
- మూడేండ్లుగా పర్మిట్లు లేకుండానే హైదరాబాద్ తరలిస్తున్న మాఫియా
- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఆఫీసర్లు
నాగర్ కర్నూల్, వెలుగు: ఇసుక మాఫియా బరితెగించింది. నిన్నామొన్నటి వరకు వాగులను ఊడ్చేసిన బ్యాచ్ ఇప్పుడు ఏకంగా ఇరిగేషన్ శాఖ పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణం కోసం నిల్వ చేసిన ఇసుకను పట్నం తరలిస్తున్నారు. మైనింగ్ పర్మిట్ లేకుండా ప్రతి రోజు ఐదు పోలీస్స్టేషన్ల ముందు నుంచి ఇసుక లారీలు, టిప్పర్లు దర్జాగా వెళ్తున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఈ విషయం తెలిసినా అటు వైపు కన్నెత్తిచూడక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
రాత్రి, పగలు తేడా లేకుండా భారీ లారీలు, టిప్పర్లు ఇసుక తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని బైరాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గోకారం రిజర్వాయర్ నిర్మాణానికి నిల్వ చేసిన ఇసుక హైదరాబాద్‌కు తరలిస్తున్న విషయం బయటపడింది. గురువారం రాత్రి 10 లారీలు, టిప్పర్లను అడ్డుకొని జేసీబీతో సహా వెల్డండ పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు.
పనులు పెండింగ్‌లో పడడంతో..
డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గోకారం, ఎర్రవల్లి రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులను 2016లో ప్రారంభించారు. వీటి నిర్మాణం కోసం 2019లో ప్రభుత్వం డిండి వాగు నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కేటాయించింది. డిండి, చింతపల్లి వాగు నుంచి ఇసుకను తరలించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇసుకను గోకారం, భైరాపూర్ గ్రామాల మధ్య నిల్వ చేసింది. భూసేకరణ చెల్లింపులు, ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా పునరావాసం డబ్బులు పెండింగ్‌లో ఉండడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ రిజర్వాయర్ కట్ ఆఫ్ ట్రెంచ్ పనులు, సేరి అప్పారెడ్డి పల్లె నుంచి అజిలాపూర్ వరకు కెనాల్ పనులు ప్రారంభించింది.
ఆ తరువాత భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడం, చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈక్రమంలో కాంగ్రెస్ సర్కారు రైతులకు భూసేకరణ పరిహారం చెల్లించింది. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా పునరావాసానికి రూ.17కోట్లు కేటాయించింది. త్వరలో రిజర్వాయర్, కాల్వల పనులు మొదలు కావాల్సి ఉండగా, ప్రభుత్వం కేటాయించిన రూ.3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకలో దాదాపు 80శాతం వరకు తరలించడం గమనార్హం. దీంతో ఇసుక కొరత మరోసారి సమస్య అవుతుందని అంటున్నారు.
మూడేండ్లుగా అక్రమంగా తరలింపు..
2021లో గోకారం, ఎర్రవల్లి రిజర్వాయర్ పనులు, ప్రధాన కాల్వ పనులు నిలిచిపోవడంతో గోకారం, బైరాపూర్ మధ్య డంప్ చేసిన ఇసుకపై కన్నేసిన మాఫియా పర్మిట్లు లేకుండానే ఇసుకను అక్రమంగా తరలించడం మొదలుపెట్టింది. ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించాల్సిన ఇసుకను అక్రమంగా తరలించడం నేరమని తెలిసినా, కీలక శాఖల అధికారుల సహకారంతో లారీలు, టిప్పర్లు పెట్టి మరీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
ఐదేండ్ల కింద పనులు నిలిచిపోవడంతో నిల్వ చేసిన ఇసుక డంపులపై చెట్లు మొలిచి అడవిలా మారింది. ప్రతి లారీ, టిప్పర్‌కు ముందు ఒక కారు ఎస్కార్ట్‌గా పెట్టి, ఇతర వ్యక్తులు అడ్డుకుంటే మాఫియా రంగంలోకి దిగుతోంది.16 టైర్ల లారీలో50 నుంచి 60 టన్నుల వరకు ఇసుక తరలిస్తున్నారు. ఇకనైనా ఇసుక తరలింపును అడ్డుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.