మానేరులో మళ్లీ ఇసుక దందా.. 12న తెరుచుకున్న 6 రీచ్​లు

మానేరులో మళ్లీ  ఇసుక దందా.. 12న తెరుచుకున్న 6 రీచ్​లు

 

  • రోజూ వందలాది లారీల్లో తరలింపు ఎన్జీటీ, సుప్రీం ఆదేశాల మేరకు 
  • జూన్​ 20న తవ్వకాలు, రవాణాను నిలిపివేసిన డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ 
  • 23 రోజుల్లోనే రవాణాపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కమిటీ.. దీంతో మళ్లీ మొదలైన ఇసుక తరలింపు

కరీంనగర్, వెలుగు: మానేరు నది తీరాన మళ్లీ ఇసుక దందా షురూ అయింది. ఇల్లీగల్​గా తవ్విన ఇసుకను ఇప్పుడు యథేచ్ఛగా తరలిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా తోడిన ఇసుకను మానేరు నదిలో పోయకుండా.. వాణిజ్య అవసరాలకు తరలించడం చర్చనీయాంశమైంది. ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ తో ఇసుక తవ్వకాలు, ట్రాన్స్​పోర్టేషన్​పై డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ గత నెల 20న నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చింది. 


ఏమైందో తెలియదు కానీ.. ఈ నెల 12న కమిటీ ట్రాన్స్​పోర్టేషన్​పై మాత్రం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. కమిటీ ఇట్లా నిర్ణయం వెనక్కి తీసుకోవడం వెనుక ప్రభుత్వ పెద్దలపై ఇసుక మాఫియా ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 12 నుంచి మల్లారెడ్డిపల్లి బ్లాక్ 1, బ్లాక్ 2, చల్లూరు, పోతిరెడ్డిపల్లి, కొండపాక బ్లాక్ 2, కోరెకల్ రీచుల్లో ఇసుక బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఆరు రీచ్​లకు రోజూ వందలాది లారీలు వచ్చివెళ్తున్నాయి. 

23 రోజుల్లోనే మారిన నిర్ణయం

మానేరు నదిలో ఇసుక మైనింగ్ యాక్టివిటీని నిలిపివేయాలని నిరుడు డిసెంబర్​లో నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్జీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను కేవలం మానేరుకు అటువైపు ఉన్న పెద్దపల్లి జిల్లాకే పరిమితం చేసి.. ఇటువైపున్న కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టారు. టీఎస్ఎండీసీ కూడా ఇందుకు సహకరించింది. దీంతో గడీల రఘువీర్ రెడ్డి అనే యాక్టివిస్ట్​ ఎన్టీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్(ఈసీ) లేకుండా మానేరులో చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అంతేగాక వాణిజ్య అవసరాలకే ఇసుకను తవ్వుతున్నందున ఎన్విరాన్​మెంటల్ క్లియరెన్స్ తప్పనిసరని ఎన్టీటీ చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒకవేళ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పొంది ఉంటే కాంట్రాక్ట్ ఏజెన్సీ తవ్వకాలు కొనసాగించవచ్చని, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కరీంనగర్​ జిల్లాలోని వావిలాల, ఊటూరు, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరేకల్, పోతిరెడ్డిపల్లి, తనుగుల క్వారీల్లో తవ్వకాలపై స్టే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లు మేలో ఒక వారంపాటు ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల కోసం ఇసుక తవ్వకాలకు అనుమతించాలని హైకోర్టును మే 18న టీఎస్ఎండీసీ ఆశ్రయించగా.. జులై ఫస్ట్ వీక్ వరకు తవ్వకాలకు కోర్టు అనుమతించింది. 

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మానేరు నది పరిరక్షణ సమితి ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులపై జూన్ 13న స్టే విధించింది. అయినా తమకు సుప్రీంకోర్టు ఆదేశాల కాపీ అందలేదనే సాకుతో రాత్రీపగలు భారీ యంత్రాలు, వందలాది టిప్పర్లతో తవ్వకాలు సాగించి గుట్టల కొద్దీ ఇసుకను స్టాక్ యార్డులకు తరలించారు. ఎట్టకేలకు ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్​తో ఇసుక తవ్వకాలు, ట్రాన్స్​పోర్టేషన్​పై నిలిపివేత ఉత్తర్వులను డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ జారీ చేసింది. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణా జూన్ 20న నిలిచిపోయాయి. ఇది జరిగి 23 రోజుల్లోనే ఈ నెల 12న రీచ్​లు మళ్లీ తెరుచుకున్నాయి. డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ తన నిర్ణయం మార్చుకోవడంతోనే ఈ దందా మళ్లీ షురూ అయినట్లు తెలుస్తున్నది. ఇట్ల నిర్ణయం మార్చుకోవడం వెనక ప్రభుత్వ పెద్దలతో ఇసుక మాఫియా చేయించిన ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రం ఏపీలోనూ ఇట్లనే ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేపట్టడంతో ఎన్జీటీ 18 ఇసుక రీచుల్లో తవ్వకాలను నిషేధించడమేగాక పర్యావరణానికి జరిగిన నష్టానికి రూ. 8 కోట్ల ఫైన్ వేసింది. ఎన్జీటీ ఉత్తర్వులపై తాజాగా అక్కడి కాంట్రాక్టర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎన్జీటీ ఇచ్చిన తీర్పునే సమర్థించింది. 

ALSO READ :గ్రామాల నుంచి వీఆర్వోలను సాగనంపిన సర్కారు

ధ్వంసమవుతున్న రోడ్లు.. 

ఇసుక రీచులు నిర్వహిస్తున్న గ్రామాలతోపాటు ఇసుక లారీలు రాకపోకలు సాగించే గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. జమ్మికుంట, వీణవంక, మానకొండూరు మండలాల్లో భారీ లోడ్లతో వెళ్లే ఇసుక లారీలు, టిప్పర్ల కారణంగా రోడ్లు గుంతలమయమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో వాటిలోకి నీళ్లు చేరి పెద్దపెద్ద బొందలుగా మారుతున్నాయి. దీంతో వాహనాదారులు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారింది. చల్లూరు నుంచి వచ్చే ఇసుక లారీలు, టిప్పర్లతో మానకొండూరులోని రోడ్లన్నీ గుంతలమయంగా మారడం, దుమ్ము లేస్తుండడంతో  గ్రామస్తులు పలుమార్లు లారీలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. 

ఇల్లీగల్​గా తవ్విన ఇసుక బయటికి సరఫరా.. 

సాధారణంగా డ్యామ్ లు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, నదులు, కాల్వల మెయింటెనెన్స్ కోసం ఇసుక ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మాత్రమే స్థానిక అవసరాలకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పర్యావరణ అనుమతులు అవసరం లేదు. కానీ, వాణిజ్య అవసరాల కోసమే మానేరులో ఇసుక తవ్వకాలు చేపట్టినందున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ ఉత్తర్వులు వెల్లడిస్తున్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకంతా ఇల్లీగల్ గా తవ్వి తీసిందే. ఇలా పర్యావరణ అనుమతులు లేకుండా తోడిన ఇసుకను మళ్లీ మానేరు నదిలో పోయకుండా.. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇసుక రవాణాను కూడా ఆపాలి

ఇసుక మైనింగ్ యాక్టివిటీ మొత్తాన్ని నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. కానీ డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ,  టీఎస్ఎండీసీ అధికారులు మాత్రం తవ్వకాలను మాత్రమే నిలిపివేయాలని కోర్టు చెప్పిందని, రవాణాపై స్టే లేదని వక్రభాష్యం చెప్తున్నారు. వీళ్లకు అసలు ఆ ఇసుకంతా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఇల్లీగల్ గా తవ్విపోసిందే. కాబట్టి ఆ ఇసుకను తరలించడానికి వీల్లేదు. స్టాక్ యార్డు నదీ తీరంలోనే ఉన్నందున నదిలోకి తరలించడం పెద్ద విషయమేమీ కాదు. 
- సంది సురేందర్ రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి 

ట్రాన్స్​పోర్టేషన్​పై స్టే లేదు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు స్టేలో  ఇసుక తవ్వకాలు ఆపాలని మాత్రమే ఉంది. అందుకే డంపింగ్ చేయట్లేదు. ట్రాన్స్​పోర్టేషన్ పై స్టే లేదు కాబట్టి స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకను మాత్రమే అమ్ముతున్నం. సుప్రీంకోర్టు ఆర్డర్ పై న్యాయనిపుణులతో క్లారిటీ తీసుకున్నాకే రీచ్ లు ఓపెన్ చేసినం.  ట్రాన్స్ పోర్టేషన్ కు అనుమతులు ఇచ్చినం. 
- ఎం.శ్రీకాంత్, పీఓ, టీఎస్ఎండీసీ