రాజాపేట మండలంలోని చల్లూరు, చిన్న మేడారం గ్రామాల్లో..గద్దెనెక్కిన సమ్మక్క

రాజాపేట మండలంలోని చల్లూరు, చిన్న మేడారం గ్రామాల్లో..గద్దెనెక్కిన సమ్మక్క

రాజాపేట, వెలుగు: రాజాపేట మండలంలోని చల్లూరు, చిన్న మేడారం గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, భారీ బందోబస్తు మధ్య జాతర రెండో రోజు గురువారం సమ్మక్క గద్దె నెక్కింది.  సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో జాతర ప్రాంగణానికి చేరుకున్నారు. 

 భక్తులతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం రోజు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 

పెన్‌‌పహడ్, వెలుగు:  పెన్‌‌పహడ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామ సమీపంలో కొలువైన  సమక్క- సారలమ్మ  జాతర రెండో రోజు గురువారం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  ఆలయ నిర్వహకులు జాతర సందర్భంగా రాష్ట్ర స్థాయి మహిళా కోలాటం పోటీలను ప్రారంభించారు.

 భక్తులకు దేవి రెడ్డి   కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్  తూముల భుజంగరావు, పెన్ పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి అమ్మవార్లను దర్శించుకొని  ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి,  సర్పంచ్ నాతల వెంకట్ రెడ్డి,  గుత్తి కొండ రాంరెడ్డి , మాజీ  సర్పంచ్ బండి ధనమ్మ పాల్గొన్నారు.