
- ఇప్పుడు వీఆర్‌ఏలను తప్పించేందుకు ఏర్పాట్లు
- ఇకపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తిప్పలే
- వివిధ స్కీములకు అర్హుల ఎంపికపైనా ఎఫెక్ట్
- తలలు పట్టుకుంటున్న తహసీల్దార్లు
- తమను రెగ్యులరైజ్ చేసి,
- పే స్కేల్ ఇవ్వాలంటున్న వీఆర్‌ఏలు
- ఇతర శాఖల్లోకి పంపించే పనిలో ప్రభుత్వం
జయశంకర్ భూపాలపల్లి/ నెట్వర్క్, వెలుగు: రెవెన్యూ వ్యవస్థలో గ్రామ ప్రతినిధులుగా ఉన్న సుంకర్ల (వీఆర్ఏల) శకం ముగియబోతున్నది. ఊరిలోని రకరకాల భూములు, చెరువులు, గుట్టలు, వాగులు, వంకలు వాటి హద్దులపై సంపూర్ణ అవగాహన ఉన్న గ్రామ సహాయకులు ఇక చరిత్రగా మిగిలిపోనున్నారు. ధరణి అమల్లోకి వచ్చాక వీఆర్వోలను పక్కనపెట్టిన రాష్ట్ర సర్కారు.. ఇక ఇప్పుడు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లనూ తప్పించేందుకు సిద్ధమైంది. విద్యార్హతలను, సామర్థ్యాలను బట్టి ఇరిగేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్, మిషన్ భగీరథ తదితరశాఖల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. రెవెన్యూశాఖ నుంచి జారీ చేసే క్యాస్ట్, ఇన్‌కం, నేటివిటీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలుకొని వివిధ ప్రభుత్వ స్కీములకు అర్హులను గుర్తించడం వరకు వీఆర్‌ఏలదే కీలక పాత్ర. తప్పులతడకలా మారిన ధరణి వల్ల గ్రామాల్లో ఇప్పటికే భూసమస్యలు పెరగడం, ప్రభుత్వ భూములు, చెరువులు, గుట్టలు, వాగులు, వంకలు, వాటి శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్న తరుణంలో ఊరిలో మిగిలిన ఒక్కగానొక్క రెవెన్యూ ప్రతినిధిని కూడా తప్పించడంపై విమర్శలు వస్తున్నాయి.
కష్టం కానున్న సర్టిఫికెట్ల జారీ
ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా, ప్రభుత్వ స్కీములకు అర్హత పొందాలన్నా రెవెన్యూ శాఖ జారీ చేసే సర్టిఫికెట్లే కీలకం. ప్రభుత్వం తరఫున క్యాస్ట్, ఇన్‌కం, నేటివిటీ సర్టిఫికెట్లను జారీ చేసే బాధ్యత రెవెన్యూ శాఖదే. ఈ సర్టిఫికెట్లు జారీ చేసేముందు తహసీల్దార్లు గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల(వీఆర్వోల)తో ఫీల్డ్వెరిఫికేషన్ చేయించేవారు.
ఆ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం చేసి ఇస్తే తహసీల్దార్ ఫైనల్ సంతకం చేసి సర్టిఫికెట్ ఇష్యూ చేసేవారు. వీఆర్వోలను తొలగించాక.. వీఆర్ఏలతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రెవెన్యూ శాఖలో వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ ఉంది. చిన్న గ్రామాల్లో ఒక వీఆర్‌ఏ ఉంటే పెద్ద గ్రామాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు దాకా వీఆర్‌ఏలు పనిచేస్తున్నారు. గ్రామం యూనిట్‌గా సర్కారు అమలుచేస్తున్న దళిత బంధు, డబుల్ బెడ్రూంం ఇండ్లు, గొర్రెల పంపిణీ లాంటి స్కీములతో పాటు త్వరలో అమలు చేయనున్న గృహలక్ష్మి, బీసీలకు లక్ష సాయం లాంటి పథకాలకు అర్హులను గుర్తించేందుకు వీఆర్ఏలే కీలకమవుతున్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్‌లాంటి స్కీములు అర్హులకు దక్కేలా వీఆర్ఏలే ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నా.. వాళ్లు పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి రావడంతో తహసీల్దార్లు అన్నింటికీ వీఆర్ఏలపైనే ఆధారపడ్తున్నారు. ఇప్పడు వీఆర్ఏలను కూడా తొలగిస్తే ఫీల్డ్ వెరిఫికేషన్ ఎట్ల చేయాలో తెలియక తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు.
