మళ్లీ మొదలైన ఇసుక అక్రమ రవాణా

మళ్లీ మొదలైన ఇసుక అక్రమ రవాణా
  •     మామూళ్ల మత్తులో ఆఫీసర్లు 

జైపూర్, వెలుగు : ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని చెప్పిన ఆఫీసర్లు.. ఆ విషయాన్ని గాలికి  వదిలేయడంతో మాఫియా మళ్లీ చెలరేగుతోంది. జైపూర్​ మండలంలోని రసూల్ పల్లి వాగు నుంచి ఇసుకను తోడేస్తున్నారు. గత ఫిబ్రవరిలో పోలీసులు,రెవిన్యూ ఆఫీసర్లు రసూల్​పల్లి వాగు నుంచి  ఇసుకను అక్రమంగా తరలించి పలు చోట్ల డంపులు చేసిన 150 ట్రిప్పులను సీజ్ చేశారు. మండల కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ, ఉప సర్పంచ్, ఓ ప్రజాప్రతినిధిపై కేసులు నమోదు చేశారు. 

దీంతో అప్పటి నుంచి అక్రమ రవాణా సర్దుమనిగింది. అయితే, సంబంధిత ఆఫీసర్లు మామూళ్ల మత్తులో ఉండడంతో వారం రోజుల క్రితం నుంచి మళ్లీ అక్రమ రవాణా జరుగుతోందని గ్రామస్తులు  పేర్కొన్నారు. గతంలో చేసినవారే రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలించి గ్రామ సమీపంలోని చెట్ల పొదల చాటున  డంప్ చేసి, అక్కడి నుంచి గుట్టుగా లారీల ద్వారా దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.