుడే నాకు ఈ విషయం తెలుసు’ అని వైభవ్ తల్లిదండ్రులకు చెప్పిండు.
ఆ మాటలు విని ముందు వాళ్లు షాక్ అయిన్రు. కానీ, వాళ్లది షరతులు లేని ప్రేమ! అందుకే అతన్ని సపోర్ట్ చేసిన్రు. ‘‘నిన్ను పెంచడంలో మేం ఫెయిల్ అయినం. నువ్వు ‘ గే’ అయినందుకు కాదు ఫెయిల్ అయింది. మాతో నిజం చెప్పడానికి ఇన్నేళ్లు పట్టినందుకు..’’ అని వాళ్లమ్మ వైభవ్‌ని పట్టుకుని ఏడ్చింది. ‘ఆ రోజు రాత్రి మా పేరెంట్స్ నిద్రపోలేకపోయిన్రు. కానీ, ఆ రోజు నుంచి నేను ప్రశాంతంగా నిద్ర పోతున్న’ అని చెప్పిండు వైభవ్.