పెండింగ్‌లో భూసమస్యలు
ధరణి అమల్లోకి వస్తే ఇక భూసమస్యలే ఉండవంటూ వీఆర్వోలను తొలగించిన ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలనూ పక్కన పెడ్తున్నది. కానీ ధరణి వచ్చాక పాత సమస్యలు తగ్గకపోగా, కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ధరణిలో రెండున్నరేండ్లలో వివిధ సమస్యలపై 10 లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో ఊరిలో 100 నుంచి 300 వరకు భూ సమస్యలు పెండింగ్‌లో ఉండగా.. కోర్టుల్లో రోజుకు 50 నుంచి 100 దాకా సివిల్ కేసులు ఫైల్అవుతున్నాయి. గ్రామాల్లోని భూములు, వాటి సమస్యలపై అవగాహన ఉన్న వీఆర్వోలను తొలగించడంతో ఈ దరఖాస్తులను పరిష్కరించడం తహసీల్దార్లకు కష్టంగా మారింది. ప్రస్తుతానికి వీఆర్ఏల సాయంతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయిస్తున్నా.. ఇప్పుడు వాళ్లనూ తొలగిస్తే మరింత కష్టమయ్యే చాన్స్ ఉందని తహసీల్దార్లు అంటున్నారు.
పెరగనున్న కబ్జాలు
గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్‌ఏలకు అక్కడి భూములపై పట్టుంది. ఏయే సర్వే నంబర్లలో పట్టా, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్‌భూములు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి? ఏ చెరువు కింద ఎంత శిఖం భూమి ఉంది? ఏ గుట్ట పరిధిలో ఎంత లాండ్ ఉంది? వాగులు, వంకలు, వాటి గట్ల విస్తీర్ణం ఎంత? లాంటి వివరాలు వీఆర్‌ఏలకు కొట్టిన పిండి. దీంతో ఎవరైనా ప్రభుత్వ, శిఖం భూములను ఆక్రమిస్తే వెంటనే ఆ సమాచారం తహసీల్దార్లకు తెలిసిపోతుంది. తర్వాత అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడగలుగుతున్నారు. వాస్తవానికి ఈ అంశాలపై పట్టు ఉన్న వీఆర్వోలను పక్కనపెట్టినప్పటి నుంచే గ్రామాల్లో ప్రభుత్వ భూముల కబ్జాలు పెరిగిపోయాయనే ఆరోపణలున్నాయి. వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ భూములో మట్టి, మొరం దందా పెరిగిపోయాయి. అడపాదడపా వీఆర్‌ఏలు ఓ కన్నేసి ఉంచడం వల్లే కబ్జాదారులు, అక్రమ రవాణాదారులు కొంతైనా భయపడ్తున్నారు. ఆ వీఆర్ఏలను కూడా పక్కనపెడ్తే పల్లెల్లో రూలింగ్పార్టీ లీడర్ల ఆగడాలకు అడ్డు ఉండదనే ఆందోళన వ్యక్తమవుతుంది.
ALSO READ :తీన్మార్ | బొగత జలపాతాలు | మెహందీ పండుగ 2023 | క్రూజ్ షిప్ | కిడ్ మేడ్ మిషన్ | 17/07/2023
వారం రోజుల్లో ఫైనల్!
వీఆర్ఏల జేఏసీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ ఇటీవల చర్చలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 23,046 వీఆర్‌ఏ పోస్టులు ఉండగా.. 21,433 మంది పనిచేస్తున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వాలని వీఆర్ఏల జేఏసీ ప్రతినిధులు కోరుతున్నారు. ప్రస్తుతం వీఆర్‌ఏలలో డిగ్రీ, పీజీ పూర్తిచేసినవాళ్లు సుమారు 5 వేల మంది దాకా ఉన్నారు. వీరిలోంచి వెయ్యి మందిని పంచాయతీ సెక్రటరీలుగా తీసుకునే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. కానీ వారసత్వంగా వచ్చి, సరైన విద్యార్హతలు లేని వీఆర్ఏల పరిస్థితి ఏమిటనేది అంతుచిక్కడం లేదు. మొత్తం మీద వీఆర్ఏలను ఏ శాఖలకు కేటాయించాలి? ఎంత జీతం చెల్లించాలి? అనేది కేబినెట్ సబ్‌కమిటీ వారం రోజుల్లో ఫైనల్ చేసే అవకాశముంది.
గ్రామాల్లో సేవలు ఆగిపోతయ్..
వీఆర్ఏలను ఇతర శాఖలకు బదిలీ చేస్తే గ్రామాల్లో రెవెన్యూ సేవలు ఆగిపోతాయి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రభుత్వ స్కీములకు అర్హుల గుర్తింపు కష్టమవుతుంది. ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని వీఆర్‌ఏలు పోరాటం చేస్తే.. వాళ్లతో పాటు జనాలకు శిక్ష వేసినట్లుగా సర్కారు తీరు ఉంది.
- అబ్బు ప్రకాశ్ రెడ్డి, పెద్దకోడెపాక గ్రామ సర్పంచ్, హనుమకొండ జిల్లా
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎట్ల?
ఇప్పటికే గ్రామాల్లో పనిచేసే వీఆర్వోలను తీసేసిన్రు. ఇప్పుడేమో వీఆర్‌ఏలను ఇతర శాఖలకు పంపిస్తున్నరు. ఇట్లయితే క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల జారీ టైంలో ఫీల్డ్ వెరిఫికేషన్ ఎవరు చేస్తరు? గ్రామ సేవకుల ఉద్యోగాలను పర్మినెంట్ చేసి, వాళ్లను గ్రామాల్లోనే పనిచేసేలా చర్యలు తీసుకోవాలి.
‒ ఎన్‌రెడ్డి హంసరెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా