సమ్మక్క– సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ.. రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి

సమ్మక్క– సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ.. రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి
  • రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, కిషన్​రెడ్డి
  • రీసెర్చ్​లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తది
  • త్వరలో కొత్త క్యాంపస్​కు శంకుస్థాపన చేస్తామని వెల్లడి
  • భవన నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలి: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: సమక్క–సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఎస్ఎస్​సీటీయూ) దేశంలోనే అత్యుత్తమ రీసెర్చ్ వర్సిటీగా నిలుస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్వరలో వర్సిటీని సందర్శించి కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యూనివర్సిటీ లోగోను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో సమ్మక్క–సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ (ములుగు వర్సిటీ)ని పొందుపర్చారని తెలిపారు.

‘‘మేము విభజన చట్టం చేయకపోయినా.. ములుగు యూనివర్సిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నం. వర్సిటీ లోగో ఆవిష్కరించడం ఆనందంగా ఉన్నది. వర్సిటీ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్​గఢ్ రాష్ట్రాల స్టూడెంట్లకు ఈ వర్సిటీ సేవలు అందిస్తుంది. లోకల్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకురావాలి. ఎంతో విలువైన దేశ ఆయుర్వేద విలువలు, గిరిజనుల ఆహారం గురించి కోర్సుల్లో చేర్చేలా చర్యలు తీసుకోవాలి. గిరిజన భాషల్లో కూడా పాఠ్యాంశ బోధన ఉండాల్సిన అవసరం ఉంది. ములుగు పరిసర ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించేలా చూడాలి’’అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది: కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి
యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే భవనాల నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని ధర్మేంద్ర ప్రధాన్​ను కోరినట్లు తెలిపారు. ‘‘వర్సిటీ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ కు ధన్యవాదాలు. యూనివర్సిటీ లోగో ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉంది. మోదీ నేతృత్వంలో సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సాధించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి అనుగుణంగా మోదీ ఈ వర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టారు. త్వరలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ జరుపుకోబోతున్నం’’అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ వైఎల్‌‌‌‌‌‌‌‌.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, అధికారులు పాల్గొన్నారు.