రాజ్యాంగమంటే అంబేద్కర్ రచించాడు అని మాత్రమే చాలామందికి తెలుసు.. కానీ..

రాజ్యాంగమంటే అంబేద్కర్ రచించాడు అని మాత్రమే చాలామందికి తెలుసు.. కానీ..

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు రాజ్యాంగాన్ని కంపల్సరీ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. పౌరులకు రాజ్యాంగంపై అవగాహన కలిగించాలి. భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చి 75 సంవత్సరాలై ఆజాద్​కా అమృతోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ జనబాహుళ్యంలో ఆశించిన మేరకు రాజ్యాంగం గురించిన అవగాహన, పరిజ్ఞానం కనిపించడం లేదు. రాజ్యాంగం గురించి ప్రచారం చేయడములో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి.

రాజ్యాంగంలోని అంశాలు,  స్థానిక,  రాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటు,  చట్టసభల సభ్యుల ఎన్నిక విధానం,  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి  ఎన్నిక,  గవర్నర్ల  నియామకం,  మొదలైన అంశాల పట్ల అవగాహన  కల్పించాలి.  చట్టాలు,  ప్రాథమిక హక్కులు,  సామాజిక భద్రత చట్టాల పట్ల  ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం జరగలేదు.

రాజ్యాంగమంటే అంబేద్కర్​ రచించాడు అని మాత్రమే చాలామందికి తెలుసు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలపై  అవగాహన లేదు.  కేంద్ర ప్రభుత్వం  ప్రతి పౌరునికి  ఆధార్ కార్డు ఇచ్చి పౌరసత్వ గుర్తింపు ఇచ్చినట్లే..  ప్రతి పౌరునికి రాజ్యాంగాన్ని ఉచితంగా అందించాలి.  రాజ్యాంగం పట్ల  'చైతన్య సదస్సులు' నిర్వహించాలి.  వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా,   కళారూపాల ద్వారా,  వాడుక బాషలో నాటక ప్రదర్శన ద్వారా గ్రామీణులకు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించాలి.

రాజ్యాంగాన్ని మార్చాలని,  రద్దుచేయాలనే వ్యూహాలను నిలువరించాలి.  జాతీయ స్థాయిలోచర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ప్రపంచ చరిత్రలోనే అరుదైన అపురూప రాజ్యాంగాన్ని, చట్టాలను రక్షించే పరిజ్ఞానం  చైతన్యం  వచ్చినప్పుడే రాజ్యాంగ ఫలాలు పేదవర్గాలకు అందుతాయి. చట్టాలు ప్రజలకు చుట్టాలు అనే విశ్వసనీయత  ప్రజల్లో నెలకొనేవిధంగా ప్రభుత్వం వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి.

రాజ్యాంగంతో ప్రగతిశీల పాలన
ఏడు  దశాబ్దాల స్వాతంత్య్ర చరిత్రలో అధికారంలో వున్న పార్టీలు  రాజ్యాంగబద్దంగా పాలనా వ్యవహారాలను నిర్వహిస్తే ఆశించిన ప్రజా సంక్షేమం,  సామాజిక, ఆర్థిక ప్రగతి  సిద్ధించేది.  ప్రజలలో రాజ్యాంగ అంశాలు ఆర్టికల్స్ పట్ల అవగాహన  పరిజ్ఞానం ఉంటేనే  ప్రగతిశీల సమాజం ఆవిర్భవిస్తుంది. నిజానికి రాజ్యాంగం గురించి తెలిస్తేనే  ప్రజలు  పాలకులను,  ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తారు.

పాలనలో పౌరుల సంపూర్ణ భాగస్వామ్యం పెరిగి రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న స్వేచ్ఛ,  స్వాతంత్ర్యం సమానత్వం  సిద్ధించి  అందరికీ సమాన అవకాశాలు కలిగి  సామాజిక న్యాయం జరుగుతుంది.  ప్రజాసమస్యల పరిష్కార దిశగా  ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా ప్రజలను  మభ్యపెడుతున్నాయి.  పాలకులు కాలయాపన చేసి సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.  రాజ్యాంగంలో  పేర్కొన్న సంక్షేమ రాజ్య స్థాపన సంక్షోభాల నిలయం కావడం శోచనీయం.

విద్యార్థి దశలోనే రాజ్యాంగంపై అవగాహన కల్పించాలి
దేశంలో  కొంతమంది  మేధావులకు మాత్రమే రాజ్యాంగం మీద అవగాహన ఉంది.  రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహనవున్న అడ్వకేట్స్ సంఖ్య కొద్దిగానే ఉంది.  విద్యావంతులు,  మేధావులు,  రాజ్యాంగ నిపుణుల  సూచనలు, సలహాలు  పాటించే  పాలకులు కరువయ్యారు.  అధికారంలోవున్న రాజకీయ పార్టీలకు  శ్రద్ధ లోపించింది. రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు,  రాజ్యాంగం,  చట్టాలపట్ల  శిక్షణ తరగతులు నిర్వహించాలి.

దేశ చరిత్ర, సంస్కృతిపై అవగాహన ఉన్న అభ్యర్థులకే  ఎన్నికల్లో  టికెట్లు ఇవ్వాలి.   ప్రజల అభివృద్ధికి ఏమి చెయ్యాలి? ఎలా చేయాలి? అన్న అంశాల మీద పరిజ్ఞానం ఉన్నవారే ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు కృషి చెయ్యాలి.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసినట్లు ప్రభుత్వం ప్రతి ఇంటికి రాజ్యాంగాన్ని కానుకగా ఇవ్వాలి.  విద్యార్థి దశలోనే  ప్రజాస్వామ్యం,  రాజ్యాంగంపైన అవగాహన,  చైతన్యం కలిగించాలి. 

నేదునూరి కనకయ్య, మాజీ కరస్పాండెంట్, జస్టిస్ కుమారయ్య లా కాలేజీ